ప్రతిపక్ష ఎంపీల టీ షర్టులపై మింటా దేవి ఫొటో.. ఇంతకు ఎవరీమె..

ఈసీ తీరుపై పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల నిరసన..;

Update: 2025-08-12 12:28 GMT

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం(ECI) తొత్తుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక(Karnataka) రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మహాదేవపుర సెగ్మెంట్‌లో ఓటరు జాబితాలో అవకతవకలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత ఇటీవల ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇదే అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందంటూ పార్లమెంటు ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. ఈసీ తీరును తప్పుబడుతూ వారంతా కేంద్ర ఎన్నికల కార్యాలయం వరకు చేపట్టాలనుకున్న ర్యాలీని సోమవారం (ఆగస్టు 11వ తేదీన) పోలీసులు అడ్డుకున్నారు. తమ నిరసనకు కొనసాగింపుగా మంగళవారం భారత కూటమి ఎంపీలు 'మింటా దేవి' బొమ్మతో ఉన్న టీ-షర్టులు ధరించి పార్లమెంటు ఆవరణలో కనిపించారు.


'124 నాటౌట్'..

బీహార్(Bihar) రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ (SIR)పై పెద్ద వివాదమే నడుస్తోంది. జూలై 1న ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 25వతేదీతో ముగిసింది. సర్వేలో 18 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు తేలింది. 26 లక్షల మంది వివిధ నియోజకవర్గాలకు షిఫ్ట్ అయ్యారని, రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న వారు 7 లక్షల మంది ఉన్నారని బయటపడింది.


ప్లకార్డులతో నిరసన..

ఇన్యుమరేటర్లు పక్కగా సర్వే చేసినా.. బీహార్‌కు చెందిన 'మింటా దేవి' వయసు 124 ఏళ్లని ఓటరు కార్డును బట్టి తెలుస్తోంది. వాస్తవానికి ఆమె వయసు 35 సంవత్సరాలు. ఇప్పటికి ఆమె ఒకసారి మాత్రమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మింటాదేవి వయసును తప్పుగా కనపర్చడం ప్రతిపక్షాలకు ఆయుధమైంది. ఆమె ఫోటో, వయసును ముద్రించి ఉన్న టీషర్టులను ధరించి ఈసీని తప్పుబట్టారు. ఈసీ, ప్రభుత్వం కుమ్మకయ్యాయని ఆరోపిస్తూ "స్టాప్ SIR", "ఓట్ చోరీ" ప్లకార్డులను కూడా ప్రదర్శించారు.

షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21తో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిస్తాయి. ఆ లోగా SIRపై చర్చ జరుగుతుందా? లేదా అన్నది వేచి చూడాలి. 

Tags:    

Similar News