లోకేష్ రెడ్‌బుక్‌కు పోటీగా జగన్ డిజిటల్ యాప్
సంపదను సృష్టిస్తామని చెప్పి ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు.
By : The Federal
Update: 2025-09-24 10:35 GMT
వైయస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ’డిజిటల్ బుక్’ అనే కొత్త డిజిటల్ యాప్‌ను ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన ఆ పార్టీ నాయకులు దిశానిర్థేశం చేశారు. ఈ సందర్భంగా డిజిట్ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ యాప్ ప్రధానంగా పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు అన్యాయాలు, హింసాత్మక ఘటనలు, అధికారుల దుర్వినియోగాలకు గురైతే వాటిని డాక్యుమెంట్ చేసుకునేందుకు రూపొందించబడింది. ఇందులో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్) సదుపాయం కూడా ఉంది, దీని ద్వారా ఫిర్యాదులు సులభంగా నమోదు చేయవచ్చు.
ఈ యాప్ ద్వారా వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు తమపై జరిగిన అన్యాయాలు, అక్రమ కేసులు, హింసాత్మక ఘటనలను ఫోటోలు, వీడియోలు, వివరాలతో సహా అప్‌లోడ్ చేయవచ్చు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి, అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యం. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ౖవైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాను.‘ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలని, ఈ డిజిటల్ బుక్ శ్రీరామ రక్ష లాంటిదని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ‘పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొచ్చాం. ఇది అన్యాయాలను డాక్యుమెంట్ చేసి, భవిష్యత్తులో న్యాయం చేసే సాధనం‘ అని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తూ, ‘జగనన్న 2.0‘ అంటూ పోస్టులు చేశారు. అయితే ఈ డిజిట్ యాప్ తెరపైకి రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తించింది, ముఖ్యంగా ప్రతిపక్షాలు ఇది ’రెడ్ బుక్’కు ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ యాప్ ద్వారా వైసీపీ బలోపేతం కావడమే కాకుండా, కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చేయకూడని పనులన్నీ చేస్తున్నారని, సంపద సృష్టిస్తామని చెప్పి ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని జగన్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తిరోగమనమే కనిపిస్తోందన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను ఎత్తివేశారని విమర్శలు గుప్పించారు.