వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఎందుకు అంతలా కన్నీరు పెట్టారు?

దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఆయన సతీమణి వైఎస్. విజయమ్మ ఎందుకు అంతలా కన్నీరు పెట్టారు. ఈ పరిస్థితి వెనుక కారణం ఏంటి?

Update: 2024-07-08 08:15 GMT

దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్. విజయమ్మ తల్లడిల్లారు. ఆ తల్లి మనసులో గూడుకట్టుకున్నవేదన కన్నీటి రూపంలో జలజలారాలింది. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్లో సోమవారం ఉదయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్విగ్న క్షణాలు రాజ్యమేలాయి. వైఎస్. విజయమ్మ అంతలా ఎందుకు రోధించారు. తల్లి వేదనతో తనయుడు వైఎస్. జగన్ వదనం కూడా శిషణ్ణంగా మారింది. అక్కను ఓదార్చడం సోదరుడు రవీంద్రనాథరెడ్డికి కూడా సాధ్యం కాలేదు. అతికష్టంపై వైఎస్. విజయమ్మను ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి తోడ్కొని వెళ్లారు.

2009 సెప్టెంబర్ రెండో తేదీ డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి భెల్ హెలికాప్టర్లో చిత్తూరులో ఏర్పటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. నల్లమల అటవీప్రాంత ఉపరితలంపై కాప్టర్ ప్రయాణిస్తుండగా, ప్రతికూల వాతావరణం నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దట్టమైన మేఘాల్లో చిక్కుకున్న కాప్టర్ దారీతెన్ను తెలియని స్ధితిలో కర్నూలుకు సమీపంలో నల్లమల అటవీప్రాంతంలో పావురాలగుట్టపై కాప్టర్ కూలిన ఘటనలో దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కార్యదర్శి డాక్టర్ పీ. సుబ్రమణ్యం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మరణించిన విషయం తెలిసిందే.
ఇడుపులపాయలో అంతిమ వీడ్కోలు
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి భైతిక కాయాన్ని ఇడుపులపాయ ఎస్టేట్లో ఖననం చేశారు. అప్పటి నుంచి ఏటా వైఎస్ఆర్ వర్ధంతి, జయంతి రోజు ఆయన కుటుంబీకులే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు, అభిమానులు వైఎస్ఆర్ కు నివాళులర్పిస్తూ, తమకు జరిగిన మేలును తలుచుకుంటూ ఉంటారు. అయితే,
ప్రత్యేక ప్రార్ధన
వైఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతిని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెకు సమీపంలోని ఇడుపులపాయ ఘాట్ లో ఘనంగా నిర్వహించారు. ఏడాదికి రెండుసార్లు వైఎస్ఆర్ ఘాట్ లో జరిగే కార్యక్రమాలకు చర్చి పాస్టర్లు వచ్చి, ప్రార్ధనలకు వైఎస్ కుటుంబీకులు మొత్తం హాజరుకావడం, తల్లి విజయమ్మ చెంత ఇద్దరు బిడ్డలు వైఎస్. జగన్, వైఎస్. షర్మిళ పక్కపక్కనే కూర్చునే వారు.
వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలకు ఆయన సతీమణి వైఎస్. విజయమ్మ, సోదరి విమలమ్మ, కొందరు కుటుంబీకులు, పార్టీ నాయకులు ముందుగానే చేరుకున్నారు. అప్పటికే చాలా మంది సందర్శకులు ఉన్నారు. ఆ తరువాత పార్టీ నాయకులతో కలిసి పులివెందుల క్యాంప్ కార్యాలయం నుంచి మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఆ తరువాత వైఎస్ఆర్ చెల్లెలు వైఎస్. విమలమ్మ ప్రత్యేక ప్రార్ధన చేశారు.


