విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం
రెండు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. దాదాపు 1500 మందికి పైగా తెలుగు భాషా ప్రేమికులు హాజరు కానున్నారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విజయవాడ వేదికగా మారింది. విజయవాడ నగరంలోని కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో వీటిని నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం సంయుక్తంగా ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. ఇవి ఆరో ప్రపపంచ మహాసభలు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలు శనివారం ప్రారంభం అయ్యాయి. సుప్రీ కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వీటిని ప్రారంభించారు. ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 1500 మంది తెలుగు రచయితలు, కవులు, తెలుగు భాషాభిమానులు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు. వీటి కోసం కేబిఎన్ కళాశాలలోని పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. అందులో రామోజీరావు పేరుతో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. రెండు రోజుల్లో 25కుపైగా తెలుగు భాషపై సదస్సులు, కవితా సమ్మేళనాలు, సాహిత్య సమ్మేళనాలు నిర్వహించనున్నారు.
వేదికలపై దాదాపు 800 మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు పాల్గొనే విధంగా వేదికలను తీర్చి దిద్దారు. సభా ప్రాంగణంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మందికి తెలుగు రచయితలు, కవులు, చిత్ర పటాలతో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. అనేక అంశాలపైన సదస్సులు, సమ్మేళనాలు నిర్వహించనున్నారు. తెలుగు భాషపై పరిశోధనలు, సాహిత్యం, విద్యారంగం, శాస్త్ర సాంకేతిక రంగం వంటి పలు రంగాలలో తెలుగు భాష ప్రధాన్యంపైన సదస్సులు జరగనున్నాయి. రాజకీయ, న్యాయ, పరిపాలనలో తెలుగు భాష ప్రధాన్యత పెంచే విధంగా ప్రత్యేక సదస్సులు జరగనున్నాయి. పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలు, ప్రింటింగ్ సంస్థల్లో తెలుగు భాషపై ప్రాధాన్యం, తెలుగు భాషను ఉపయోగించడం వంటి పలు అంశాలపైన కూడా సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సభలకు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాలయ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్ వంటి ప్రముఖలు అతిధులుగా హాజరయ్యారు.