'స్పా కల్చర్'తో.. ఆధ్యాత్మిక క్షేత్రంలో అలజడి !

నగరీకరణ కొత్త సంస్కృతిని అలవాటు చేసింది. ఊహించిన నీలి వ్యవహారాలు వెలుగు చూశాయి. దీంతో తిరుపతి ఆధ్యాత్మిక నగరం అవాక్కయింది.

Update: 2024-09-16 16:04 GMT

దుకాణం చూస్తే మాత్రం వెల్నెస్, స్పా సెంటర్, మసాజ్ కేంద్రం. బయట కనిపించే బోర్డులు ఇవి. లోపలికి వెళితే మాత్రం మసాజ్ ముసుగులో సాగేది పడుపువృత్తి. ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా కలాపాలు పట్టణాలకు కూడా విస్తరించాయి. తాజాగా తిరుపతిలో బట్టబయలైన స్పా సెంటర్ కల్చర్ కొత్త సవాళ్లను విసిరింది. పోలీసుల దాడుల్లో నగరంలోని ఎనిమిది స్పాసెంటర్ల వ్యవహారం వెలుగు చూసింది. అవన్నీ యాత్రికులు, విద్యా కేంద్రాలతో రద్దీగా ఉండే ప్రాంతాలు కావడం గమనార్హం.


అది తిరుపతి నగరం. ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ కు దగ్గర. రోడ్డు దాటితో టీటీడీ శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం. ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రి, దగ్గర్లోనే ఎగ్జిబిషన్ మైదానం. స్థానికులు, వాహనాలతో రద్దగా ఉండే ప్రదేశం. వాటి మధ్య "స్పా మసాజ్ సెంటర్"లోకి పోలీసులు వెళ్లారు. అంతే, మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న పడుపువృత్తి బట్టబయలైంది. ఈ వ్యవహారం నగరంలో పెద్ద చర్చకు దారితీసింది.
పట్టణాలకు విస్తరణ
ఇప్పటి వరకు ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన నీలి వ్యవహారాలు ఆధ్యాత్మిక నగరానికి కూడా విస్తరించాయని తెలుసుకున్న స్థానికులు విస్తుపోయారు. మొదట ఈ కేంద్రాలను చూసిన వారంతా నగరంలో మసాజ్ సెంటర్ పరిచయం చేశారేమో అనుకున్నారు. స్పా అనగానే పోలీసులకు అనుమానం వచ్చినట్లు ఉంది. వాటిపై నిఘా ఉంచారు. దీనిని పసిగట్టలేని ఆన్ లైన్ సేవలను బాగా వాడుకోవడం తెలిసిన నిర్వాహకులు తమ వ్యవహారాలు సాగించారు. పోలీసుల రంగప్రవేశంతో రెండు రోజుల కిందట సీన్ మొత్తం వెలుగులోకి వచ్చింది.
నగరంలోని అత్యంత రద్దీప్రదేశాలైన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేంద్రాలు, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, తిరుమలకు వెళ్లే అలిపిరి బైపాస్ రోడ్డులోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు స్పా సెంటర్లు ఏర్పాటు చేసిన విషయం పోలీసుల దాడుల్లో బయటపడింది.
ఆధ్యాత్మిక నగరంలో అలజడి
తిరుపతి నిత్యం యాత్రికులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆధ్మాత్మిక నగరం గోవిందనామ స్మరణలతో అలరారుతుంటుంది. మారుతున్న కాలానికి తగినట్లు అనేక ఆధునిక వసతులు కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వెలుగులోకి వస్తున్న అసాంఘిక కలాపాలు ఆధ్యాత్మిక ప్రతిష్టను మసకబారుస్తున్నాయనే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు, రైల్వే, ఆకాశయానం ద్వారా సగటున తిరుపతికి లక్ష మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరు కాకుండా నగర జనాభా కూడా 2.50 లక్షలు దాటింది.
మొన్నటి దాకా నగరాల్లో..
మసాజ్, బాడీబిల్డింగ్ వంటి వసతులతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై నగరాలకు మాత్రమే స్పా సెంటర్ల పేరుతో సేవలు అందుబాటులో ఉన్నాయి. వెబ్ సైట్లలో కూడా వాటి అడ్రస్ లు, వివరాలతో పాటు ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్తగా అక్కడికి వెళ్లే వారికి మాత్రమే అక్కడి విషయాలు తెలుస్తాయి. పాత కష్టమర్ల ద్వారా కొత్తవారిని కూడా ఆకట్టుకుంటు ఉంటారు. ఇది స్పా సెంటర్లలో సర్వసాధారణంగా జరిగేదే. నిర్వాహకుల వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండే సమస్య లేదు. ఇదే వారిని చిక్కుల్లో పడేయడమే కాదు. ఈ విష సంస్కృతికి అడ్డుకట్టపడుతుంది.

తిరుపతిలో ఏమి జరిగింది?

తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్. సుబ్బారాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న చర్యలు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయని చెప్పక తప్పదు. ఇసుక అక్రమ రవాణాకు ఎస్కార్ట్ గా వ్యవహరిస్తున్న ఇద్దరు చంద్రగిరి పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. అదే సమయంలో అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కూడా వేటు వేశారు. అదేసమయంలో రాత్రిళ్లు కూడా గస్తీ పెంచారు. అంతేకాకుండా, నీలి వ్యవహారాలు కూడా కట్టడి చేయడానికి లాడ్జీలు, హోటళ్లలోనే కాకుండా, ప్రయివేటు అతిధి గృహాలపై కూడా కన్ను వేశారు. ఆ క్రమంలో తిరుపతిలో వెలసిన స్పా సెంటర్ల సమాచారం అందుకున్న పోలీసులు వాటిపై కన్నేసి ఉంచారు. తమ సందేహాలు నిజమే అని తేలడంతో ఎస్. సుబ్బారాయుడు తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణకు ఆదేశాలు ఇచ్చారు. అలిపిరి సీఐ రామకిషోర్, ఎస్వీయూ సీఐ, వెస్ట్ సీఐలు సెర్చ్ వారెంట్లతో దాడి చేశారు. టీటీడీ శ్రీనివాసం సమీపంలోని కొర్లగుంట ఓప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రి సమీపంలోని SEA-7 సలూన్ & స్పా సెంటర్ లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అరెస్ట్ చేశారు.
"వారిలో రిసెప్షనిస్ట్ కూడా ఒకరు ఉన్నారని అరెస్ట్ అయిన యువతుల్లో ముంబై, మహారాష్ట్రకు చెందిన యువతులు ఉన్నారు" అని డీఎస్పీ వెంకటనారాయణ మీడియాకు వెల్లడించారు.
ముంబై నుంచి తిరుపతికి

స్పా సెంటర్ నిర్వాహకురాలు మనీషా అనే యువతి ఢిల్లీ నుంచి వచ్చారని పోలీసు అధికారుల ప్రకటన స్పష్టం చేస్తోంది. తిరుపతికి వచ్చిన ఆమె స్పా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా యువతులను పొరుగు రాష్ట్రాల నుంచి రప్పించినట్లు సందేహిస్తున్నారు. ప్రధాన నగరాల్లో ప్రతి వీధినా వెలిసిన స్పా సెంటర్లకు పొరుగు రాష్ట్రాల నుంచి మాయమటలతో తీసుకువచ్చే యువతులను ఈ రొంపిలోకి దించుతున్నారనే విషయం అనేక సంఘటనల్లో వెల్లడైంది.
ఆ కోణంలోనే "ఈ సెంటర్ల వెనుక ఉన్న నిర్వాహకులు ఎవరు? తెరవెనుక నడిపించే వారిని బయటికి తీసుకుని రావడానికి దర్యాప్తు చేస్తన్నాం " అని డీస్పీ వెంకటనారాయణ స్ఫష్టం చేశారు. వారందరిపై ట్రాఫిక్ ఇమ్మోరల్ యాక్టు కింద కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు. ఈస్ట్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆధ్యాత్మిక ప్రతిష్టను కాపాడతాం..

తిరుపతి నగరానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక రాష్ట్రాల నుంచి యాత్రికులు వేల సంఖ్యలో వస్తుంటారు. వారి కోసం ఆర్టీసీ బస్టాండ్ నుంచి అలిపిరి వరకు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. ఈ బైపాస్ రోడ్డులో ప్రధాన రహదారికి ఇరుపక్కలే కాకుండా, సందుగొందుల్లో గడచిన కొన్ని నెలల వ్యవధిలోనే రెస్ట్ హౌసుల పేరట వందల సంఖ్యలో ప్రైవేటు అతిధి గృహాలు వెలిశాయి. వాటి పక్కనే అనేక ఇతర హోటళ్లు కూడా ఉన్నాయి. సాధారణంగా హోటళ్ల ఏర్పాటుకు మున్సిపల్, అగ్నిమాపక, పోలీస్ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ వివరాలన్నీ స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా రికార్డు చేయించాలి. కొన్ని ప్రైవేటు విశ్రాంతి అతిథి గృహాలు వాటిని పాటించడం లేదు. దీనిపై అలిపిరి సీఐ రామకిషోర్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడారు.
"మా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని హోటళ్ల వివరాలు ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు ఏమాత్రం అవకాశం లేకుండా కఠినంగా వ్యవహరిస్తాం" అని రామకిషోర్ చెప్పారు. ఎస్సీ ఎల్. సుబ్బారాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వారంలో మూడు రోజులు ఖచ్చితంగా తనిఖీ చేస్తాం. ప్రైవేటు రెస్ట్ హౌస్ ల వివరాలు కూడా ఉన్నాయి" అని రామకిషోర్ స్పష్టం చేశారు. ఏ సమయంలో అయినా తనిఖీలు చేసేందుకు పోలీసులకు అధికారం ఉంది. తిరుపతి నగరానికి ఉన్న ప్రాధాన్యత, గౌరవం కాపాడడంలో రాజీ పడే ప్రసక్తి ఉండబోదు" అని ఆయన స్పష్టం చేశారు.
Tags:    

Similar News