ప్రజలకు మతం మత్తు ఎక్కిస్తున్న బీజేపీ
దేశంలోనూ, బీజేపీ ఆనవాళ్లే లేని ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రజలకు మతం మత్తు ఎక్కించే పనిలో బీజేపీ ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు.
ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం, అభివృద్ధిని చూడాలి. అందుకోసమే ప్రజలు ఎన్నుకున్నారు. అయితే ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటములు ప్రజలను మతం మత్తులోకి దించుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. శనివారం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఏపీయూడబ్ల్యుజే ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ దేశంలో మతోన్మాదాన్ని పెంచే పనిలో బీజేపీ ఉందన్నారు. మణిపూర్ లో అల్లర్లకు బీజేపీ యే కారణమని, అక్కడి అల్లర్లను ఆపేందుకు కనీసం మాత్రం చర్యలు కూడా తీసుకోలేదన్నారు. ఒక మహిళను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించిన హొందూ మత ఉన్మాదును నియంత్రించడంలో మోదీ విఫలమయ్యారని, పైకి తనకు తాను విశ్వ గురువుని ప్రకటించుకొని చూసే వారిని ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడం వెనుక రాజ్యాంగాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
నిరుద్యోగం పెరుగుతోందని, పేదలకు కనీసం పని కూడా దొరికే పరిస్థితులు లేవని, రైతుల రుణమాఫీపై నోరు ఎత్తటం లేదని, పేదల శ్రమను దోపిడీ చేసి వారి ద్వారా సృష్టించిన సంపదను బ్యాంకుల నుంచి పెట్టుబడుల రూపంలో బడా బాబులకు ఇచ్చి తరువాత వారి రుణాలు రద్దు చేసి దోపిడీ ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం మారిందన్నారు. పని కల్పించి ఆ పనిద్వారా సంపద పెంచుకునే పని మానేసిన కూటమి ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని గ్రామాల్లో దేవాలయాల నిర్మాణాలపై దృష్టిపెట్టేలా పేదలపై వల విసురుతున్నారన్నారు. ఇందులో సక్సెస్ కావడంతో పేదరికం మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలను తమ వంతుగా చైతన్య వంతులను చేసి ముందుకు నడిపించడంలో తమ ప్రయత్నం తాము చేస్తున్నా బూర్జువాల మాటలు ప్రయలను ఆకట్టుకుంటున్నాయన్నారు. తరువాత వచ్చే కాలాల్లో ప్రజలు బాధ పడకూడదనే వారిని నిత్యం చైతన్య వంతం చేస్తూనే ఉంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు రాష్ట్రానికి కేంద్రం కల్పించాల్సిన సౌకర్యాలు, నిధుల గురించి మరిచి పోయిన మోదీ చెప్పిన ప్రతి దానికీ తలూపుతున్నారన్నారు. వీరు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడంలో ముందున్నారని, ఆధునిక, సాంకేతికతతో ముందుకు పోతున్న సమాజాన్ని తిరిగి మతోన్మాద యుగానికి తీసుకుపోవడంలో ఇద్దరూ ఒకటేనన్నారు.
ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకోవడం అనేది సాధారణ విషయమని, ఎన్నికలైన తరువాత ప్రభుత్వంలో ఉండాలా? వద్దా అనేది ఆ ప్రభుత్వ విధానాలను బట్టి సీపీఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇండియా కూటమిలో ఎన్నికల తరువాత కూడా కొనసాగుతారా? అధికారంలోకి వస్తే అందులో పాలుపంచుకుంటారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ దేశంలో అయినా, రాష్ట్రంలో అయిన పొత్తులు అనేవి ఎన్నికల వరకు మాత్రమే పరిమితమనని చెప్పారు. అది ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే మా బలం మాకు తెలుసు కాబట్టి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంటే ప్రజల తరపున మాట్లాడే అవకాశం ఉంటుందనే ఉద్దశ్యంతో మాత్రమేనన్నారు.
రాష్ట్రంలో యువత, విద్యార్థి ఉద్యమాలను బలో పేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాతీయ మహాసభల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు చెప్పారు. సీపీఐ బలం తగ్గిందని అంగీకరిస్తూ అందుకే పార్టీ ఎన్నికల గుర్తును కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వామపక్ష ఉద్యమాల బలం తగ్గటానికి ప్రధాన కారణం నావరకు నేను అనే స్వార్థం ప్రజల్లో పెరగటమేనన్నారు. సమాజాం విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే యువతరం నేరు కరువైందన్నారు.
ఈవీఎం లను పాలక బీజేపీ వారు మ్యానేజ్ చేసి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారనే ఆరోపణలపై వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ బీహార్, కర్నాటకలో ఈవీఎంలన మ్యానేజ్ చేసేందుకు బీజేపీ వ్యూహంతో ఉందని, ఓటర్ల చేర్పులు, మార్పుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు. ఏపీలో ఆ పరిస్థితులు జరిగాయనేందుకు ఆధారాలు లేవని, అందువల్ల ఏపీ ఎన్నికల్లో ఈవీఎం ల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పలేమన్నారు.
ప్రైవేటీ కరణ వైపు వెళుతున్న ప్రభుత్వాలు ప్రజల సంపదను పెట్టుబడి దారులకు దోచి పెట్టేందుకేనన్నారు. ఇప్సటి వరకు ఉన్న మూడు పీ ల పక్కన మరో పీ చేర్చిన సీఎం ప్రజలను ఒప్పించి పెద్దల ముందు తల దించుకుని బతకాలని ఆదేశించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీపీకీ ఓటేలేని ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ తన ఎత్తుగడల ద్వారా పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోందని, తాము ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నందున అది సాధ్యం కాదన్నారు. మీట్ ది ప్రెస్ లో ఈశ్వరయ్యతో పాటు సీనియర్ జర్నలిస్టులు జయరాజ్, చావా రవి, దారం వెంకటేశ్వర్లు, ఎస్కే బాష లు పాల్గొన్నారు.