హాయ్.. అవినాష్ ఎలా ఉంది.. మన ఊరు..?
మూడు రోజుల పర్యటనకు పులివెందులకు వచ్చిన జగన్.;
By : SSV Bhaskar Rao
Update: 2025-09-01 14:36 GMT
మూడు రోజుల పర్యటన కోసం వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్. జగన్ సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్. రాజశేఖరరెడ్డికి నివాళులర్పించనున్నారు.
పులివెందులకు హెలికాప్టర్ లో వచ్చిన జగన్ కు హెలీపాడ్ వద్దే ఉన్న బాబాయ్ కొడుకు, కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించడం, కరచాలనం చేయడం ఆసక్తికరంగా కనిపించింది. పులివెందులలో జగన్ హెలిపాడ్ వద్ద సాధారణంగానే పులివెందుల సమీప ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకుడు జగన్ కు స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి పట్టణంలోని భాకరాపురం వద్ద ఉన్న నివాసం వద్దకు చేరుకునే వరకు కాస్త రద్దీ కనిపించింది.
వినతుల స్వీకరణ
పులివెందుల పట్టణంలోని క్యాంపు కార్యాలయంగా ఉన్న నివాసానికి చేరుకునే సరికి జగన్ కోసం పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు జమయ్యారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లగానే నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ అభిమానులు సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి క్యూ కట్టారు. వినతిపత్రాలు తీసుకుంటూనే జగన్ వారందరినీ పలకరించారు. ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డికి జగన్ సూచనలు చేశారు. తమ పార్టీ అధినేత జగన్ ను కలవడానికి నాయకులు యథావిధిగానే హాజరయ్యారు.
బద్వేలు ఎమ్మెల్యే హాజర్
కడప జిల్లాలో పులివెందుల, రాజంపేట, బద్వేలు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా పార్టీ మారుతారనే విషంయపై ఆరు నెలలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా, జగన్ ను పులివెందులలో సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో కలిశారు. కడప మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎస్. రఘురామిరెడ్డి (మైదుకూరు), డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి (జమ్మలమడుగు), నగర మేయర్ సురేశ్ బాబు, జగన్ మేనమామ పీ. రవీంద్రనాథరెడ్డి తోపాటు ఈసారి అదనంగా రాయచోటి నుంచ సుగవాసి బాలసుబ్రమణ్యం అదనంగా హాజరైన వారి జాబితాలో చేరారు. కాగా జిల్లా నుంచి స్వల్ప సంఖ్యలోనే పార్టీ నేతలు పులివెందులకు వచ్చినట్లు సమాచారం.
పులివెందులకు జగన్ వచ్చిన ప్రతిసారీ ఆ నాయకులే ప్రధానంగా కనిపిస్తుంటారు. జిల్లాలోని మిగతా నేతలు అటు వెళ్లకపోవడంపై గతంలో కూడా ఈ విషయంపై వాకబు చేశారని సమాచారం.
ఇడుపులపాయలో మంగళవారం తన తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించిన తరువాత జగన్ లింగాల మండల పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ అంబకపల్లెలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న తరువాత మళ్లీ పులివెందులకు రానున్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకోవడంతో పాటు పార్టీ నాయకులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాత్రికి పులివెందులలో బస చేసే జగన్ బుధవారం తిరిగి తాడేపల్లి వెళ్లనున్నారని పార్టీ వర్గాల సమాచారం.