ఉచిత పథకాలపై మారిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు

ప్రజలకు ఉచితంగా సాయం అందించే పథకాలు సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య అంతరాలు సృష్టిస్తున్నాయా? ఒకరు భయమేస్తోందంటే.. మరొకరు మౌనంగా ఉన్నారు..;

Update: 2025-01-30 06:13 GMT

2024 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి నేతలు ఉచితంగా సాయం అందించే పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో సూపర్ సిక్స్ ప్రధానమైనవి. అవి కాకుండా గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన డీబీటీ పథకాలు కూడా అమలు చేస్తామన్నారు. అయితే జగన్ పథకాల ప్రస్తావన లేకుండా పోయింది. సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రభుత్వం కుస్తీ పడుతూనే ఉంది. సామాజిక పెన్షన్ ల పథకం గురించి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. పెన్షన్ పెంచారు. కానీ పాత పథకమే. కొత్తగా తీసుకొచ్చింది కాదు. పేదలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇచ్చే పథకం అమలు మొదలైంది. ఇందులో కొన్ని లోపాలు ఉన్నా పథకం పనిచేయడం ప్రారంభమైంది. సిలెండరు ధరకంటే ఎక్కవగా డబ్బలు ఉచిత సిలెండర్లకు తీసుకొంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

పెట్టుబడులపై చూపించే శ్రద్ధ పథకాల అమలుపై లేదు

రాష్ట్రానికి పెట్టుబడి దారులు ఎక్కువగా రావాలని, వారి ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ప్రతి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు శాఖల వారీగా సమీక్షలు జరిగే సమయంలోనూ ఇవే అంశాలపై ప్రస్తావన చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కోట్లు వేసుకుని దావోస్ లో కూర్చొంటే పెట్టుబడులు రావని, స్థిరమైన, భద్రత కలిగిన పాలన అందిస్తే పెట్టుబడి దారులు వారంతట వారే వస్తారన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశాల్లోనూ పలు సార్లు మాట్లాడుతూ తప్పకుండా హామీ ఇచ్చిన పథకాలు అమలు చేస్తామని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయాలని, వెంటనే పథకాలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఉచితాలను చూసి భయపడుతున్న చంద్రబాబు

ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చాము. ఇప్పుడు ఈ పథకాలు చూస్తుంటే భయమేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆ తరువాత సమీక్షల సమయంలో పథకాల అమలుకు ఎంత ఖర్చవుతుంది. మన వద్ద ఉన్న బడ్జెట్ ఎంత? అనే అంశాలను చాలా సార్లు అధికారుల వద్ద ప్రస్తావించారు. ఇటీవల 2024-25కు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పథకాలకు నిధుల కేటాయింపులు జరిగాయే కాని అమలు వ్యవహారంపై ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఇప్పటికే పలు సార్లు మంత్రులు, అధికారుల బృందాలు కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ పథకం అమలు జరుగుతున్న తీరును ప్రభుత్వానికి నివేదించారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ప్రయాణ చార్జీల పరిస్థితి ఏమిటో తెలుసుకుని ప్రత్యేక నివేదికలు కూడా ప్రభుత్వానికి ఇచ్చారు.

ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం విషయమై వాయిదాలు వేస్తూ వస్తున్నారు. వచ్చే జూన్ నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అంటే ఒక ఏడాది పథకం అమలు కాలేదని చెప్పొచ్చు. జూన్ లో నైనా తప్పకుండా ప్రారంభిస్తారా? లేదా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

నెలనెలా మహిళా ఆర్థిక సహాయ పథకం ఎప్పటి నుంచో..

ప్రతి నెలా రూ. 1,500లు మహిళలకు ఆర్థిక సాయం కింద అందజేస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ పథకం కూడా ఈ ఏడాది అమలు లేనట్లే. ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ పథకానికి బడ్జెట్ లో నిధులు కేటాయించారు. అయినా పథకం ఊసే కనిపించడం లేదు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం 18 ఏళ్లు నిండి 59 సంవత్సరాల లోపు ఉండే మహిళలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి అప్పట్లో చెప్పారు. అంటే యుక్త వయసు నుంచి వృద్ధులైన మహిళ లందరికీ పెన్షన్ పథకం అమలు జరుగుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేస్తున్నట్లు దాఖలాలు కూడా లేవు.

