ఇక జనం మధ్యే జగన్... కీలక నిర్ణయానికి ఛాన్స్..?
కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి జనం మధ్యలో ఉండాలని వైఎస్. జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతీకారదాడులకు అవకాశం ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆయన, పులివెందులలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే సమాచారం వైరల్ అవుతోంది.
By : SSV Bhaskar Rao
Update: 2024-07-06 16:52 GMT
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మిగిల్చిన చేదు అనుభవంతో నెల తరువాత మాజీ సీఎం వైఎస్. జగన్ జనంలోకి వచ్చారు. ఇకపై పార్టీ శ్రేణులు మధ్యే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతికి రెండు రోజులకు ముందే ఆయన రోజుల వ్యవధిలోనే సొంత నియోజకవర్గం శనివారం పులివెందులకు చేరుకున్నారు. ఈ పర్యటనలో కీలక నిర్ణయం తీసుకోనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలావుంటే.. దాడులకు గురవుతున్న వారిలో స్థైర్యం నింపేందుకు సీఎం ఎన్. చంద్రబాబును హెచ్చరించే విధంగా చేస్తున్న వ్యాఖ్యలతో.. "నాయకులు, కార్యకర్తలకు నేను ఉన్నాను" అని భరోసా ఇవ్వడం కోసం వైఎస్. జగన్ కార్యరంగంలోకి దిగినట్లు పరిస్థితి కనిపిస్తోంది.
జనం మధ్యకు...
ఎన్నికల ఫలితాల తరువాత మాజీ సీఎం వైఎస్. జగన్ గత నెల 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పులివెందుల క్యాంపు కార్యాలయంలో మొదటిసారి ప్రజల మధ్య గడపారు. పార్టీ నేతలతో పాటు, క్యాడర్ తో కూడా ఆయన మాట్లాడారు. రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలతో పులివెందులలోని మాజీ సీఎం వైఎస్. జగన్ క్యాంప్ కార్యాలయం కిటకిటలాడింది. ఇదే సమయంలో, పులివెందుల పట్టణ అభివృద్ధి సంస్థ (పడా) పరిధితో పాటు,పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఆయనను తాము పనులు చేసిన రూ. వందల కోట్ల బిల్లుల సంగతి ఏమిటని? నిలదీయడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ వ్యవహారం మొదటిసారి పులివెందుల పట్టణంలో వైఎస్ఆర్ కుటుంబానికి ఎదురైంది. దీంతో ఆయన మూడో రోజు మధ్యాహ్నం అంటే 21వ తేదీ బెంగళూరులోని నివాసానికి వైఎస్. జగన్ వెళ్లిపోయారు. నాయకులు ఎవరికి అనుమతి ఇవ్వకుండా, కొన్ని రోజులు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు.
రెండో ఓదార్పు.. పరామర్శ
రెండు రోజుల కిందట తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్. జగన్ మొదటిసారి పరామర్శ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈవీఎం ధ్వంసం సంఘటనతో పాటు వివిధ కేసుల్లో అరెస్టు చేసి, నెల్లూరు జైలుకు రిమాండ్కు పంపిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చారు. అక్కడే మొదటిసారి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. రెండు రోజులు తాడేపల్లిలో మకాం వేసిన వైఎస్. జగన్ తిరిగి శనివారం మధ్యాహ్నం కడపకు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మేనమామ రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు సురేశ్ బాబు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ వేంపల్లి సతీష్ కుమార్ రెడ్డి సహా నాయకులు స్వాగతం పలికారు. వారితో కలిసి, తన నియోజకవర్గం పులివెందుల పరిధిలోని వేంపల్లి వద్ద కొందరు చేసిన దాడిలో గాయపడి, కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయకుమార్ రెడ్డిని మాజీ సీఎం వైఎస్. జగన్ పరామర్శించి, ఓదార్చారు.
