"అనంత"మైన ధీమా..

అధికారంలో ఉండగా రాష్ట్రం, రైతుల కోసం చేసిన పనులు ఆదుకుంటాయని టిడిపి నమ్మకంగా ఉంటే తామను సంక్షేమ పథకాలు ఆదరిస్తాయని వైఎస్ఆర్సిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.బబబ

Update: 2024-05-12 14:53 GMT

పరిశ్రమల ఏర్పాటుతో చేసిన అభివృద్ధి ఆదుకుంటుందని టిడిపి ఆశావహంగా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు మేలు చేస్తాయని వైఎస్ఆర్సిపి నమ్ముతోంది. ఎమ్మెల్యేల, అవినీతి, భూ ఆక్రమణలు అధికార పార్టీని వెంటాడుతున్నాయి. టీడీపీడీకి వర్గపోరు చెవిలో జోరీగలా రోద పెడుతోంది. "జిల్లాకు వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళాయి. కొన్ని పునాదుల స్థాయి దాటలేదు. కరువు పరిస్థితులు అనంతపురం జిల్లా ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. వీటన్నిటిని నిర్లక్ష్యం చేశారు" అని సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షఫీ వ్యాఖ్యానించారు.

గడిచిన ఐదేళ్లలో సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా చేశామని వైఎస్ఆర్సిపి ఆత్మవిశ్వాసంతో ఉంది. దీనిపై అనంతపురం జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వీ. రాంభూపాల్ మాట్లాడుతూ.. "అనంతపురం కరువు జిల్లాలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులను వినియోగించుకోవడానికి టిడిపి ప్రభుత్వంలో శాతం సబ్సిడీతో అందించిన డ్రిప్, స్ప్రింక్లర్ విధానం కాస్త ఉపయోగపడింది" అని రాంభూపాల్.. ఫెడరల్ ప్రతినిధితో వ్యాఖ్యానించారు.

‘‘గత 4.5 ఏళ్లలో ఒక్కరికి కూడా మేలు జరిగిన పాపాన పోలేదు. ఎస్ఎల్‌సి ఆధునీకరణ పనులు 50 శాతం గతంలో పూర్తయ్యాయి. వీటిని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాలువలు కూడా ధ్వంసం అయ్యాయి. తుంగభద్ర నది నుంచి వచ్చే నీరు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడింది" అని రాంభూపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్తు ఎలా ఉందంటే...

తగ్గని ఆదరణ..

హిందూపురం నియోజకవర్గం టిడిపి ఆవిర్భావం నుంచి అక్కడి ఓటర్లు ఆదరిస్తూనే ఉన్నారు. హ్యాట్రిక్ కొట్టడానికి ప్రస్తుతం టిడిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. కోడూరు దీపిక వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గ్రామీణ స్థాయిలో టిడిపికి బలమైన పట్టు ఉండడం, నాయకుల సమష్టి కృషికి తోడు అధికార వైఎస్ఆర్సిపిలోని వర్గ విభేదాలు మరింత కలిసి వచ్చే అంశంగా అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి సీటు ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టిడిపిలో చేరడం కూడా వైఎస్ఆర్ సీపీకి గట్టి దెబ్బగానే భావిస్తున్నారు.

టిడిపిలో అంతర్యుద్ధం...

అనంతపురం జిల్లాలో ప్రధానంగా అర్బన్ సెగ్మెంట్లో టిడిపి నాయకుల మధ్య సెగలు ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. అనంతపురం అసెంబ్లీ స్థానంలో టిడిపి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు అవకాశం కల్పించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇక్కడి నుంచి మళ్లీ పోటీలో ఉన్నారు. టిడిపి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి, ఆయన వర్గం వెంకటేశ్వర ప్రసాద్ తో వైరం సాగిస్తున్నట్లే కనిపిస్తుంది. ఇది తమకు అనుకూలిస్తుందని వైఎస్ఆర్సిపి అభ్యర్థి వెంకటరామిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో వీరిద్దరికీ సిపిఐ అభ్యర్థి సీ. జాఫర్ పోటీలో ఉన్నారు. కమ్యూనిస్టులకు కొన్ని ప్రాంతాల్లో క్యాడర్ ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలో అంచనాలు కొద్దిగా మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు అని కూడా సమాచారం.