20 లక్షల ఉద్యోగాల మాటలేమిటి?

ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఇచ్చి ఖాళీలు భర్తీ చేయడం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేది ప్రధానంగా ఇచ్చిన హామీ ఈ హామీ కూడా ఈ ఏడాది అమలు కాలేదని చెప్పొచ్చు. ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతకు భృతి కింద రూ. 3,000లు ఇస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదు. ఈ పథకంపై నిరుద్యోగులు ఆశలు వదులుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సర్వే జరుగుతున్నందున ఆ సర్వే పూర్తయి. ఎవరిలో ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ లో మరింత పట్టు సాధించేందుకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది జరిగే పని కాదని నిరుద్యోగులు ఒక అవగాహనకు వచ్చారు. రైతు భరోసా సరేసరి. కేంద్రం ఇస్తుంది కాబట్టి అందులోనే రైతు భరోసా ఇస్తున్నట్లు రాష్ట్రం చెప్పుకుంటూ కాలం గడుపుతోంది.

తల్లికి వందనం ఏమైందో..

ఇచ్చిన హామీలో ప్రధానమైనది తల్లికి వందనం పథకం. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తల్లికి వందనం పేరుతో పథకం అమలు జరిగింది. తల్లికి వందనం పేరుతో కూటమి అమలు చేసేందుకు హామీ ఇచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తిస్తుందని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. కానీ ఇంత వరకు ఈ పథకం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 6వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయినా దాని ఊసే లేదు. పైగా ప్రస్తుతం ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికి మాత్రమే ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. హామీ మాత్రం ఏ స్కూలులో చదువుకున్నా అందరికీ పథకం వర్తిస్తుందని గతంలో చంద్రబాబు చెప్పారు. వైఎస్ జగన్ పదో తరగతి వరకు మాత్రమే ఇచ్చారని, మా ప్రభుత్వం ఇంటర్ వారికి కూడా తల్లికి వందనం కింద సాయం అందిస్తామని చెప్పారు.

పవన్ కల్యాణ్ ఏమంటున్నారు...

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా వరకు పథకాల మాటలు మరిచి పోయారు. రోజు వారీ కార్యక్రమాల అమలు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఎక్కడైనా పథకాల గురించి ప్రస్తావించాల్సి వస్తే సూపర్ సిక్స్ పథకాలు కూటమి కలిసి తీసుకున్న నిర్ణయమని, తప్పకుండా అమలు చేయాల్సిందేనని చెబుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో పవన్ కల్యాణ్ మౌనం వహించడం వెనుక పథకాలు అమలు చేసే పరిస్థితులు కనిపించడం లేదని భావించాల్సి ఉంటుందనే భావన రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తే సాధారణ పథకాలు ఆపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గానికి సైతం ప్రభుత్వం నిధులు ఇప్పించుకోవడంలో పవన్ కల్యాణ్ వెనుక పడ్డారనే చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ కు తెలిసిన కంపెనీల నుంచి సీఎస్ఆర్ ఫండ్స్ తెప్పించి పిఠాపురంలో పలు రకాల పనులు చేపట్టారు.

పథకాల విషయంలో ఇద్దరి మధ్య  పదనిసలు

ఉచిత పథకాల హామీలను చూస్తుంటే భయం వేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అంటుంటే.. హామీ ఇచ్చాము కాబట్టి తప్పకుండా పథకాలు అమలు చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రికి పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఒకరిలో సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతుంటే.. మరొకరు నుంచి అమలు చేయాల్సిందేననే మాటలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరాన్ని రెండు నెలల్లో దాటుతోంది. ఈ రెండు నెలల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యే అవకాశం లేదు. కేవలం దీపం పథకం -2 మాత్రమే అమలు జరిగింది. మిగిలిన వన్నీ అమలు ఆలోచనల దశ దాటలేదు.

Tags:    

Similar News