వైసీపీకి ఇద్దరు ఎంపీలు ఒకేసారి రాజీనామా.. కారణం చెప్పేసిన మోపీదేవి..
ఆంధ్ర రాజకీయాలు మరోసారి అత్యంత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార అండ కోసమో.. మరే కారణమో కానీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిటీ కూటమి పార్టీల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికం అవుతోంది.
ఆంధ్ర రాజకీయాలు మరోసారి అత్యంత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార అండ కోసమో.. మరే కారణమో కానీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిటీ కూటమి పార్టీల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికం అవుతోంది. ఎమ్మెల్యేలే, మేయర్లు సహా ఇప్పుడు ఈ పరంపర ఎంపీ వరకు వెళ్లింది. ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు సైతం పార్టీకి టాటా చెప్పారు. కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటే.. మరికొందరు ఏ పార్టీలో చేరాలన్న అన్న విషయంపై అనుచర వర్గంతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ షాక్‌లతో సతమవుతున్న వైసీపీకి తాజాగా ఇద్దరు ఎంపీలు దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చారు. రాజ్యసభ వైసీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ కూడా ఈరోజు ఫ్యాన్‌ను కట్టేశారు. వీరిద్దరు తమ పదవికి, పార్టీ సభ్యత్వానికి ఏకకాలంలో రాజీనామా చేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. వీరిద్దరు అనుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని, వారు అలా చేయడానికి కారణం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒకేసారి ఢిల్లీకి
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేయాలని నిశ్చయించుకుని బుధవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కలిసి చర్చించిన అనంతరం తమ రాజీనామా లేఖలను ఆయనకు అందించారు. తమ రాజీనామాను అంగీకరించాలని కోరారు.
టీడీపీ వైపు అడుగులు..
తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మోపీదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు అతి త్వరలో టీడీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వారి బాటలోనే ప్రయాణించడానికి మరికొందరు ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరు టీడీపీ వైపు చూస్తుంటే.. మరికొందరు బీజేపీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సందర్భంగా రాజీనామాకు ముందు మోపీదేవి వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయం ఏదో క్షణికావేశంలో, అప్పటికప్పుడు తీసుకున్న దుందుడుగు నిర్ణయం కాదని స్పష్టం చేశారు. బాగా ఆలోచించుకునే రాజీనామా చేయాలని నిశ్చియించుకున్నానని వెల్లడించారు.
దేనిపైనా సమీక్ష లేదు..
‘‘చాలా కాలంగా నేను తీవ్ర అసంతృప్తితో ఉన్నాను. ప్రజలకు ఎనలేని సంక్షేమాన్ని అందిస్తే వారు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదు. ఇంత ఘోర పరాజయం ఎదురైతే అందుకు కారణాలపై ఇప్పటివరకు పార్టీలో సమీక్ష జరగలేదు. పార్టీలో ఉన్న లోటుపాట్లపై కానీ, వాటిని సరిచేసుకోవడానికి తీసుకోవాల్సిన భవిష్యత్ నిర్ణయాలపై కూడా సమీక్ష చేయాలన్న ఆలోచన కూడా ఎవరిలోనూ కలగలేదు. ఇప్పటికి కూడా సమీక్ష అంటే రేపు అంటున్నారు. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీ స్థానం నాకు రావడం నాకే ఇష్టం లేదు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండాలని అనుకుంటాను. రాజీనామా చేస్తానని చెప్పాక.. నన్ను పార్టీలో ఉండాలని కోరారు. నాతో పార్టీ పెద్దలు చర్చించారు. కానీ నాకున్న సమస్యలను వారికి వివరించాను’’ అని అన్నారు.
సమస్యలు వస్తాయి.. సహజం..
‘‘ఇక ఇప్పుడు నేను వేరే పార్టీలో చేరతాను. అక్కడ ఇప్పటికే ఉన్న నేతలు, కార్యకర్తలతో చిన్నాచితక సమస్యలు వస్తాయి. అది సహజం. ప్రతి ఒక్కరికి తమ స్థానం ముఖ్యమే కదా. కానీ సమన్వయంతో ముందుకు వెళ్తాను. నా నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. టీడీపీ పార్టీ పెద్దలతో మాట్లాడాను. త్వరలో టీడీపీలో నేను, బీద మస్తాన్‌రావు కలిసి చేరతాం’’ అని ప్రకటించారు.