గుంతకల్లు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డితో కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం తిరుగుబాటు చేసి, టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. నియోజకవర్గంలో 55 వేలకు పైబడి ఉన్న వాల్మీకి సామాజికవర్గం సహకారం ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు. స్థానికేతరుడు అనే సమస్యతో పాటు, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, నాయకుల సహకారం లేదని చెబుతున్నారు. కొందరు వైఎస్ఆర్సిపిలోకి వెళ్లారు. దీంతో టిడిపి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎదురీదినా, గట్టి పోటీ ఇస్తారని అంచనా వేస్తున్నారు.

రాయదుర్గంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులుపై మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఈయన విజయానికి గత ఎన్నికల్లో మెట్టు గోవిందరెడ్డి కీలకంగా పని చేశారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన కాల్వ శ్రీనివాసులు చేసిన పనులు కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. వాల్మీకి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం కూడా టిడిపి అభ్యర్థికి ప్లస్ పాయింట్ గా భావిస్తున్నారు.

పెనుగొండ అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థిగా సవితమ్మ పోటీ చేస్తున్నారు. కళ్యాణదుర్గంలో పనితీరు బాగలేదనే కారణంతో రాజకీయ బదిలీపై మంత్రి ఉషశ్రీ చరణ్ ను వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీకి దించారు. ఈమెకు స్థానిక పార్టీ నాయకుల సహకారం లేకపోవడం, మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో మమేకమైన టిడిపి అభ్యర్థి సవితమ్మకు కలిసి వచ్చే అంశంగా ఉంది. ఆమె తండ్రి చేసిన అభివృద్ధితోపాటు కురువ సామాజిక వర్గం ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

ఉరవకొండ అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డిపై స్వయానా తమ్ముడు మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కుమారుడు భూ ఆక్రమణల వ్యవహారం విశ్వేశ్వరరెడ్డికి ప్రతికూలంగా మారిందని చెబుతున్నారు. వీరి కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్ కు కలిసి వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కాంగ్రెస్ థీటైన పోటీ

అనంతపురం జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ థీటైన పోటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. మడకశిర అసెంబ్లీ సెగ్మెంట్లో సామాన్యుడైన ఈర లక్కప్పకు వైఎస్ఆర్సిపి అవకాశం ఇచ్చింది. టిడిపి అభ్యర్థిగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజును రెండవ కృష్ణుడిగా తెరమీదకి తీసుకువచ్చారు. తన మాటకు విలువ లేదని కినుక వహించిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న స్తబ్దతగా ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోటీకి దించారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలోని కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడంతో పాటు, తన బలాన్ని ప్రదర్శించడానికి రఘువీరారెడ్డి సర్వశక్తులు వెచ్చిస్తున్నారు.

సింగనమల మరో రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి ఇద్దరు కొత్త వారితో పిసిసి మాజీ అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్ పోటీలో ఉన్నారు. టిడిపి అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన బండారు శ్రావణిపై టిప్పర్ డ్రైవర్ గా రాష్ట్రంలో గుర్తింపు పొందిన విద్యావంతుడు మన్నెపాకుల వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు. టికెట్ వేటలో పట్టుబట్టి సాధించిన టిడిపి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నాయకులకు కొరుకుడు గాని కొయ్యగా ఉన్నారు. అయినా వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలమయ్యారు. పోలింగ్ వారం ముందే ఆమె వడదెబ్బకు గురై ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె ప్రచార సారధ్య బాధ్యతలు ఆమె అక్క కిన్నెర భుజానికి ఎత్తుకున్నారు. ఇక్కడ పరిస్థితులు బండారు శ్రావణిశ్రీ కి అనుకూలంగా ఉండడంతోపాటు, పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ అధికార పార్టీ ఓట్లకు గండి కొట్టే ప్రమాదం లేకపోలేదని, ఇది టిడిపికి అనుకూలంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పుట్టపర్తి అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డీ. శ్రీధరరెడ్డితో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూర పోటీ చేస్తున్నారు. క్యాడర్ బలంగా ఉండడం, మామ పల్లె రఘునాథ్ రెడ్డి సేవలు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యాపారాలకే పరిమితమై అభివృద్ధిని విస్మరించడం వంటి చర్యలు టిడిపి అభ్యర్థి పల్లె సింధూరకు కలిసి రాగలరని అంచనా వేస్తున్నారు.

