అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు: టీడీపీ, వైసీపీ ఎందుకు మాట్లాడవు?

అంబేడ్కర్ పై అమిత్ షా చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నోరు విప్పకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

Update: 2024-12-28 17:47 GMT
డైలాగ్-1
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకు ఎన్నో పదవులు ఇచ్చా. తన మనసంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద వర్గాలవారేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 'నా ఆచరణ కూడా ఎస్సీలు, బీసీలే. నా వెనక ఉన్న ఆ నలుగురు కూడా మీరే. మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు. ఇది ఎప్పటికీ మన అనుబంధం. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదు.. బీసీలంటే బ్యాక్‌బోన్‌ క్లాసులని, బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని, బీసీలంటే వెన్నెముక కులాలు' అని వైఎస్ జగన్ అన్నారు. ( 2024, ఏప్రిల్. ఎన్నికల సభల్లో వైఎస్ జగన్ పదేపదే చెప్పిన మాట)
డైలాగ్-2
'చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం బీసీ శాఖ ఏర్పాటు చేయాలి. జనాభాలో 70 శాతంగా ఉన్న బీసీలు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడే ఉన్నారు. బీసీల మేలు, వారి సమస్యల పరిష్కారం కోసం టీడీపీ మ్యానిఫెస్టోలో పలు అంశాలు చేర్చాం. దాంతో పాటు టీడీపీ అధికారంలోకి రాగానే ఆదరణతో పాటు బీసీలకు సంబంధించిన పథకాలు అమలు చేస్తాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ముఖ్యమంత్రి జగన్.. ఆయా వర్గాలను నాశనం చేశారు. బీసీలను అక్కున చేర్చుకున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే ' 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో.
డైలాగ్-3
‘‘అంబేడ్కర్! అంబేడ్కర్! అంబేడ్కర్! అంబేడ్కర్! అంబేడ్కర్! అంబేడ్కర్!’ అనడం ఇప్పుడు కొందరికి ఒక ఫ్యాషన్ అయింది. అదే, దేవుడి పేరుని అన్నిసార్లు పలికితే, ఏడు జన్మలవరకూ (‘సాత్ జనమ్ తక్’) వాళ్ళకు స్వర్గం దొరుకుతుంది’’ (2024 డిసెంబరు 17న రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా.)
ఈ మూడు డైలాగులు మూడు పార్టీలు చెప్పినవి.
అమిత్ షా ప్రకటనపై ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విరుచుకుపడ్డారు. ‘అమిత్ షా, అంబేడ్కర్‌ని (‘అంబేడ్కర్ ఏమన్నా దేవుడా, అన్నిసార్లు అనడానికి?’ అనే అర్థంతో అవమానించారు కాబట్టి, ఆయన క్షమాపణ చెప్పాలి! అమిత్ షా, మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి! ప్రధానమంత్రి ఆయన్ని మంత్రిగా తీసివెయ్యాలి!’’ అని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనలు చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపిచ్చింది.
కాంగ్రెసు పార్టీ నిరసనలకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు కూడా పోటీ ప్రదర్శనలు చేశారు. ఈ రెండు పార్టీలూ, వాటి మిత్రపక్షాలూ అమిత్ షా ప్రకటనలకు అనుకూలంగా ప్రతికూలంగా పోటాపోటీ ఆందోళనలకు దిగాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి వద్దాం. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనుకూల విధానాలనే అనుసరిస్తున్నాయి. విధానపరమైన వ్యవహారాలలో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే రీతిలోనే వ్యవహరిస్తున్నాయి. ఆయా పార్టీల రాజకీయ అవసరాల కోసం అలా కేంద్రంతో సర్దుకుపోతున్నాయని సరిపెట్టుకున్నా ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నేరుగా అంబేడ్కర్ ను ఉద్దేశించి చేసినవన్నది కాంగ్రెస్, ఇతర వామపక్షపార్టీలు, దళిత సంఘాలు చేస్తున్న ఆరోపణ.
ఆంధ్రలో విచిత్ర పరిస్థితి...
అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఇప్పటికే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర శాఖల నాయకులు వైఎస్ షర్మిల, కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలు డిసెంబర్ 30న రాష్ట్రవ్యాపిత ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. అయితే ఈ మూడు పార్టీలకూ అటు శాసనసభలో గాని ఇటు పార్లమెంటులో గాని రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం లేదు. కానీ అధికార టీడీపీకి, ప్రతిపక్ష వైసీపీకి అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది. చంద్రబాబుతో పొత్తులో ఉన్న జనసేన పార్టీకి కూడా ప్రాతినిధ్యం ఉంది. పార్లమెంటులో ఆయా పార్టీల సభ్యుల నుంచి రికార్డులను తెప్పించుకుని పరిశీలించి అసలు అమిత్ షా ఏమి మాట్లాడారో నిర్ధారణకు రావచ్చు.
