పల్లె వెలుగు బస్సెక్కి చంద్రన్నకు వినూత్న నిరసన తెలిపిన వైఎస్ షర్మిల

రాష్ట్రంలో ప్రతిరోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఉచిత ప్రయాణం కల్పిస్తే ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయమా ?" అంటున్నారు షర్మిల

Update: 2024-10-18 11:24 GMT

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం' హామీ ఏమైందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. విజయవాడ నుంచి తెనాలికి వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కి టిక్కెట్ కొని ప్రయాణిస్తూ... చంద్రన్నా, ఇకనైనా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ హామీ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ పోస్టు కార్డు కూడా రాశారు. బస్సు ప్రయాణంలో ఆమె మహిళలతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. మహిళలకు అత్యంత ఉపయోగకరమైన ఈ హామీపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ప్రశ్నించారు. "చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయింది. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారంలోపే అమలు చేశారు. ఏపీలో నాలుగు నెలలైనా ఇంతవరకు అతీగతీ లేదు. ఇబ్బంది ఏమిటీ? ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనా? రాష్ట్రంలో ప్రతిరోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రోజూ మహిళల ద్వారా రూ.7 కోట్ల ఆదాయం... నెలకు రూ.300 కోట్ల ఆదాయం వస్తుంది. ఉచిత ప్రయాణం కల్పిస్తే ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయమా ?" అని ప్రశ్నించారు.

‘‘మహిళల ఓట్లు తీసుకున్నారు. హామీ ఇచ్చారు. ఇప్పుడు మహిళల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేరా ?. మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పథకాలు మహిళలవే. ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు. ఇలాంటి తక్కువ ఖర్చు పథకం మీకు అమలు చేయడానికి చేతులు రావడం లేదు. 5 ఏళ్లు ఇలానే కాలయాపన చేస్తారా. ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పటికైనా అమలు చేయండి. లేకుంటే ఆందోళనకు దిగుతాం" అని హెచ్చరించారు వైఎస్ షర్మిల.


Tags:    

Similar News