తాడిపత్రి నియోజకవర్గంలో పార్టీలు అనడం కంటే వ్యక్తుల మధ్య పోరాటం జరుగుతుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జెసి ప్రభాకరరెడ్డి కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జెసి బ్రదర్స్ దివాకరరెడ్డి ఆరుసార్లు, ప్రభాకరరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా కూడా ఉన్నారు వీరికి పట్టణంలో మంచిపట్టుంది. ఇటీవల వైయస్సార్సీపి నుంచి టిడిపి వైపు వలసలు పెరిగాయి అంటున్నారు. మొత్తానికి ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంటుందని భావన వ్యక్తం అవుతోంది.

గుడ్ మార్నింగ్ ధర్మవరం...

ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి "గుడ్ మార్నింగ్ ధర్మవరం" పేరిట నిర్వహించిన కార్యక్రమం పాపులర్ అయింది. అదే సమయంలో.. " తాను గమనించిన భూములు, ఆస్తులను ఆక్రమించారనే" ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేతిరెడ్డిపై కూటమి అభ్యర్థిగా బిజెపి జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సబ్ధతగా ఉండడంతో, నిర్వహణ బాధ్యతలు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఓటర్లలో 70 శాతం పద్మశాలీలు ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి, బిజెపి అభ్యర్థి మధ్య పోటీ తీవ్రంగా ఉందని భావిస్తున్నారు.

రాప్తాడులో ఏమవుతోంది..

అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాప్తాడు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తో మాజీమంత్రి పరిటాల సునీత పోటీపడుతున్నారు. ఇక్కడ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు వీరికి తలనొప్పిగా మారారు. వైఎస్ఆర్సిపి స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు కొందరు ఇటీవల టిడిపిలో చేరడం, టిడిపి నుంచి వైఎస్ఆర్సిపికి ఇంకొందరు వెళ్లడం వంటి కారణాల నేపథ్యంలో ఇక్కడ పోటీ ఉత్కంఠకు తెర తీసింది. ఇటీవల తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మెజారిటీపై ఓ ఎన్ఆర్ఐ రూ.కోట్ల పందెం కాయడానికి కూడా వెనకాడ లేదని సమాచారం.

కళ్యాణదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయ బదిలీలు జరిగాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్ ను వైఎస్ఆర్సిపి పెనుగొండలో పోటీ చేయిస్తోంది. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను ప్రస్తుతం కళ్యాణదుర్గంలో పోటీకి దింపింది ఆయనపై అమిలినేని సురేంద్రబాబును బరిలోకి దింపారు. ఈ సీటు ఆశించి భంగపడిన నియోజకవర్గ ఇన్చార్జ్ నెల క్రితమే టిడిపినీ వీడి, వైఎస్ఆర్సిపి లో చేరారు. ఇది టిడిపికి పెద్ద లోటుగా మారింది. అయితే ప్రస్తుతం పోటీలో ఉన్న అమిలినేని సురేంద్రబాబు, వైఎస్ఆర్సిపి అభ్యర్థి తలారి రంగా ఈ మధ్య పోటీ ఉత్కంఠగానే ఉందని చెబుతున్నారు.

హిందూపురం ఎంపీ స్థానంలో బి.కె పార్థసారథి ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. బళ్లారి నుంచి తీసుకువచ్చిన బిజెపి మాజీ ఎంపీ బోయ శాంతమ్మ ఇక్కడ పోటీ చేస్తున్నారు. అనంతపురం లోక్సభ స్థానంలో టిడిపి అభ్యర్థిగా అంబిక లక్ష్మీనారాయణ, వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా శంకరనారాయణ పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో అధికశాతం ఉన్న వాల్మీకి, కురుబ సామాజికవర్గాల ఓటర్ల తీర్పుపై వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇందులో బీసీలు, ఇతర సామాజిక వర్గాల్లో టిడిపికి మంచి పట్టు ఉంది. ఇంకొన్ని గంటల్లో జరగబోయే పోలింగ్లో ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు.

Tags:    

Similar News