ఆచరణలో ఏమి జరుగుతోంది?
ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. అందువల్ల ఆయా పార్టీలు నోరు విప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. అమిత్ షా వ్యాఖ్యల మర్నాడు డిసెంబర్ 18న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు- బహుశా అమిత్ షా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారేమో- అనే అర్థం వచ్చేలా మాట్లాడినట్టు మీడియాలో ప్రత్యేకించి టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అధికారంలో పాలుపంచుకోవడంతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నందున టీడీపీ, జనసేన మౌనం దాల్చిఉండవచ్చు.
కానీ, 'నా ఎస్సీలు, నా బీసీలనే' వైసీపీ నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది మిగిలిన ప్రతిపక్ష పార్టీ నేతల ప్రశ్న. అంబేడ్కర్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతి అంశంపై స్పందించే రెండు ప్రధాన పార్టీల (టీడీపీ, వైసీపీ) నాయకులు గోడ మీది పిల్లివాటాన్ని ప్రదర్శిస్తున్నాయని రామకృష్ణ తీవ్రంగా ఆక్షేపించారు.
‘అంబేడ్కర్ ఆశయాలను ఆచరించేది మేమంటే, మేం’ అని పోటీలు పడి చెప్పుకునే ఇరు పక్షాల తీరు రాష్ట్ర ప్రజలకు అంతుబట్టకుండా ఉంది.
ఈ రెండు పార్టీలకు అంబేడ్కర్ పట్ల ఆరాధనాభావం గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఆ రెండు పార్టీల ఆరాధనా భావం నిజం కాదని, ఏ రాజకీయ పక్షమూ, ఆయన ఆశయాల ప్రకారం నడవడం లేదని కొందరు మేధావుల అభిప్రాయం. రెండు పార్టీలూ కూడా, రాజకీయ అవకాశవాదాలతో ఉన్నాయని సీనియర్ జర్నలిస్టు పి.శరత్ అభిప్రాయపడ్డారు. దళిత ఓటర్లకి ఆరాధ్యదైవమైనవాడిగా ఉన్న అంబేడ్కర్‌ని సొంతం చేసుకోవాలన్న తాపత్రయం, దాని వల్ల దళిత ఓట్లన్ కొల్లగొట్టే తీరు తప్ప మరేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అధికారం కోసం పోటీ పడే ఈ రెండు పార్టీలు ఎన్నికల సమయంలో అంబేడ్కర్ ని ‘నా వాడు’ అంటే, ‘నా వాడు’ అని చెప్పుకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయే తప్ప అంబేడ్కర్ పై ఆరాధన ఏమీ లేదన్నది దళితనాయకుడు కె.శౌరయ్య చెప్పారు.
ఇప్పటికైనా టీడీపీ, జనసేన, వైసీపీ నేతలు తమ ముసుగులు తీసేసి అంబేడ్కర్ ను అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈనెల 30న వామపక్షాలు చేసే ఆందోళనకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
నిజానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 41శాతం ఓట్లలో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవే. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య తేడా 53 లక్షల 72 వేల 166 ఓట్లు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి కలిపి 55.29శాతం అంటే 1 కోటి 86 లక్షల 56 వేల 300 ఓట్లు వచ్చాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను ఆ వర్గాలు దేవుడిగానే పరిగణిస్తున్నాయి. అట్టడుగు కులానికి చెందిన ఓ వ్యక్తి అత్యున్నత మేధో శ్రమతో ఉన్నత స్థాయికి వచ్చిన అంబేడ్కరును సాక్షాత్తు ఓ కేంద్ర మంత్రి అవమానించినట్టు దుమారం చెలరేగుతుంటే ఆ వర్గాల ఓట్ల కోసమైనా ఈ రెండు పార్టీలు మాట వరసకైనా ఖండించక పోవడం విచారకరమని దళితవర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
అంటరానికులాల వారి కోసం పాటుబడిన సంస్కర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అటువంటి వ్యక్తిని అవమానిస్తే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే ధోరణిని ప్రధాన రాజకీయ పార్టీలు అనుసరించడం విచారకరమని సీనియర్ దళిత నేత జల్ది శ్రీధర్ అన్నారు. ప్రజలు ఎంత కాలం భ్రమలలో ఉంటే అంత కాలమూ పాలన సాఫీగా సాగుతుందనుకోవడమే దీనికి కారణమని అభిప్రాయపడ్డారు. ఓట్ల సమయంలో పోటీలు పడి మరీ అంబేడ్కర్‌ని పొగిడే పార్టీలు ఈ సమయంలో నోరు విప్పి ఉండాల్సిందని శ్రీధర్ అన్నారు.
Tags:    

Similar News