దాడుల పాపం మీకూ తప్పదు
"పులివెందులలో గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పడు కొత్త సంస్కృతికి తెరతీశారు" అని మాజీ సీఎం వైఎస్. జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. "మా పార్టీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలపై దాడులతో చెడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. దీని ద్వారా రాక్షసానందం పొందుతున్నారు. మళ్లీ మేము అధికారంలోకి వస్తే, ఇవే పునరావృతం అవుతాయి" అని సీఎం ఎన్. చంద్రబాబును హెచ్చరించారు. "శిశుపాలుడి పాపాలు ప్రారంభం అయ్యాయి. అని కూడా వైఎస్. జగన్ జోశ్యం చెప్పారు.
మోసపూరిత వాగ్దానాలతోనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని మాజీ సీఎం వైఎస్. జగన్ వ్యాఖ్యానించారు. సూపర్-6 హామీల వల్ల మాకు రావాల్సిన పది శాతం ఓట్లు అటు మళ్లడం వల్లే ఓడామని విశ్లేషించిన ఆయన "వ్యవసాయ సీజన్ కావడం వల్ల సాయం కోసం రైతులు, బడులు తెరిచినందున అమ్మఒడి కోసం తల్లలు, రూ. 1500 కోసం చెల్లెమ్మలు, ఇంటింటికీ ఉద్యోగం హామీ అమలు, లేదా నెలకు రూ.3000 భృతి కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు" అని గుర్తు చేశారు.
2014 మాదిరే ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదనే విధంగా వైఎస్. జగన్ పరోక్షంగా ఎత్తిచూపుతూ, ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఆ హామీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో అమలు చేయండని హితవు పలికారు.
కీలక నిర్ణయం తీసుకోనున్నారా?
ఈ నెల ఎనిమిదిన దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి. ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజులకు ముందే మాజీ సీఎం వైఎస్. జగన్ పులివెందులకు రావడం వెనుక కూడా బలమైన కారణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి పర్యటనలోకార్యకర్తలు, నాయకుల నుంచి ఎదురైన అనుభవనాలను పులివెందుల నేతలు చక్కదిద్దారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం, ఆదివారం పూర్తిగా కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణతో వచ్చారని తెలిసింది. తన తండ్రి వైఎస్ఆర్ జయంతి లేదా అంతకుముందే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
అసెంబ్లీకి వెళతారా?
అధికారంలో ఉంటూ, సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్న వైఎస్ఆర్ సీపీకి 175 సీట్లలో ఘోరమైన ఫలితాలతో 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం వైఎస్. జగన్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సొంత గడ్డ కడప జిల్లాలో పది స్థానాలు ఉంటే, రాజంపేటలో ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్ధానంలో డాక్టర్ సుధాతో పాటు పులివెందులలో మాజీ సీఎం వైఎస్. జగన్ మాత్రమే విజయం సాధించారు. మిగతా ఏడు స్ధానాల్లో టీడీపీ అభ్యర్థులు ఐదు, కూటమిలోని రైల్వేకోడూరు ఎస్సీ సెగ్మెంట్లో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్, జమ్మలమడుగులో సీ. ఆదినారాయణరెడ్డి గెలవడం అనేది వైఎస్ఆర్ సీపీకి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కుటుంబానికి పెద్ద దెబ్బతగినట్లే భావించాలి. 2019 ఎన్నికల్లో పదికి పది స్థానాలు వైఎస్ఆర్ సీపీ సాధించింది. ఈసారి ఆ పరిస్థితి తారుమారైంది.
కాగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కు మాజీ సీఎం వైఎస్. జగన్ రాసిన లేఖ వల్ల కూడా ప్రయోజనం లభించే అవకాశం లేదనే విషయం మంత్రుల వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.
ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లడం ఎలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఒకపక్క పాత కేసుల్లో రోజువారీ విచారణకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జనంలో లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. అసెంబ్లీకి కూడా వెళ్లలేని వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్. జగన్ పార్టీ క్యాడర్, సీమ ప్రాంత నేతలతో భేటీ కావడానికి రెండు రోజుల ముందే పులివెందులకు వచ్చినట్లు భావిస్తున్నారు. అసెంబ్లీ కాకుండా, పార్లమెంట్కు వెళ్లేందుకు సమాలోచనలు సాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందులలో మకాం వేయనున్న మాజీ సీఎం వైఎస్. జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన స్పందన ఎలా ఉంటుంది? భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ప్రకటిస్తారేమో అనేది వేచిచూడాలి.