"దయగల యేసయ్యా.. మా ప్రభువా.. మాకు రక్షకుడవు నీవు. ఏ కష్టంలో ఉన్నా ఎదిరించే శక్తి ఇచ్చేది నీవే. అందుకోసం ప్రార్ధిస్తున్నాం. నీ సన్నిధికి చేరిన మా అన్న వైఎస్. రాజశేఖరరెడ్డి బిడ్డలకు.. మీరు మాతో ఉన్నాం. అని నమ్ముతున్నాం. వైఎస్ కుటుంబం ఈ మాదిరి ఉన్నదంటే.. రాష్ట్ర ప్రజల కష్టం ఉంది. ప్రజలందరిపై నీ కృపాకటాక్షాలు కురిపించు తండ్రీ" అని ప్రార్ధిస్తూ వైఎస్. విమలమ్మ వందనాలు సమర్పించారు. ప్రత్యేక ప్రార్ధన సాగిన సుమారు 15 నిమిషాల పాటు వైఎస్ఆర్ సమాధివద్ద ఎవరు కూర్చోకుండా, నిలబడే ఉన్నారు.


ఆ తల్లి కంట ఆగని కన్నీరు
ఆ ప్రార్ధన ముగియగానే తల్లి వైఎస్. విజయమ్మను అక్కున చేర్చకునే సమయం నుంచి ఉద్విగ్న క్షణాలతో వైఎస్ఆర్ ఘాట్లో వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు వైఎస్. విజయమ్మ గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న వేదన కన్నీరుగా జలజలరాలింది. భరించలేని దుఖంతో తన కుమారుడు వైఎస్. జగన్ నుంచి పక్కకు రాలేకపోయారు. తల్లి వేదన చూసిన కుమారుడు జగన్ వదనంలో కూడా విషాధం కనిపించింది. ఇక భరించలేని స్థితిలో తల్లి నుంచి ఆశీర్వచనం తీసుకున్న వైఎస్. జగన్ అందరి నుంచి వీడ్కోలు తీసుకుంటూ, ముందుకు కదలారు. అంతకుముందు అక్క విజయమ్మతో కాస్త కులాసాగానే మాటలు సాగించిన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పీ. రవీంద్రనాథరెడ్డి దగ్గరకు చేరుకుని సముదాయించే యత్నం చేశారు.
ఆ తల్లి మనసు అంతలా ఎందుకు తల్లడిల్లిందో తెలియదు కానీ, తమ్ముడు రవీంద్రనాథరెడ్డిని హత్తుకుని రోధించారు. జలపాతంలో వస్తున్న కన్నీటిని ఒకపక్క తుడుచుకుంటూనే, విజయమ్మ తనను తాను నిభాళించుకోలేని స్ధితికి చేరుకున్నారు. అక్కను అక్కున చేర్చుకున్న రవీంద్రనాథరెడ్డి చాలా సేపు అనునయిస్తూ, ఊరడించారు. ఊహించని ఈ పరిణామంతో వైఎస్ కుటుంబీకులంతా బరువెక్కిన హృదయంతోనే ఆమెను సముదాయించడానికి ప్రయత్నించారు. ఈ దృశ్యాలు ఇడుపులపాయ ఘాట్ కు వచ్చిన నేతలు, అభిమానులను కూడా కలచి వేసింది. ఇక సాధ్యం కాని స్ధితిలో వదిన విజయమ్మను వైఎస్ఆర్ సోదరి వైఎస్. విమలమ్మ ఇంకొందరు ఘాట్ నుంచి బలవంతంగా తోడ్కొని వెళ్లారు.
ఎందుకు అంతలా ఏడ్చారు...
సాధారణంగా గత స్మృతులు గుర్తుకు వస్తే, ఎవరికైనా తెలియకుండానే కన్నీరు వస్తుంది. హృదయాన్ని ద్రవింప చేసే దృశ్యాలు చూసినా, అలాగే జరుగుతుంది. ఇడుపులపాయ ఘాట్లోకి వచ్చినప్పడు కూడా వైఎస్. విజయమ్మకు కుటుంబమంతా కలిసి ఉన్న రోజులు, వైఎస్ఆర్ సరదా చలోక్తులు, మీగింగ్లో మాట్లాడే తీరు వంటి జ్షాపకాలు మరిచిపోలేనివి. కానీ, గతంలో ఎన్నడూ ఆమె ఇడుపులపాయలో ఇంతలా తల్లడిల్లిన సందర్భాలు కనిపించలేదనేది వారికి దగ్గరగా మసిలే వ్యక్తులు చెప్పే మాట. అందుకు తాజా పరిస్థితులు కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు.
వైఎస్. వివేకానందరెడ్డి హత్య నేపథ్యలో వైఎస్ఆర్ కుటుంబంలో స్పర్థలు వచ్చాయి. ఇద్దరు బిడ్డలు వైఎస్. జగన్, వైఎస్. షర్మిళ శత్రువులుగా మారిపోయారు.
"మా అన్నకు నేను పెద్ద కూతురిని"అని గర్వంగా... "జగనన్న వదిలిన బాణాన్ని" అని సగర్వంగా ప్రకటించిన ఏకైక కుమార్తె వైఎస్. షర్మిళ తండ్రికి నివాళులు అర్పించడానికి రాలేదు. "గతంలో తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద అన్నా, చెల్లెలు తన సమక్షంలో పక్కపక్కనే కూర్చుని నివాళులు అర్పించేవారు. ప్రార్ధనలు ముగిశాక తండ్రి సమాధి వద్ద నుంచి కదలడానికి సుతారం ఇష్టపడే వారు కాదు" కానీ ప్రస్తుతం విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. వైఎస్. షర్మిళ నివాళులు అర్పించిన వెళ్లిన తరువాత, సమాచారం అందుకున్న వైఎస్. జగన్ పార్టీ నాయకులు, సోదరుడు కడప ఎంపీ వైెఎస్. అవినాష్ రెడ్డితో కలిసి వచ్చారు. 

