మాజీ బాస్ వైఎస్ జగన్ కి వాసిరెడ్డి పద్మ ఇచ్చిన సలహా ఏంటంటే..
వాసిరెడ్డి పద్మ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మహిళా కమిషన్ పదవిని చేపట్టారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు;
By : The Federal
Update: 2024-12-08 05:49 GMT
"జగన్ మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలి. ఆ బాధ్యతలను వాళ్లమ్మ వైఎస్ విజయమ్మకు అప్పగించడం మంచిది" అని సలహా ఇస్తున్నారు ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా పని చేసి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వాసిరెడ్డి పద్మ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆమె మహిళా కమిషన్ పదవిని చేపట్టారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రజలు, పార్టీ కార్యకర్తల విశ్వాసం కోల్పోయిన జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొవాలన్నారు పద్మ. వైఎస్ విజయమ్మకు వైసీపీ బాధ్యతలు అప్పగించాలని మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబును మార్చాలంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ నడిపినట్లు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయనీ, వీటిపై సమాధానం చెప్పుకోలేక ముఖ్యమంత్రి పదవిని వివాదం చేయడానికి విజయసాయి రెడ్డి అత్యుత్సాహం చూపుతున్నారన్నారు.
వాసిరెడ్డి పద్మ వచ్చే వారం టీడీపీలో చేరనున్నారు. ఈ విషయమై ఎంపీ చిన్నితో చర్చించారు. ఆమె జగ్గయ్యపేట సీటుపై దృష్టి సారించారంటున్నారు. ఒకవేళ అది కుదరకపోతే మహిళల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం. ఎంపీ చిన్నీతో భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని పరిశీలకులు భావిస్తున్నారు.