వల్లభనేని వంశీకి బెయిల్ దొరికేనా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది.;
By : The Federal
Update: 2025-04-21 08:43 GMT
విజయవాడ జైల్లో గత రెండు నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ లభించడం దుర్లభంగా మారింది. భూ ఆక్రమణ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని దరఖాస్తులు చేసుకున్న పిటీషన్‌పై సోమవారం విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి విచారణను మరో వారం రోజుల పాటు వాయిదా వేసింది. దీంతో అటు వంశీ అభిమానులు, ఇటు వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో వంశీకి ఇప్పట్లో బెయిల్ దొరికే పరిస్థితులు కనిపించడం లేదనే చర్చ ఆయన అనుచరుల్లో వినిపిస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడి 8.91 ఎకరాలను విక్రయించారని తేలబ్రోలుకు చెందిన ఎన్ శీధర్‌రెడ్డి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆత్కూరు పోలీసులు వంశీ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసు మీద వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని వంశీ ఆంధ్రప్రదేశ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవలసి ఉందని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను మరో వారం రోజులకు వాయిదా వేసింది.
అయితే వల్లభనేని వంశీ ఇప్పటికే పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్ చేశారనే కేసుతో పాటు, భూ ఆక్రమణ కేసులో కూడా ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు.