పరీక్షలు జరిగిన తర్వాత సమర్ధత తెలుసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా చేయడం బాగుంది. పిల్లలు మట్టిలో మాణిక్యాలు. సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరు. కరుణకుమారి అంధ విద్యార్థి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అంధ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను సాధించింది. పల్నాడు మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకప్పుడు పిల్లలు భారం. కానీ ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే శ్రీరామ రక్ష, పిల్లలే భవిష్యత్ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిట్స్ వరకు నాణ్యత పెంచాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా, నాణ్యతతో అందిస్తున్నాం. స్టూడెంట్ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫొటోలు లేకుండా ఇస్తున్నాం. చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ప్రవచనాలను, విలువలను విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. తల్లి దండ్రులు కష్టపడతారు. గురువులు విద్య బోధిస్తారు. కానీ ఇవాళ్టీ రోజుల్లో విలువలు తగ్గిపోతున్నాయి. విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని, దానికి సహకరించాలని చాగంటి కోటేశ్వరరావును కోరాం. గతంలో విద్యార్థులకు చాలా యాప్ లు ఉండేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులను తొలగించామని సీఎం వెల్లడించారు.
ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. ఆడుతూ పాడుతూ విద్యార్ధులకు నచ్చిన పని చేస్తున్నారు. 24 గంటలు రుద్దితే చదువు అబ్బదు. ఇష్టంతో తక్కువ సమయం చదివినా రాణిస్తారు. చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం. విద్యలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు క్లస్టర్ అప్రోచ్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో లెర్నింగ్ విధానాలు అధ్యయనం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. టీచర్లను రిక్రూట్ చేయకుండా చదువు చెబితే అది బూటకమే.
ప్రభుత్వ టీచర్లను నియమించాం. చక్కటి చదువును చెప్పిస్తున్నాం. గతంలో టీచర్లను అవమానించారు. మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు. టీచర్లను గౌరవించే బాధ్యత మాది. పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే టీచర్లది అని సీఎం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టీచరుకు 18 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ ప్రైవేట్ స్కూళ్లల్లో ఒక టీచరుకు 25 మంది పిల్లలు ఉన్నారు. ఇంతటి స్టాఫ్ ను ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చాం. ఏపీ విద్యా రంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలి. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది. మేం సరి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.