పరిష్కారంపై చిగురిస్తున్న ఆశలు

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపధ్యంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Update: 2024-06-06 12:19 GMT

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపధ్యంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇంతకీ కొత్తఆశలు ఏ విషయంలో అంటే సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తెలంగాణా-ఏపీ వివాదాలు పరిష్కారం విషయంలోనే. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికి మూడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయినా గడచిన రెండు ప్రభుత్వాల హయాంలో సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లయ్యింది.

తెలంగాణాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోబోతుండటంతో ఇప్పటికైనా సమస్యలు పరిష్కారమవుతాయేమో అనే ఆశలు మొదలయ్యాయి. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ అత్యంత సన్నిహితులు. సన్నిహితులు అనేకన్నా తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టిమద్దతుదారుడంటేనే బాగుంటుంది. దీనికి అదనంగా చంద్రబాబు ఇపుడు ఎన్డీయేలో భాగస్వామి కాబట్టి సమస్యలను పరిష్కారించాలని చంద్రబాబు, రేవంత్ కు చిత్తశుద్ది ఉంటే చాలు చాలా సమస్యలు పరిష్కారమైపోతాయనటంలో సందేహంలేదు. 2014లో కేసీయార్, చంద్రబాబు ముఖ్యమంత్రులు అయినపుడు సమస్యల పరిష్కారంపై పెద్దగా చొరవ తీసుకున్నది లేదు. ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేసీయార్ ను చంద్రబాబు పిలిచారు. కేసీయార్ కూడా అమరావతికి వెళ్ళారు. ఇద్దరి మధ్యా మంచి సంబంధాలే ఉన్నాయని అనుకున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు.

2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి కేసీయార్ రెండోసారి సీఎం అయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. అప్పుడైనా విభజన సమస్యలు పరిష్కారమవుతాయని అనుకుంటే అప్పుడూ కాలేదు. అంటే చంద్రబాబు, జగన్, కేసీయార్ కు సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ది లేదన్నది అర్ధమైంది. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం చేసి సమస్యల పరిష్కారానికి మార్గంచూపాల్సిన నరేంద్రమోడి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఏదో కంటితుడుపు చర్యలుగా అప్పుడప్పుడు హోంశాఖ జాయింట్ సెక్రటరీ స్ధాయిలో ఇద్దరు చీఫ్ సెక్రటరీలను పిలిచి భేటీ జరిగాయంతే. గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూసిన జనాలకు విభజన సమస్యలు ఎప్పటికీ పరిష్కారవని అర్ధమైపోయింది.

సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ సీఎం అయ్యారు. విభజన సమస్యల పరిష్కారంపై తనవంతుగా కృషిచేస్తానని రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇపుడు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావటంతో విభజన సమస్యల పరిష్కారంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్లు ముఖ్యమంత్రులు ఇద్దరు బాగా సన్నిహితులు. ఇద్దరు కూర్చుని ఏదోపద్దతిలో సమస్యలను పరిష్కరించుకుంటామని అంటే కేంద్రప్రభుత్వానికి అంతకన్నా కావాల్సిందేముంటుంది. కాబట్టి సమస్యల పరిష్కారినికి కేంద్ర హోంశాఖ కూడా చొరవచూపించే అవకాశాలున్నాయి. ఈ మొత్తం నేపధ్యంలో తెలంగాణా నుండి ఏపీకి అందాల్సిన బకాయిలు, ఆస్తుల బదలాయింపు ఎలాగూ సాధ్యంకాదు కాబట్టి వాటి మార్కెట్ విలువ చెల్లించటానికి తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా ఉంటే సమస్యలు దాదాపు పరిష్కారమైపోతుందనే అనుకోవాలి. ఇపుడు గనుక సమస్యలు పరిష్కారం కాకపోతే ఇక ఎప్పటికీ పరిష్కారం కాకపోవచ్చంతే.

చంద్రబాబుకు రేవంత్ ఫోన్

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పోన్ చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు తీసుకుంటున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగులో ఉన్న అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని రేవంత్ కోరారు. చంద్రబాబుకు రేవంత్ ఫోన్ చేసినపుడు మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విప్ రాంచంద్ర నాయక్, కొందరు ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు.

Tags:    

Similar News