రైతుల పేరుతో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తారా
పొదిలి రాళ్ల దాడి ఘటనపై సీరియస్ అయిన సిఎం చంద్రబాబు, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.;
By : The Federal
Update: 2025-06-11 16:40 GMT
పొదిలి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రైతుల పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి ఈ అరాచకాలు ఏంటి? మహిళలపై.. పోలీసులపై రాళ్లు వేస్తారా? అంటూ మండిపడ్డారు. పొదిలి ఘటనపై బుధవారం రాత్రి డీజీపీ, ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ ఘటనలో దాడులకు పాల్పడిన వాళ్లపై ఆధారాలు సేకరించి.. వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ఆదేశించారు.
రైతుల పరామర్శకు వెళితే జిల్లా వ్యాప్తంగా జనసమీకరణ ఎందుకు? వెళ్లింది రైతుల కోసమా.. దాడుల కోసమా? నా ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు. ప్రజా సమస్యల పేరుతో జనంలోకి వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారు. ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే.. దాన్ని అలసత్వంగా భావిస్తారా? దుర్వినియోగం చేస్తారా? అంటూ జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పర్యటనలు చూస్తుంటే.. తన ఉద్దేశం రైతుల సమస్యలు కాదు... అలజడి సృష్టించి, ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అని అర్ధం అవుతుంది. రాజకీయ అజెండాతో చేసే ఇలాంటి పోకడలను అంగీకరించేది లేదని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమస్య ఉంటే నిరసనలు తెలపడానికి, పరామర్శకు వెళ్లడానికి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. దీని కోసం జగన్‌కు ప్రభుత్వం ఎక్కడా అనుమతులు నిరాకరించడం లేదు. అయితే ప్రతి పర్యటనలో వైసీపీ వాళ్లు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు.
శాంతి భద్రతల సమస్య సృష్టించి, రాళ్ల దాడి చేసి.. పోలీసులతో పాటు, పలువురు గాయపడడానికి కారణం అయిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వైసీపీ వాళ్లు ఎక్కడికి వెళ్లాలి అంటే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నాం. అలా అని రాజకీయ ముసుగులో నేరాలు చేస్తాను అంటే మాత్రం సహించేది లేదు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి సిఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జగన్ సొంత ఛానల్‌లో మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. ఆ వికృత వ్యాఖ్యలను, ప్రచారాన్ని అన్ని వర్గాలు ఖండించాయి. అయితే జగన్ మాత్రం ఇప్పటికీ వాటికి క్షమాపణ చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు నాయకులుగా చలామణి అవుతానంటే ఎలా? ప్రజలు ఎలా అంగీకరిస్తారు? ఆడబిడ్డలు ఆవేదనతో నిరసన చేస్తే వారిపై దాడులు చేస్తారా? అని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.