పశ్చిమ బెంగాల్‌లో నేతాజీకి గుర్తుగా భద్రపరిచిన టీ కప్పు, సాసర్

సుభాష్ చంద్రబోస్‌ అరెస్టయిన సమయంలో బ్రిటీష్ అధికారి ఆయనకు టీ ఇచ్చారు. దాన్నినేతాజీ సున్నితంగా తిరస్కరించారు.;

Update: 2025-01-23 12:57 GMT

నేడు సుభాష్ చంద్రబోస్ జయంతి (Netaji Subhas Chandra Bose). ఆయన పుట్టిన రోజును యావత్ భారతావని ఘనంగా జరుపుకుంటోంది. అయితే పశ్చిమ బెంగాల్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌కు నేతాజీతో చారిత్రక సంబంధం ఉంది. అదేమిటో తెలుసుకుందాం..

ఇది దాదాపు 93 ఏళ్ల క్రితం నాటి సంగతి. 1931వ సంవత్సరం. అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతం.. జగద్దల్‌లోని గోల్ఘర్‌లో బెంగాల్ (West Bengal) జనపనార మిల్లు కార్మికుల సమావేశంలో వారినుద్దేశించి ప్రసంగించేందుకు నేతాజీ బయల్దేరారు. సమాచారం తెలుసుకున్న బ్రిటిష్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి నోపారా పోలీస్ స్టేషన్‌(Noapara police station)కు తీసుకెళ్లారు. ఇది నార్త్ 24 పరగణాల జిల్లాలోని శ్యామ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం కిలోమీటరున్నర దూరంలో ఉంటుంది. అక్కడ నేతాజీని కొన్ని గంటలు నిర్బంధించారు. ఆ సమయంలో నేతాజీకి టీ ఇచ్చారు. ఇచ్చిన వ్యక్తి బ్రిటిష్ అధికారి కావడంతో సున్నితంగా తిరస్కరించారు నేతాజీ. అలా నేతాజీ తాగకుండా వదిలేసిన సిరామిక్ కప్పు, సాసర్‌(ceramic cup and saucer)ను పోలీసు స్టేషన్‌లో భద్రపరిచారు.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడికి గౌరవ సూచకంగా స్టేషన్ ఆవరణలో ఒక చిన్న స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అందులో కప్పు, సాసర్ పక్కన నేతాజీ ఛాయాచిత్రం కనిపిస్తాయి. స్టేషన్ లోపల నేతాజీ జీవితంపై ప్రచురించిన పుస్తకాలతో ఒక గదిని లైబ్రరీగా మార్చారు. ఏటా సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజున స్మారక గదిని ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు.

అలా అరెస్టయిన నేతాజీని అక్టోబర్ 12న అర్ధరాత్రి సమయంలో అప్పటి బరాక్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ జోక్యంతో విడుదల చేశారు. అయితే బోస్ మూడు నెలల పాటు నోపారాలోకి ప్రవేశించకూడదనే షరతును న్యాయమూర్తి విధించారని నేతాజీ పరిశోధకుడు జయంత చౌదరి తెలిపారు. నోపారా పోలీస్ స్టేషన్ బరాక్‌పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది.

ఇక్కడ పనిచేయడం మా అదృష్టం..

"మా ప్రియమైన నేతాజీ అడుగుపెట్టిన ఈ పోలీస్ స్టేషన్‌లో పనిచేయడం మా అదృష్టమని మేము భావిస్తాం. ఆయనే మాకు స్ఫూర్తి. ఆయనను అరెస్టుకు ఈ స్టేషన్‌కు తీసుకొచ్చిన విషయం చాలా మందికి తెలియదు." అని ఒక సీనియర్ పోలీసు అధికారి PTI కి చెప్పారు.

Tags:    

Similar News