సీఎం ఇంటి ముందు రెండో రోజు యోగా టీచర్ల ఆందోళన

మంత్రి లోకేష్ తో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట పోలీసులతో యోగా టీచర్ల వాగ్వాదం;

Update: 2025-07-04 03:48 GMT
సీఎం సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వావాదానికి దిగిన యోగా టీచర్లు

విద్యాశాఖ మంత్రితో మాట్లాడే అవకాశం తమకు కల్పించాలని కోరుతూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ఇంటి వద్ద యోగా టీచర్లు పట్టుబట్టారు. రెండు రోజులుగా యోగా టీచర్లు ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం యోగా చేస్తూ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించి ఇంటి వద్ద నుంచి బయటకు పంపించారు. పోలీసుతో వాగ్వాదానికి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తాత్కాలికంగా గురువారం ఆందోళన విరమించిన టీచర్లు శుక్రవారం ఉదయం తిరిగి ముఖ్యమంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఉదయం ఏడున్నర గంటల నుంచి వారి ఆందోళన సీఎం ఇంటి వద్ద కొనసాగుతోంది.


ఆందోళనకు అనుమతించని సెక్యూరిటీ

నిన్న మీకు చెప్పాం. తిరిగి ఇవ్వాళ కూడా వచ్చారు. సీఎం ఇంటి వద్ద ఆందోళన చేసేందుకు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారంటూ సెక్యూరిటీ సిబ్బంది యోగా టీచర్లపై మండి పడ్డారు. సెక్యూరిటీ ఇన్ చార్జ్ తో టీచర్లు వాగ్వాదానికి దిగటంతో సీఎం ఇంటి ముందు రోడ్డుపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన చేసేందుకు వచ్చిన యోగా టీచర్లను పోలీసులు చుట్టుముట్టారు. ఇక్కడి నుంచి కదిలితే ఒప్పుకునేది లేదని వారు హెచ్చరించారు.

ధర్నాచౌక్ లో ధర్నా చేసుకోండి..

మీరు ధర్నాలు చేసుకునేందుకు విజయవాడలోని లెనిన్ సెంటర్ లో ధర్నాచౌక్ ఉంది. అక్కడ మీరు ధర్నాలు చేసుకోవచ్చు. అంతే కాని సీఎం ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేసేందుకు మీకు పర్మిషన్ ఎవరిచ్చారంటూ సెక్యూరిటీ సిబ్బంది వారిని గదమాయించారు. నిన్న మాలో ఐదుగురు వచ్చి మాట్లాడండి అని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నాం... ఇద్దరి పంపించి మాట్లాడించండి అని ఆందోళన కారులు పోలీసులను రిక్వెస్ట్ చేశారు.

అనుమతి లేదన్నారు...

విషయం లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఎవ్వరితోనూ మాట్లాడేది లేదని ఆయన చెప్పారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి లేకుంటే చర్యలు తసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనుమతి ఉంటేనే ఇక్కడ ఉండనిస్తాం. లేకుంటే ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయిస్తామన్నారు. మంత్రి మీకు పర్మిషన్ ఇస్తే మీ సెల్ ఫోన్ కు మెసేజ్ వస్తుంది. లేదా మాకు ఫోన్ చేసి లోపలికి పంపించాల్సిందిగా ఆదేశిస్తారు. ఇంటి వద్ద ఇప్పుడు ఎవ్వరినీ కలిసేది లేదని చెప్పారు. అందువల్ల మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండని పోలీసులు ఆదేశించారు. సీఎం ఇంటి ముందు రోడ్డుపై ఆందోళన కారులు పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో వాహనదారులు వాహనాలు ఆపి జరుగుతున్న పరిణామాలాను ఆసక్తిగా వినేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఇక్కడ ఎవ్వరూ ఆగొద్దని వెంటనే వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు.

మాకు మూడు సంవత్సరాలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకే సీఎం ఇంటి వద్దకు వచ్చామని వారు తెలిపారు.

ఇంటి వద్ద ఉన్న మంత్రి లోకేష్ తమతో మాట్లాడతారనుకొన్నాం. కానీ ఆయన కూడా అవకాశం ఇవ్వలేదని టీచర్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 907 స్కూళ్లలో 1056 మంది యోగా టీచర్లను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల క్రితం నియమితులైన వీరికి ఇప్పటి వరకు జీతం ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల్లో చేరారు. ఆ ప్రభుత్వం కూడా జీతాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున జీతాలు వస్తాయనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా జీతాలు ఇవ్వటం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News