మీరు సోషల్ మీడియా యాక్టివిస్టా..

మనకు ఏ సంబంధం లేకపోయినా కేసులు పెట్టొచ్చు. మానవతా దృక్పదంతో ఒకరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు. అయితే ఇప్పుడేమి జరుగుతోంది...;

Update: 2024-12-05 05:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తంతు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్న వ్యక్తి రెండేళ్ల క్రితం అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ లను ట్విటర్ (x) వేదికగా అభ్యంతరకర పోస్టులు పెట్టారని నవంబరు 9, 2024న కొందరు వ్యక్తులు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో కేసు పెట్టారు. ఆ ఫిర్యాదు మేరకు బుధవారం సీఐడీ సీఐ, వారి బృందం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం ధనుమంతుపురం లోని విఘ్నేష్ (22) అనే యుకుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. అంటే గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ పక్షపాతంతో వ్యవహరిస్తుందనటానికి ఇవి ఉదాహరణలు. గత ప్రభుత్వంలో టీడీపీ, జనసేన నాయకులపై ఫేస్ బుక్, ఎక్స్, వాట్సాప్ వేదికగా సామాజిక మాద్యమాల్లో కొందరు అభ్యంతర కర పోస్టులు పెట్టారు. వారంతా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వాకిని అనుకూలురుగా భావించిన నేటి ప్రభుత్వం వారందరిపై కార్యకర్తల ద్వారా ఇప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ లు మొదలు పెట్టింది.

సంబంధం లేని వ్యక్తులు కేసులు పెట్ట కూడదా..

తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చ కూడదా.. అంటే పెద్దలు చెప్పే మాట ఒక్కటే. నీపని నువ్వు చేసుకుంటూ పోతే పరవాలేదు. సంబంధం లేని విషయాల్లో తలదూరిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవంటారు. ఇప్పుడు అటువంటి వేవీ కనిపించడం లేదు. ఏ సంబంధం లేని వ్యక్తులు పెట్టిన కేసులను బట్టి పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులకు పెద్ద డ్యూటీ ఏంటంటే సమాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంలో ఉన్న నాయకులపై అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని పట్టకుని అరెస్ట్ చేయడం. ఇది పోలీసులకు సవాల్ గా మారింది. ప్రతి పక్షంలోనూ పరపతిని ఉపయోగించే వారు ఉన్నారు. అటువంటి వారిని పట్టకుని అరెస్ట్ చేయడం కూడా కష్టంగానే ఉంది. పైగా ఎక్కడో రాష్ట్రం వదిలి వెళ్లి దాక్కున వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందాల్లో ముగ్గరి నుంచి ఆరుగ్గురి వరకు ఉంటున్నారు. ఇలా వెళ్లడం వల్ల పోలీస్ స్టేషన్ లలో పనులు మందగిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వం చెప్పింది చేయాల్సిందే...

ప్రభుత్వం చెప్పింది చేయాల్సిందే కాబట్టి పోలీసులకు తప్పటం లేదు. కాస్త స్థితి మందులైతే హైకోర్టు, సుప్రీ కోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు లేని వారు పోలీసుల భారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. తాను తీసిన సినిమాల్లో తమ నాయకులైన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లను అవమానించారనేది కేసు. ఈ సినిమా కూడా గత ప్రభుత్వ హయాంలో తీసినది. సినిమా పేరు వ్యూహం. అయితే మద్దిపాడు పోలీసులు టీములుగా ఏర్పడి రామ్ గోపాల్ వర్మ వద్దకు వెళ్లి 41 నోటీసు అందజేశారు. ఈ పనిపైనే సుమారు పది మంది పోలీసులు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మద్దిపాడు నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడ ఒక రోజు స్టేచేసి నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం చాలా మంది వైఎస్సార్ సీపీ నేతలు కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇక కార్యకర్తల విషయానికొస్తే వందల సంఖ్యలో ఇప్పటికే అరెస్ట్ అయి జైళ్లలో ఉన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినందున అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న కేసులకు కోర్టు బెయిల్ ఇవ్వడం లేదు. నిజానికి ఈ కేసుల్లో పెట్టే సెక్షన్ లకు స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చు. అయినా బెయిల్ ఇవ్వడం లేదు.

సోషల్ మీడియాలో అభ్యంతర కర పోస్టులు పెట్టే వారికి వత్తాసు పలకొద్దన్న కోర్టు

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని నాయకులపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారికి ఎవ్వరూ సపోర్టు రావొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైన కేసులని, ఈ కేసుల్లో అరెస్ట్ లు లేకుండా చర్యలు తీసుకోవాలని సీనియర్ పాత్రికేయులు పోలా విజయబాబు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇటువంటి కేసులకు సంబంధించి ఇటువంటిది మరొక ఫిల్ వేయడానికి వీలు లేదని, పిటీషన్ వేసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వేశారని భావిస్తున్నట్లు జడ్జి వ్యాఖ్యానించారు. ఈ పిల్ ద్వారా తమ సమయం వృధా చేసినందుకు రూ. 50వేలు జరిమానా పిల్ వేసిన వ్యక్తికి విధించారు. ఈ జరిమానాను లోక్ అదాలత్ లో చెల్లించాలని తమ తీర్పులో పేర్కొన్నారు. గత నెల 13న తీర్పు వస్తే ఈనాడు దిన పత్రిక దీనిని 29వ తేదీన పతాక శీర్షికలో ప్రచురించింది.

ఒక పార్టీ వారిపైనే కేసులు ఎందుకని?

ప్రస్తుతం వైఎస్సార్సీపీ వారిపైనే కేసులు పెడుతున్నారు. అరెస్ట్ లు జరుగుతున్నాయి. టీడీపీ సోషల్ మీడియాకు చెందిన వారు వైఎస్సార్సీపీ వారిపైనా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ వారు చెబుతున్నారు. వారు నిజమైతే, వారు పెట్టిన కేసులు పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. బాధితులు ఎవరైనా ఒకటేననే చర్చ జరగటం విశేషం.

Tags:    

Similar News