శ్రీకాకుళం జిల్లాలో వైఎస్‌ఆర్ విగ్రహం ధ్వంసం
వైఎస్‌ఆర్ విగ్రహ ధ్వంసం ఘటనపై వైసీపీ స్పందించింది. దోషులను కఠినంగా శిక్షించాలని ధర్మాన కృష్ణ దాస్ అన్నారు.;
By : The Federal
Update: 2025-04-21 13:43 GMT
శ్రీకాకుళం రూరల్ మండలం బైరి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధమైన చర్యలను అణచివేయాలని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ తక్షణమే చొరవ తీసుకోవాలని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరిచిపోలేనివి. అటువంటి మహా నాయకుడు వైఎస్‌ఆర్ విగ్రహంపై దాడి చేయడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. అంతేకాకుండా సామాజిక శాంతికి భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించాలని, విగ్రహ ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.