మంత్రి సత్యకుమార్‌ ‘ధర్మవరం’ఖ్యాతిని నిలబెడుతారా?

పట్టు చీరలకు, చేనేతల నైపుణ్యానికి అనంతపురం జిల్లా ధర్మవరం పెట్టింది పేరు. ధర్మవరంకు ఉన్న ఖ్యాతిని ఎల్లెడల చాటాలన్న మంత్రి సత్యకుమార్‌ ప్రయోగం ఫలిస్తుందా?

Update: 2024-10-09 03:40 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. పట్టు చీరల తయారీకి ఈ కేంద్రం ప్రసిద్ధి గాంచింది. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ధర్మవరం జిల్లాల విభజన తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోకి పోయింది. శతాబ్దాలుగా పట్టు వస్త్రాల ఉత్పత్తికి పేరు గాంచిన ధర్మవరంలో చీరలు నేసే వారి జీవితాల్లో మాత్రం వెలుగు రావడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ యాదవ్‌ టిక్కెట్‌ దక్కించుకుని విజయం సాధించారు. ధర్మవరం నియోజ వర్గానికి ప్రాతినిద్యం వహించడం యాదృచ్చికమేనని స్వయంగా ఆయనే చెప్పడం విశేషం.

ఆధునికమైన యాంత్రిక యుగంలో పవర్‌ లూమ్స్‌ విపరీతంగా వచ్చాయి. సాంప్రదాయ పట్టు చీరల తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒక్క పట్టు చీరను మగ్గంపై నేయాలంటే సుమారు 15 రోజులు సమయం పడుతుంది. అదే పవర్‌ లూమ్స్‌ మీద అయితే గంటకు 15 చీరలు తయారవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవర్‌ లూమ్స్‌ యంత్రాలను కాదని చేతి మగ్గాల ద్వారా నేతన్నలు పోటీ పడలేరనేది ఎవరికైనా అర్థమవుతుంది.

ఈ రంగంపై ఆధారపడిన ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొనిపోయి, వేరే పనులు చేతకాక, పవర్‌ లూమ్స్‌ పోటీని తట్టుకోలేక, దిక్కు తోచని స్థితికి చేనేత కార్మికులు చేరుకున్నారు. ఇన్ని సవాళ్ల ఊబిలో చిక్కుకొని పోయిన ధర్మవరం నేతన్నలకు అండగా నిలవాలని మంత్రి సత్యకుమార్‌ నిర్ణయించుకున్నారు. దేశం మొత్తానికి ధర్మవరం ఖ్యాతిని చాటి చెప్పడంతో పాటు చేనేత రంగంపై ఆధారపడి ఉన్న వేలాది మంది చేనేత కార్మికులందరికీ ఒక ప్రత్యేక ఉపాధి మార్గాన్ని చూపించాలనే ఆలోచనకు వచ్చారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో «28,500 చేనేత కుటుంబాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ధర్మవరం ప్రాంతానికి సంబంధించి 12,800 కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ కుటుంబాలన్నీ కేవలం ఈ రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. పవర్‌ లూమ్స్‌ను ఎదుర్కొని ఈ చేనేత కుటుంబాలు చితికి పోకుండా ఆర్థికంగా ఆదుకోవాలంటే ఈ రంగంలో తగిన పోటీ తత్వాన్ని పెంచేందుకు చేనేత కార్మికులకు ప్రోత్సహాన్ని ఏవిధంగా అందించాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు సత్యకుమార్‌. ఒక ధర్మవరమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల చేనేత కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. ఈ వృత్తిలో నైపుణ్యం తప్ప వేరే పనులు చేయడానికి నేతన్నలకు చేతకాకపోవడం, పవర్‌ లూమ్స్‌ ద్వారా నేత నేసేందుకు అవసరమైన నైపుణ్యత వీరికి లేక పోవడం, వీరి జీవితాలు ఇలా మారడానికి కారణమనేది ప్రభుత్వం దృష్టిలో ఉంది.
ధర్మవరం హ్యాండ్‌ లూమ్స్‌ క్లస్టర్‌కు కసరత్తు
ధర్మవరం చుట్టుపక్కల ఉన్న 12,800 చేనేత కుటుంబాలకు ఉపాధి చూపించే మార్గాన్ని మంత్రి సత్యకుమార్‌ ఆలోచించారు. ఇందుకు హ్యాండ్‌లూమ్‌ క్లస్టర్‌ ఒక్కటే ప్రస్తుతానికి వారి ఆర్థిక స్థితిగతులను చక్కదిద్దుతుందనే నిర్ణయానికి వచ్చారు. క్లస్టర్‌ ఏర్పాటుకు రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల్లో 80 శాతం మేర అంటే సుమారు రూ. 24 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన 20 శాతం నిధులు అంటే సుమారు రూ. 6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సత్యకుమార్‌ వివరించారు. ప్రతిపాదిత హ్యాండ్‌లూమ్‌ క్లస్టర్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నందు వల్ల ఈ డీపీఆర్‌ను పరిశీలించి ఆమోదించాలని ఆయన కోరారు. వెనువెంటనే చర్యలు చేపడితే చేనేత కార్మిక కుటుంబాల్లో ఆనందం చూడొచ్చని కేంద్ర మంత్రి గిరిరాజా సింగ్‌కు సత్యకుమార్‌ విజ్ఞప్తి చేశారు.
ఒకప్పుడు అగ్గి పెట్టెలో పట్టేంత పట్టు చీరను నేసే నైపుణ్యం ధర్మవరం నేతన్నలకు ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లస్టర్‌ ఏర్పాటు చేయడం ద్వారా హ్యాండ్‌ లూమ్‌తో పాటు పవర్‌ లూమ్స్‌ను కూడా కొంత మేర ఏర్పాటు చేసి దాని ఆపరేటింగ్‌కు తగిన శిక్షణ ఇప్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ధర్మవరం హ్యాండ్‌ లూమ్‌ క్లస్టర్‌ సక్సెస్‌ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను క్లస్టర్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేనేత జౌళి శాఖ చేస్తోంది. ఈ శాఖతో సత్యకుమార్‌కు ఎలాంటి సంబంధం లేక పోయినా కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కావడం, ఆయన చాలా ఏళ్లుగా బీజేపీ కేంద్ర కమిటీలో నాయకుడిగా ఉండటం, ధర్మవరానికి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News