కిరణ్‌కుమార్‌రెడ్డికి కాలం కలిసొస్తుందా?

కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగారు. తర్వాత బిజెపీలో చేరారు. రాజంపేట బిజెపీ ఎంపీ అభ్యర్థిగా దిగారు. ఆయన పరిస్థితి ఏమిటి?

Update: 2024-04-27 10:53 GMT


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని నాయకుడు. ముఖ్యమంత్రిగా సక్సెస్‌ఫుల్‌ అనిపించుకున్నారు. ఒడిదుడుకుల్లోనూ పాలన బాగా చేశారనే ప్రశంసలు అందుకున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి కాంగ్రెస్‌ను వీడారు. సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి పరాజయం పాలయ్యారు. ఆయన పదేళ్ల కాలం రాజకీయాలు పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి ఇప్పుడు బిజెపిలో చేరి రాయలసీమ ప్రాంతమైన రాజంపేట పార్లమెంట్‌ నుంచి ఎన్‌డీఏ కూటమి ద్వారా బిజెపి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల రంగంలోకి దిగారు. రాజంపేట ఆయను ఆదరిస్తుందా? ఎంపీ అవుతారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.
కాంగ్రెస్‌ కంచుకోట రాజంపేట
రాజంపేట పార్లమెంట్‌ నియోకవర్గం 1967లో ఏర్పడింది. కాంగ్రెస్‌ మూడు సార్లు, కాంగ్రెస్‌ ఐ 7సార్లు, టీడీపీ రెండు సార్లు, వైఎస్సార్‌సీపీ రెండు సార్లు గెలిచాయి. కాంగ్రెస్‌ ఐ తరపున ఎ సాయిప్రతాప్‌ ఆరుసార్లు ఎంపీ అయ్యారు. పి పార్థసారథి కాంగ్రెస్‌ తరపున మూడు సార్లు, కాంగ్రెస్‌ ఐ తరపున ఒకసారి ఎంపీగా గెలుపొందారు. 1984లో ఎస్‌ పాలకొండరాయుడు సాయిప్రతాప్‌ను ఓడించి టీడీపీ తరపున గెలిచారు. ఆ తరువాత 1999లో గునిపాటి రామయ్య సాయిప్రతాప్‌ను ఓడించి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఈ రెండు సార్లు టీడీపీ గెలిచింది. 2014లో బిజేపీ అభ్యర్థిగా తెలుగుదేశం పొత్తులో పోటీచేసినా బీజేపీ నీయకురాలు పురందేశ్వరి ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కరాసి పోటీచేసిన బీజేపీ ఓటమిపాలైంది. పార్లమెంట్‌ పరిధిలో ఒక్కశాతం కూడా బీజేపీకి ఓట్లు లేవని చెప్పొచ్చు. తంబళ్లపల్లి నియోకవర్గంలో పూర్వపు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కొందరు ఉన్నారు. వారి ఓట్లు మాత్రం వచ్చే అవకాశం బీజేపీకి ఉంది.
మూడో సారి మిథున్‌రెడ్డి
2014, 2019లో గెలిచిన పివి మిథున్‌రెడ్డి మూడో సారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈయనపై కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీకి దిగుతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు అసెంబ్లీకి గెలిచారు. వాయల్పాడు నియోజకవర్గం నుంచి 1989,1999, 2004లో గెలిచారు. 1994లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీలో స్పీకర్‌గా, చీఫ్‌విప్‌గా, ముఖ్యమంత్రిగా పనిచేశారు.
చరిష్మా పని చేస్తుందా
ఇంతటి చరిష్మా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపీలో చేరడం, రాజంపేట నుంచి బిజెపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడం, ఆయన గెలుపుపై నీలి నీడలు కమ్ముకోవడంపైన చర్చ సాగుతోంది. రాజంపేట పార్లమెంట్‌ నియోజక వర్గంలో రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. రైలేకోడూరు ఎస్సీ, కమ్మ, బలిజ సామాజిక వర్గాల ఆధిపత్యం ఉంటుంది. రాజంపేటలో బలిజ, రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల ఆధిపత్యం ఉంది. ఇక రాయచోటిలో ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గాల ప్రాధాన్యత ఉంది. పీలేరులో రెడ్డి,ముస్లిం, ఎస్సీల ప్రాధాన్యత ఉంది. మదనపల్లి నుంచి ముస్లింల ప్రభావం ఎక్కువ. తర్వాత కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ప్రభావం కూడా ఉంటుంది. ఇక పుంగనూరు బిసీ వర్గాల ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. తర్వాత వరుసలో రెడ్డి, ఎస్సీ, బలిజ సామాజిక వర్గాలు ప్రాధాన్యతగా ఉంటాయి. పీలేరు మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలత ఉందని, ఎన్డీఏ కూటమికి వ్యతిక గాలి వీస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీలేరులో మాత్రం కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ తరపున పోటీలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి రంగంలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. కిశోర్‌కుమార్‌రెడ్డి, రామచంద్రారెడ్టిల మధ్య పోటీని పీలేరులో తీవ్రంగానే ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనా.
కిరణ్‌కుమారెడ్డికి ఓట్లు వేసేది లేదన్న ముస్లింలు
రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజక వర్గాల్లో ముస్లింల ఓటు బ్యాంకు ఎక్కువుగానే ఉంది. ప్రధానంగా రాయచోటి, మదనపల్లిలో ఓటర్లులో మూడో వంతు ముస్లింలే ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డిపైన వ్యక్తిగతంగా వారికి బిజెపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడం వల్ల తాము ఓట్లు వేయలేమని తేల్చి చెప్పినట్లు స్థానికుల్లో చర్చ సాగుతోంది. ఆరు నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అనుకూల గాలులు వీస్తోంటే కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు ఎలా సాధ్యమనేది స్థానికుల్లో పెద్ద చర్చగా మారింది. రాజంపేట నియోజక వర్గానికి రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దించారు. ఈయన మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి కుమారుడు. సుమారు 20 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తారని భావించిన బాలసుబ్రహ్మణ్యాన్ని ఆదరించే పరిస్థితి లేనప్పుడు ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి రంగంలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు సహకరించడం లేదు. వీరు సహకరించకుండా టీడీపీ గెలిచే అవకాశాల్లేవనేది ప్రచారం జరుగుతోంది. అదే పార్లమెంట్‌ అభ్యర్థికి కూడా వర్తిస్తుందనడంలో సందేహం లేదు. రైల్వే కోడూరు జనసేనకు కేటాయించారు. అరవ శ్రీథర్‌ బరిలో ఉన్నారు. ఈయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడగా పేరుంది. పైగా మంత్రి వద్ద సబ్‌ కాంట్రాక్టర్‌. ఈ పరిస్థితుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డిగా గడ్డుకాలమేనని స్థానికుల్లో చర్చ సాగుతోంది.
Tags:    

Similar News