రాలుతున్న మల్లె రైతుల ఆశలు
ప్రోత్సాహం లేని ఫ్లోరీకల్చర్;
గుత్తి : లేని బాట వెతుకుతున్న పేద వానికి ….రాని పాట పాడుకున్న పిచ్చివానికి …..బ్రతుకు పూలబాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదుబ్రతుకు పూలబాట కాదు అని ఘంటసాల పడుతుంటే పూల బాట ప్రాశస్త్యం గురించి తెలిసేది. పూలమ్మిన చోట కట్టెలమ్మడం అనే సామెత ఒకటుంది. పూలు సున్నితత్వానికి శుభానికి సంకేతం. కానీ ఇప్పుడు పూలు పండించే రైతు పరిస్థితి దారుణంగా తయారయింది.
గతంలో అబ్బేదోడ్డి గ్రామ రైతులు జిల్లాలో పూల సాగులో 300 ఎకరాల్లో సాగు చేసి ఆదర్శంగా నిలిచారు. అంతే ఆదాయంతో గ్రామానికి జాజి మల్లె, కనకాంబరం సాగు కనక వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ పంట రైతులకు భారమైంది. కూలీల కొరత, వర్షాభావం, మార్కెటింగ్ సదుపాయం, అధ్వన్నంగా రోడ్లు తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయింది. గ్రామంలో సుమారు 300 కుటుంబాలు పూలసాగు తో జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో రైతు 30 సెంట్ల నుంచి ఎకరం వరకు మల్లెపూల సాగు చేస్తున్నారు. రాను రాను వర్షాభావ పరిస్థితులతో, గిట్టుబాటు ధర లేక, రవాణా ఖర్చులు అధికం కావడంతో మల్లెపూల సాగు తగ్గుముఖం పడుతోంది.
రైతులు కూలీలను తీసుకురావడానికి ఆటోలు కొన్నారు. ఉదయాన్నే కూలీల కోసం చుట్టుపక్క గ్రామాలకు వెళ్లి బతిమాలి తెస్తున్నారు. ఒక రోజు డాక్రా మీటింగ్ ఉంది రాము, ఇంకో రోజు మా వీధిలో వాళ్ళది పెండ్లి ఉంది, ఇంకో రోజు జిల్లా కలెక్టర్ యోగ దినం చేస్తున్నారు దానికి మాకు ఆహ్వానం అందింది కాబట్టి పనికి రాలేమని తెగేసి చెబుతున్నారు.
ప్రస్తుతం కేజీ జాజి మల్లె గరిష్ఠంగా రు.150 పలుకుతోంది. ఒక కూలి రోజుకు రెండు కేజీ పూలు పెరుకుతారు. కూలి 200 రూపాయల నుండి 250 వరకు ఉంటుంది. రైతు పరిస్థితి అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరిపోయిందన్నట్లు ఉంది. పూలు తెంపకుండా అట్లాగే ఉంచితే అవి విచ్చుకొని రాలిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతుందన్న ఉద్దేశంతో పూలు తొలగిస్తున్నారు. పూల సాగు ఇప్పుడు నష్టదాయకంగా మారింది.
ప్రస్తుతం పండుగలు లేకపోవడం పెళ్లిళ్లు అరకొర ఉండటం పూల రైతులకు శాపంగా మారింది. దీనికి తోడు అకాల వర్షాలు, దారులన్నీ బురదమయం. గుత్తి మండలంలో అబ్బేదోడ్డి, అణగనదొడ్డి, న్యమతాబాద్, పెద్దొడ్డి కనకాంబరాల సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడి ప్రాంతాల్లో అధిక తేమ, వాతావరణ పరిస్థితులు వాతావరణం సాగుకు అనుకూలిస్తాయి. ఇక్కడి మట్టిలోని నీటి నిల్వలు నేల రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి.
జాజి మల్లె, కనకాంబరాలు ప్రధాన పంటగా మాత్రమే కాకుండా కొబ్బరి, పామాయిల్, జామ, దానిమ్మ, నారింజ వంటి తోటల్లో అంతర పంటగా కనకాంబరం సాగు చేపట్టి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మేలైన యాజమాన్య పద్దతులను పాటిస్తే మొక్కలు నాటిన మూడు నెలల్లోనే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. పూత ప్రారంభమైన తరువాత సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి, జూన్ నుండి జనవరి వరకు పూతకు అనుకూలంగా ఉంటుంది, ఈ సమయంలో దిగుబడి కూడా ఎక్కువుగా ఉంటుంది.
అబ్బేదోడ్డిలో ఎక్కువగా పండించే పంటలలో మల్లె కూడా ఒకటి. గుండు మల్లెను ఎక్కువ విస్తీర్ణంలోను, జాజిమల్లె తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గుండుమల్లె, జాజిమల్లి సువాసనలను వెదజల్లుతాయి. ఈ పూలలో బెంజైల్ ఎసిఫేట్, బెంజైల్ బెంజోయేట్, యూజినాల్, టెర్పనాల్, బెంజాల్డిహైడ్, ఇండోల్ కాంపౌండ్స్, జాస్మిన్, మిథైల్ జాస్మొనేట్ ఉన్నందున పూలకు సువాసనను సంతరించుకున్నాయి. గుండుమల్లె మార్చి నుంచి సెప్టెంబర్ వరకు, జాజిమల్లె మార్చి నుంచి నవంబర్ వరకు పూల దిగుబడినిస్తాయి.
మల్లె పూలు, కనకాంబరాలు ప్రభుత్వం కొనుగోలు చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు రుణాలు అందించి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎన్నో ఏళ్లుగా పూలసాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఇక్కడ ఒక్క కోల్డ్ స్టోరేజ్ యూనిట్ లేకపోవడం శోచనీయం, మార్కెట్ సదుపాయాలు కల్పించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ప్రభుత్వం పూల రైతులకు సబ్సిడీతో రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. అనేక సంవత్సరాలుగా పూల తోటలు సాగు చేసి ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు.
ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి పూల రైతులను ఆదుకోవాలని ప్రజాసైన్స్ వేదిక అధ్యక్షులు డా. ముచ్చుకోట. సురేష్ బాబు, పౌరస్పందన వేదిక రాష్ట్ర నాయకులు ప్రొ. జీ. వెంకటశివారెడ్డి రైతు కూలీ సంఘం నాయకులు బాయినేని నాగేంద్ర ప్రసాద్, ప్రణయనాథ్ రెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.