వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవడం కోసం, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఆ పార్టీ పెద్దలు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అ«ధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ తరపున ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం టాస్క్‌ఫోర్స్ పని చేస్తుందని పేర్కొన్నారు. ఆయా జిల్లాలోని వైసీపీ నేతలు, పార్టీకి సంబంధిత నాయకులు, ఆ పార్టీ లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ టాస్క్‌ఫోర్స్ పని చేస్తుందని పేర్కొన్నారు. ఆ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది.