శ్రీశైలాన్ని రాయలసీమ నుంచి సపరేట్ చేస్తారా?
మార్కాపురం కొత్త జిల్లాకు తరలిపోనున్న శ్రీశైలం, రాయలసీమలో నిరసన;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జిల్లాల పునర్విభజన అనేది ఎప్పుడూ వివాదాస్పద అంశం. ముఖ్యంగా పవిత్ర శ్రీశైలం ఆలయం, శ్రీశైలం ప్రాజెక్టును రాయలసీమ నుంచి వేరు చేసి, కోస్తా ఆంధ్రాలోకి తరలించాలనే ఆలోచనలు ఇటీవల మరింత ఉధృతమయ్యాయి. ఈ అంశం భావోద్వేగాలు, సాంస్కృతిక బంధాలు, వ్యవసాయ ఆధారాలు, రాజకీయ లాభాలతో ముడిపడి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ), ఎన్డీఏ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజుకుంది.
చారిత్రక నేపథ్యం, భావోద్వేగ బంధం
శ్రీశైలం ఆలయ పట్టణం, శ్రీశైలం ప్రాజెక్టు మొదట కర్నూలు జిల్లాలో భాగం. శతాబ్దాలుగా ఇది కర్నూలుతో భావోద్వేగ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాన్ని కలిగి ఉంది. శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయం రాయలసీమ ప్రాంతానికి ఆధ్యాత్మిక కేంద్రం. అంతేకాక శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమ వ్యవసాయానికి జీవనాడి. ఇక్కడి నుంచే కృష్ణా నది నీటి మళ్లింపు జరుగుతుంది. ఇది స్థానిక రైతులకు కీలకం. వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం 2022లో జిల్లాల పునర్విభజన చేసి, శ్రీశైలాన్ని నంద్యాల జిల్లాలో చేర్చింది. ఇది రాయలసీమ ప్రాంతానికి బలాన్నిచ్చిందని వైఎస్ఆర్‌సీపీ నాయకులు చెబుతుంటారు.
అయితే స్థానిక రైతులు ఈ ప్రాజెక్టుపై 'యాజమాన్య హక్కు' దక్కించుకుని, ఎక్కువ నీటి కోసం పోరాడుతున్నారు. వారు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి) కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదని, రాయలసీమ నాయకులు తనపై వాగ్యుద్ధం చేయడానికి ఇది అవకాశమిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా చంద్రబాబు నాయుడు శ్రీశైలాన్ని రాయలసీమతో సంబంధం లేని కొత్త జిల్లాలోకి తరలించాలని యోచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మార్కాపురం చెన్నకేశవ ఆలయం
మార్కాపురం జిల్లా ప్రతిపాదన
2024 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ప్రకాశం జిల్లా నుంచి విడగొట్టడం ద్వారా పశ్చిమ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. 2025 మేలో చంద్రబాబునాయుడు అధికారికంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్ష నిర్వహించి, మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై రిపోర్టు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందులో శ్రీశైలం మండలాన్ని చేర్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి, దీంతో వివాదం మొదలైంది.
ఆగస్టు 13న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) సమావేశంలో జిల్లాల పునర్విభజనపై చర్చ జరిగింది. మార్కాపురం జిల్లాలో శ్రీశైలం చేర్చితే ప్రత్యేక నిధులు వస్తాయని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని కొందరు వాదిస్తున్నారు. అయితే ఇది రాయలసీమను బలహీనపరచడమేనని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు రాయలసీమను 'రత్నాలసీమ'గా మార్చుతామని చెబుతున్నప్పటికీ, ఈ చర్యలు ప్రాంత వ్యతిరేకతను పెంచుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైల శిఖరం వరకు యర్రగొండపాలెం మండలం విస్తరించి ఉంది. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శీశైల శిఖరం మీదుగా సున్నిపెంటకు శివయ్య భక్తులు వెళుతుంటారు. మార్కాపురం జిల్లా అయితే యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శితో పాటు కనిగిరి ని కూడా కలిపితే బాగుంటుందనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది.
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం
టీడీపీలో అంతర్గత విభేదాలు
టీడీపీలోనే ఈ అంశంపై విభేదాలు కనిపిస్తున్నాయి. మార్కాపురం టీడీపీ నాయకుడు కందుల రామిరెడ్డి శ్రీశైలం చేరికకు మద్దతిచ్చారు. మార్కాపురానికి శ్రీశైలం దగ్గరగా ఉందని, స్థానిక గిరిజనుల బంధాలు ఉన్నాయని, నీటి వివాదాలు తగ్గుతాయని వాదిస్తున్నారు. అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి (టీడీపీ) దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆలయం శతాబ్దాలుగా ఈ ప్రాంతంతో ముడిపడి ఉందని, ఇది పార్టీలకు అతీతమని చెబుతున్నారు. ముఖ్యమంత్రిని కలిసి వ్యతిరేకత తెలియజేస్తామని ప్రకటించారు. నంద్యాల నాయకులు కూడా నంద్యాల గుర్తింపును దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు మద్దతిచ్చింది. కానీ అంతర్గత విభేదాలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి.
ప్రాంత విభజనలంటున్న వైఎస్ఆర్‌సీపీ
వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఈ ప్రతిపాదనలను రాయలసీమను విభజించడంగా చూస్తున్నారు. మునుపటి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో శ్రీశైలాన్ని నంద్యాలలో చేర్చి, ప్రాంత సమతుల్యతను కాపాడిందని చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు చర్యలు రాజకీయ లాభాల కోసమేనని ఆరోపిస్తున్నారు. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వంటి నాయకులు కేంద్రాన్ని కోరుతూ, రాయలసీమకు నీటి హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో మరిన్ని మార్పులకు వ్యతిరేకత ఉంది. ఇది వైఎస్ఆర్‌సీపీ బేస్‌ను ప్రభావితం చేస్తుంది.
సోషల్ మీడియాలో కూడా విమర్శలు వస్తున్నాయి. శ్రీశైలం ఆలయాన్ని మార్కాపురంలో చేర్చడం నంద్యాల గుర్తింపును, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను దెబ్బతీస్తుందని చర్చలు జరుగుతున్నాయి.
శ్రీశైలం మల్లికార్జున స్వామి గాలిగోపురం
రాజకీయ లాభాలు vs ప్రాంత అభివృద్ధి
ఈ వివాదం రాజకీయ లాభాలతో ముడిపడి ఉంది. చంద్రబాబునాయుడు రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెబుతున్నప్పటికీ, శ్రీశైలం తరలింపు ప్రతిపాదనలు ప్రాంత వ్యతిరేకతను పెంచుతాయి. ఇది టీడీపీలో అంతర్గత విభేదాలకు దారితీస్తోంది. మరోవైపు వైఎస్ఆర్‌సీపీకి రాయలసీమలో బలాన్నిచ్చే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అభివృద్ధికి ఉపయోగపడుతుందనుకున్నా, భావోద్వేగ బంధాలను విస్మరించడం సమస్యలు తెచ్చిపెడుతుంది. ప్రభుత్వం సమతుల్య నిర్ణయం తీసుకోకపోతే ఇది మరిన్ని ఆందోళనలకు దారితీయవచ్చు.
సెంటిమెంట్ కు సంబంధించిన అంశం, ఉద్యమించక తప్పదు
శ్రీశైలం నంద్యాల జిల్లా (రాయలసీమ ప్రాంతం)లోనే ఉండటం మంచిది. ఇక్కడి ప్రజల సెంటిమెంట్ కు సంబంధించిన అంశం అని రాయలసీమ సాధన సమితీ అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగే సమయంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని వారికి అప్పగించాలని కోరారు. ఆంధ్రులు అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనిని పాలకులు గుర్తించాలి. పైగా శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ భూములు ఇచ్చిన వారు ఇక్కడి వారు. వారి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. మార్కాపురం జిల్లాలో కలపాలనే ఆలోచనను మేము వ్యతిరేకిస్తున్నాం. అదే జరిగితే రాయలసీమ నుంచి ఉవ్వెత్తున ఉద్యమం మొదలువుతుందని దశరథరామిరెడ్డి హెచ్చిరించారు.
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ దేవాలయం
చంద్రబాబు ఆలోచనలు సమర్థనీయం కాదు
శ్రీశైలం ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు శతాబ్దాల సెంటిమెంట్. చంద్రబాబు ఆలోచనలు సరైనవి కాదని కర్నూలుకు చెందిన న్యాయవాది కొప్పిశెట్టి నాగేంద్రనాథ్ పేర్కొన్నారు. మార్కాపురంను జిల్లా చేసి అందులో శ్రీశైలం మండలాన్ని కలపడం ద్వారా శ్రీశైలానికి, నంద్యాల జిల్లా వాసులను దూరం చేయడమా. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణాలో కలపడం ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరు అందించే విషయంపై ఇన్నేళ్లయినా జీవో ఇవ్వలేదు. ఈ ఆలోచన మంచిది కాదు దీని వల్ల ఉద్యమాలు వస్తాయి.’’ అని నాగేంద్రనాద్ అన్నారు. పోలవరం-బనకచర్ల ద్వారా తూర్పు నుంచి పడమటికి నీరు మళ్లిస్తామని చెబితే మేము నమ్మాలా? అని ప్రశ్నించారు. ‘‘సుంకేసులపైన గుండ్రేవుల ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
మార్కాపురం రాయలసీమలో భాగమే కదా
మార్కాపురం రాయలసీమలో భాగం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదట కర్నూలు జిల్లాలోనే ఉండేది. ప్రస్తుతం జిల్లాల విభజన జరిగినా శ్రీశైలం ను మార్కాపురం జిల్లాలో కలపడం వల్ల రాయలసీమ వాసులకు వచ్చే నష్టమేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాయలసీమలో కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు ఉన్నారు. వారు చేస్తున్న ప్రచారం సరైంది కాదు. శ్రీశైలం అనేది ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు అని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కింద ప్రాజెక్టు ఉందన్నారు. సాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టులు అయినందున పెత్తనం కేద్రం వద్దనే ఉంటుందనే సత్యాన్ని గుర్తించాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుపై రాయలసీమ వాసుల పట్టు తగ్గుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు.
శ్రీశైలం ను మార్కాపురంలో ఎందుకు కలపాలి?
నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలాన్ని కలపాలనే ప్రతిపాదన మంచిది కాదని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు అన్నారు. నంద్యాల జిల్లాలో ఉండటం వల్ల వచ్చే నష్టమేమీ లేదన్నారు. నదుల బోర్డును కర్నూలులో పెట్టాల్సిందిగా తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని, చంద్రబాబు దానిని విజయవాడలోనే పెట్టనున్నారన్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో తాము డిమాండ్ చేస్తున్నామని, ఇప్పుడు దానికి ఐకానిక్ టవర్ కట్టాల్సి ఉందంటున్నారని, ఆలోచనలు చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు తీసుకునే కొన్ని నిర్ణయాలు సహేతుకంగా లేవన్నారు.
శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలనేది కుట్ర
నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలాన్ని కలపాలనుకోవడం కుట్రపూరిత ఆలోచన అని రాయలసీమ విమోచనా సమితి యాక్టివిస్ట్ తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. శిద్దేశ్వరం వద్ద అలుగు నిర్మించి బ్యారేజీ నిర్మించాలని ఎప్పటి నుంచో తాము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ తీగల వంతెన నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. శిద్దేశ్వరం వద్ద బ్యారేజ్ నిర్మాణ ప్రతిపాదనను కేంద్రం వద్ద చంద్రబాబు పెట్టలేదని పేర్కన్నారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని కర్నూలు రావాల్సి ఉన్నా రాలేదన్నారు. రాయలసీమ వాసులను పక్కకు తోసేయాలనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారన్నారు. 335 కిలో మీటర్ల దూరం నుంచి అడవుల గుండా బనకచర్ల ప్రాజెక్టును తీసుకొస్తానని చెప్పటం కూడా బూటకమన్నారు. తుంగభద్ర, గండ్రేవుల ప్రాజెక్టులకు కనీస మొత్తం కూడా నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. పట్టిసీమ వద్ద ప్రస్తుతం మోటార్లు ఆపారని, కృష్ణా నీరు కూడా సముద్రంలో కలుస్తున్నందున ఆపక తప్పలేదన్నారు. చంద్రబాబు మధ్య కోస్తా స్థిరీకరణపై చూపుతున్న శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టులపై చూపడం లేదన్నారు. రాయలసీమ ఉద్యమాలను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేస్తున్న ఆలోచన ఇది అని అన్నారు.
