ttd svims | 304 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాన్ని వెల్లడించిన టీటీడీ చైర్మన్

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-18 13:08 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ ( Sri Venkateswara Institute of Medical Sciences SVIMS) కార్పొరేట్ ఆస్పత్రిలో 304 పోస్టులు భర్తీ చేయాలని తీర్మానించారు. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఆధ్వర్యంలో స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్  (Governing Council ) మీటింగ్ మంగళవారం జరిగింది.


తిరుమలలో అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ. కుమార్, బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో స్విమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న 236 స్టాఫ్ నర్సు పోస్టులు, 20 మంది పారా మెడికల్ సిబ్బంది, 48 అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సదాశివరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి.కుమార్, పాల్గొన్నారు.

వేసవి సెలవుల్లో విద్యార్థులకు పోటీలు

ఈ ఏడాది వేసవి సెలవుల్లో తెలుగు రాష్ట్రాల్లోని 8,9,10వ తరగతి విద్యార్థులకు ''సద్గమయ'' అనే కార్యక్రమంలో పోటీలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు.
తిరుమల అన్నమయ్య భవన్ టీటీడీ పాలక మండలి సమావేశం తరువాత హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మంగళవారం జరిగిన ఈ సమావేశంలో హిందూ ధర్మ ప్రచారం మరింత విస్తృతం చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు‌. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు. పాఠశాల విద్యార్థుల్లో నైతిక విలువలు, మానవీయ ధర్మాలు, వ్యక్తిత్వ నిర్మాణానికై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. దీనికోసం ''సద్గమయ'' అనే కార్యక్రమం ద్వారా పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా స్థాయిలో కళా ప్రదర్శనలు
తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన నిర్వహిస్తుంటారు. అఖండ హరినామ సంకీర్తన కోసం 7,856 భజన బృందాలు పేర్లు నమోదు చేసుకుని ఉన్నట్లు టీటీడీ చైర్మన్ నాయుడు వెల్లడించారు. ఈ బృందాల్లోని కళాకారుల ప్రదర్శనలు, పాటలు, సంకర్తీనల ఆలపానలో నాణ్యత పరిశీలించడానికి హందూ ధర్మప్రచార పరిషత్ అధికారులను టీటీడీ చైర్మన్ ఆదేశించారు. నాణ్యమైన కళలు, మెరుగైన కళాకారులను ఎంపిక చేయడం ద్వారా వారితో జిల్లా స్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటు చేయించాలని కూడా ఆదేశించారు. తద్వారా భజన ప్రదర్శనలు ఇచ్చే కళలు క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఈ టీటీడీ బోర్డు సభ్యులు జానకిదేవి, మహేందర్ రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, అధికారులు పాల్గొన్నారు.
Tags:    

Similar News