నకిలీ మద్యం కేసు: కీలక సూత్రధారి జయచంద్రారెడ్డి అరెస్ట్

జయచంద్రారెడ్డి అరెస్టుతో కేసులో నిందితుల సంఖ్య 32కి చేరింది.

Update: 2025-12-11 09:45 GMT

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో వెలుగుచూసిన సంచలనాత్మక నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బహిష్కృత నేత జయచంద్రారెడ్డిని ఎక్సైజ్‌ పోలీసులు బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. ఆయనను రాష్ట్రానికి తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యం కేసు సంచలనం క్రియేట్ చేసింది. 

కేసుకు ఆర్థిక సహకారం
ఈ ములకలచెరువునకిలీ మద్యం తయారీ కేసులో పోలీసులు ఇప్పటికే 31 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావు కాగా, అతనికి జయచంద్రారెడ్డి ఆర్థికంగా, ఇతర విధాలుగా అండదండలు అందించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మద్యం తయారీ వ్యవహారమంతా జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే సాగినట్లు రిమాండ్‌ నివేదికలో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు.
 తదుపరి విచారణ
బెంగళూరులో ఉన్న జయచంద్రారెడ్డిని ఎక్సైజ్‌ పోలీసులు చాకచక్యంగా గురువారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో కేసులో నిందితుల సంఖ్య 32కి చేరింది. ఆయన్ను త్వరలోనే మదనపల్లెలోని ఎక్సైజ్‌ కార్యాలయానికి తీసుకొచ్చి లోతుగా విచారించే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News