స్థానికుల నిర్ణయం మేరకే జరగాలి
శ్రీశైలం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపాలనే ప్రతిపాదన స్థానికుల అభిప్రాయం మేరకు జరగాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. స్థానికుల అభిప్రాయాలకు భిన్నంగా ఏది చేసినా అది చారిత్రక తప్పిదం అవుతుందన్నారు. స్థానిక మెజారిటీ ప్రజల అభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఆథ్యాత్మిక కేంద్రాలు జిల్లాలు కావాలి
శ్రీశైలం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపాలనే ఆలోచన సరైంది కాదని, ఇది అనవరసమైన చర్చ అని ప్రముఖ రచయిత యక్కలూరి శ్రీరాములు పేర్కొన్నారు. ‘‘శ్రీశైలంతో పాటు అన్నవరం, సింహాచలం వంటి ఆథ్యాత్మిక కేంద్రాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలి. ఈ జిల్లాలకు చారిత్రకత ఆధారంగా పేర్లు పెట్టాలి’’ అని అన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే మంచిదన్నారు.
దోర్నాల మండలాన్ని నంద్యాల జిల్లాలో కలపాలి
నంద్యాల జిల్లాలో పెద్దదోర్నాల మండలాన్ని కలపడం మంచిదని మేధావి కల్కుర చంద్రశేఖర్ అన్నారు. శ్రీశైలం మండలాన్ని కాబోయే మార్కాపురం జిల్లాలో కలపడం కంటే పై నిర్ణయం సముచితమన్నారు. కృష్ణా నది నుంచి రాయలసీమ, తెలంగాణ, చెన్నై లకు నీరు అందిస్తున్నారని, అటువంటప్పుడు ప్రస్తుతం నీరు సమృద్దిగా ఉన్న సర్కారు జిల్లాల చేతుల్లో శ్రీశైలం ప్రాజెక్టును పెట్టడం మంచిది కాదు. వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి నీరు తరలించేందుకు రాయలసీమ వాసులు ఎటువంటి అభ్యంతరం పెట్టలేదనే విషయం గుర్తించాలి. అనాది నుంచి కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఉన్నందని, గతంలో జరిగిన జిల్లాల విభజనలో నంద్యాల జిల్లాకు పోయినా అది కూడా రాయలసీమే కాబట్టి ఎటువంటి అభ్యంతరం రాలేదు. కానీ మార్కాపురంలో శ్రీశైలం మండలాన్ని కలపడం రాయలసీమ ప్రాజెక్టులను దెబ్బతీయడమే అవుతుందన్నారు.
ప్రజల అభిప్రాయం మేరకు చేయాలి
శ్రీశైలం మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ప్రజాభిప్రాయం మేరకు ఉండాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. మార్కాపురం, పోలవరం లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని తాము మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న మండలాలు జిల్లా మర్చాలంటే స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోవడం మంచిదన్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాలను పక్కనబెట్టి చేయాలని సూచించారు.
ప్రాంతాల మధ్య వివాదాలు రాకుండా చూడాలి
సుదీర్ఘ కాలంగా శ్రీ శైలం కర్నూలు జిల్లాలో భాగంగా వుంటుండేది. కర్నూలు నుంచి నంద్యాల జిల్లా గా మారాక అటు కలిపారు. ఇప్పుడు మళ్లీ పేర్లు, ప్రాంతాలు మారుస్తామని కథనాలు ప్రచారం లోకి వస్తున్నాయని ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. వున్న రెండు జిల్లాలతోపాటు కొత్త గా ఏర్పాటు చేస్తారంటున్న ప్రాంతాలలో కూడా సహజంగా నే దీనిపై భిన్నాభిప్రాయాలు వున్నాయన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రాంతాల మధ్యలో ఎలాంటి వివాదాలు రాకుండా అందరితో సమగ్రమైన చర్చలు చేసి ప్రజాస్వామికంగా నిర్ణయం చేయాలి. ముందస్తు లీకులతో వివాదం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాల ఏర్పాటు, పెంపు, పునర్విభజన ఇవన్నీ సమగ్ర దృష్టితో, అధికార పరిధిలో పారదర్శకంగా శాస్త్రీయంగా జరగాలే తప్ప తాత్కాలిక రాజకీయ అవసరాలు ఒత్తిళ్ల తో కాదని గుర్తుంచుకోవాలని అన్నారు.