మండలిలో మెడికల్ కాలేజీల మంటలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రత్యేక చర్చ పెట్టాలని మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనలకు దిగారు.
By : The Federal
Update: 2025-09-19 06:47 GMT
ఆంధ్రప్రదేశ్ రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో మెడికల్ కలాశాలల అంశం రచ్చకు దారి తీసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలని శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనలకు దిగారు. ఈ అంశంపై చర్చ జరపాలని వారు పట్టుబట్టారు. పీపీపీ విధానం రద్దు చేయాలని నినాదాలు చేపట్టారు. మండలి ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మండలిని వాయిదా వేశారు.
రెండో రోజు శుక్రవారం మండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. ఇది ప్రారంభమైన వెంటనే మెడికల్ కళాశాలలను వైసీపీ సభ్యులు తెరపైకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కాలేజీలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ఎంతో ప్రాముఖ్యమైన ఈ మెడికల్ కాలేజీ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు వైసీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్‌కు అందజేశారు. అయితే ఛైర్మన్ మోషెన్ రాజు వైసీపీ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు మండలిలోనే ఆందోళనలకు దిగారు. చర్చ జరపాల్సిందే అని పట్టుబట్టారు. ఛైర్మన్ పోడియంను చుట్టారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో మండలిని ఛైర్మన్ వాయిదా వేశారు.
అంతకు ముందు ప్రభుత్వ మెడికల్ కలాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఎల్‌వోపీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ప్లకార్డుల ప్రదర్శనతో ర్యాలీగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొద్ది సేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరో వైపు ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలకు దిగారు. అయితే వారిని ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశం చర్చగా మారింది.