ప్రభువా.. వారిని ఎందుకు ఇలా చేశావు తండ్రీ అని వైఎస్. విజయమ్మ మదిలో గూడుకట్టుకున్న సుడిగుండం కన్నీటి రూపంలో లావాలా ఉప్పొంగిందా? మొన్నటి వరకు సీఎం హోదాలో రారాజులా ఉన్న కుమారుడు వైఎస్. జగన్ కు ఇంతలా శిక్ష వేశావు. ఎందుకు తండ్రీ, ఆ బిడ్డలను కాపాడు. అని వేడుకుంటూ విజయమ్మ కన్నీరుమున్నీరు అయ్యారా? ఆ వేదన, కన్నీటితో ప్రశ్నించారా? కుటుంబంలో ఏర్పడిన కలతలతో ఇద్దరు బిడ్డలు వైఎస్. జగన్, వైఎస్. షర్మిళ ఎడముఖం పెడముఖంగా బద్దశత్రువులుగా మారిన నేపథ్యంలో వైఎస్. విజయమ్మ తీవ్రంగా కలత చెందుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.


దీనికి తోడు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చోటుచేసుకుంటున్నపరిణామాలతో ఆమె ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. అటు కుమారుడితో ఉండాలా? ఇటు కుమార్తెతో ఉండాలా? అనేది తేల్చుకోలేని స్థితిలో భర్త వైఎస్ఆర్ సమాధి వద్ద ఆమె గుండెలోతుల్లో ఉన్న దుఖం తన్నుకువచ్చినట్లు కనిపిస్తోంది. తన వేదన మాటల్లో చెప్పలేని ఆమె తన వేదనను కుమారుడు వైఎస్. జగన్, తమ్మడు పీ. రవీంద్రనాథరెడ్డి వద్ద కన్నీటితో వేదన పంచుకున్నట్లు అక్కడి పరిస్థితి చెప్పకనే చెబుతోంది. ఈ పరిణామంతో వైఎస్ఆర్ ఘాట్ సోమవారం మరింత విషాధకర వాతారణం ఏర్పడింది. అందరూ అమ్మా.. అని పిలిచే విజయమ్మ కంట కన్నీరు చూసి, గుడ్లనీరు కక్కుకుంటూ కనిపించారు. దీంతో ఆమెను ఘాట్ వద్ద ఎక్కువ సేపు ఉంచకుండా ఆడబిడ్డ వైఎస్. విమలమ్మ, వైఎస్ఆర్ కుటుంబీకులు విజయమ్మను అక్కడి నుంచి తీసుకుని వెళ్లడం చూసి, అభిమానులు కూడా కన్నీటిపర్యంతం అయ్యారు.
అంతకుముందు కుమారుడు వైఎస్. జగన్ తో కలిసి భర్త వైఎస్ఆర్ సమాధికి పుష్పాంజలి ఘటించారు.
Tags:    

Similar News