టీడీపీ, వైసీపీ మధ్య జగన్ దెబ్బ పంచాయితీ.. ఉందా.. లేదా!

జగన్ తలకు ఇటీవల జరిగిన రాయి దాడిలో గాయమైంది. అప్పటి నుంచి ఆయన బ్యాండేజ్ వేసే ఉంచారు. ఈరోజు అనూహ్యంగా ఆయన బ్యాండేజ్ తొలగించడంపైనే చర్చంతా జరుగుతోంది..

Update: 2024-04-27 11:51 GMT

టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జగన్ తలకు తగిలిన గాయంపై పెద్ద పంచాయితీ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. టీడీపీ తరుపు వాళ్లు జగన్‌కు దెబ్బలేదంటే.. సరిగ్గా చూస్తకోండి అంటూ వైసీపీ శ్రేణులు బదులిస్తున్నాయి. దీంతో అసలు జగన్‌ తలకు దెబ్బ ఉందా లేదా అన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ప్రజల ట్రోలింగ్ వల్లో.. సునీత రెడ్డి సలహా మేరకో.. గాయం నయమయ్యో.. ఈరోజు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ తన తలకు బ్యాండేజ్ వేసుకోలేదు. మేనిఫెస్టోను ప్రకటించే కార్యక్రమాన్ని జగన్.. దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇంతలోనే సోషల్ మీడియాలో టీడీపీ.. పోస్ట్‌లపైన పోస్ట్‌లు పెట్టడం ప్రారంభించింది.

 

టీడీపీ పోస్ట్ ఏంటంటే..

‘‘ప్రజల ట్రోలింగ్ దెబ్బకు జగన్.. బ్యాండేజ్ మాయం. జాగ్రత్తగా చూస్తే దెబ్బ మటుమాయం’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు ఫొటోలను జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అందుకు వంతపాడుతూ టీడీపీ మద్దతు దారులు కూడా సోషల్ మీడియాపై జగన్ ఫొటోల కుంభవృష్టి కురిపించారు. జగన్‌కు దెబ్బే లేదు.. సింపతీ కోసమే ఆయన ఇన్నాళ్లూ దెబ్బ నాటకం ఆడారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2019లో కూడా ఇదే రకంగా కోడికత్తి నాటకం ఆడారంటూ మరోసారి గతాన్ని ఎత్తడం ప్రారంభించారు.

 

ఘాటుగా వైసీపీ బదులు

సోషల్ మీడియాలో టీడీపీ తరపు నుంచి జగన్‌పై ట్రోలింగ్ మొదలైన వెంటనే వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియా సమరానికి సై అన్నాయి. ఫొటోకు ఫొటో.. మీమ్‌కు మీమ్ బదులుగా విరుచుకుపడ్డాయి. ‘‘మళ్లీ బ్యాండేజ్ లేదు.. దెబ్బా లేదు.. అంటారు జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ ఫొటోలను షేర్ చేయడం ప్రారంభించింది. అందులో జగన్ తలకు నయమైన గాయం మచ్చ కూడా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య ఈ ఫొటో ఫైట్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

కామెంట్ సెక్షన్‌లో కూడా

వీరి సోషల్ మీడియా వార్ కేవలం పోస్ట్‌లలోనే కాదు. పోస్ట్‌ల కామెంట్ సెక్షన్‌లలో కూడా జోరుగా సాగుతోంది. ఒకరి పోస్ట్‌లకు మరొకరు తమ కౌంటర్‌లను కామెంట్‌గా పెడుతున్నారు. ఇందులో సదరు పార్టీల అభిమానులు కూడా ఉరకలేస్తున్న ఉత్సాహంతో కామెంట్స్ చేసి పోస్ట్‌లను వైరల్ చేసేస్తున్నారు.

Tags:    

Similar News