రెబెల్స్ కూటమి కొంప ముంచుతారా?

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్‌ల పరిశీలన పూర్తయిన తరువాత పరిశీలిస్తే ఎన్‌డీఏ కూటమి నుంచి రెబెల్‌ అభ్యర్థులు ఎక్కువ మంది నామినేషన్‌లు దాఖలు చేశారు.

Update: 2024-04-28 06:00 GMT

ఉండిలో రఘురామకృష్ణంరాజుకు షాక్‌

హిందూపురంలో బాలకృష్ణకు టెన్షన్
ఎపిలో ఏప్రిల్‌ 29తో అభ్యర్థుల ఉపసంహరణల గడువు పూర్తవుతుంది. ఎన్‌డిఎ కూటమిలో రెబెల్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని బుజ్జగించి ఉపసంహరించుకునేలా చేసేందుకు ఎన్‌డిఏ కూటమి నానా తంటాలు పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రతిన బూనిన నాయకులే ఈ విధంగా చేయడం రాష్ట్రంలో చర్చనియంశమైంది.
టీడీపీ, బీజేపీ, జనసేనలో టిక్కెట్లు దక్కని పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయడం కూటమికి పెద్ద షాక్‌గా మారింది. వైఎస్సార్‌సీపీ నేతలు పక్కా వ్యూహం ప్రకారమే రెబళ్లను బరిలోకి దించి ప్రోత్సహిస్తున్నారని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్డీఏ కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటు నుంచి ఆ పార్టీల్లో రెబల్‌ అభ్యర్థులు రంగంలోకి దిగారు.
నర్సాపురం జిల్లా ఉండి అసెంబ్లీ టిక్కెట్‌ను రఘురామకృష్ణంరాజుకు టీడీపీ ఇవ్వడంతో అక్కడి టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. తొలుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజుకు టిక్కెట్‌ను ఇచ్చి, ఆ తర్వాత నామినేషన్ల సమయంలో ఆయన్ని తప్పించి రఘురామరాజుకు ఇవ్వడంతో రామరాజు అనుచరులు అసంతృప్తి చెందారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజును టీడీపీ అధిష్టానం పిలిచి సర్దిచెప్పి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతల్ని అప్పగించింది. దీంతో ఆయన ఆధిష్టానం ఒత్తిళ్లకు మెత్తబడి రఘురామకు సహకరించేందుకు అంగీకరించారు. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అసంతృప్తి వీడలేదు. ఉండి అసెంబ్లీకి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.
నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీకి చెందిన పసుపులేటి సుధాకర్‌ నామినేషన్‌ వేశారు. టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుంచి ఇక్కడి సీటును బీజేపీకి కేటాయించాలంటూ పట్టుపడుతున్నారు. అయినా కూటమి నేతలు వెనక్కి తగ్గకుండా కావ్య కృష్ణారెడ్డికి టిక్కెట్‌ కేటాయించారు. దీంతో రెబల్‌ అభ్యర్థిగా పుసుపులేటి సుధాకర్‌ నామినేషన్‌ వేశారు.
ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలోను ఇదే గందరగోళం నెలకొంది. నూజివీడు అసెంబ్లీ టిక్కెట్‌ను మొదటి నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు కేటాయిస్తామని ఆధిష్టానం చెబుతూ వచ్చింది. చివరి నిముషంలో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వలస వచ్చిన కొలుపు పార్థసారథికి ఆ టిక్కెట్‌ను కేటాయించారు. మనస్తాపానికి గురైన ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం లోనూ కూటమికి టెన్షన్‌ పెరిగింది. అక్కడ టీడీపీ టిక్కెట్‌ను వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు ఇవ్వడాన్ని బీజేపీకి నాయకుడు శ్రీనివాసరావు వ్యతిరేకిస్తున్నారు. పోలవరంలో టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా టీడీపీ నేత సూర్యారావు నామినేషన్‌ దాఖలు చేశారు. పోలవరం అసెంబ్లీ టిక్కెట్‌ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు ఇవ్వడంపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నుంచి టీడీపీ నేత సూర్యారావు బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
హిందూపురంలో కూటమి రెబల్‌గా బిజెపికి చెందిన పరిపూర్ణానంద నామినేషన్‌ వేయడంతో అక్కడి కూటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు టెన్షన్‌ పట్టుకుంది.
కురుపాంలో బీజేపీ రెబల్‌గా నిమ్మక జైరాజ్‌ నామినేషన్‌ వేశారు.
ఈ రెబల్‌ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించేందుకుగాను ఎన్డీఏ కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు.
Tags:    

Similar News