జనసేన 15 సీట్లను గెలుస్తుందా?

చీలికలు పేలికలుగా ఉండే కాపు సామాజికవర్గం ఏకమైందా? జనసేనకు అండగా నిలవాలని నిర్ణయించిందా? పోటీ చేస్తున్న 21 సీట్లలో 15 నుంచి 18 సీట్లలో గెలుస్తుందా?

By :  Admin
Update: 2024-05-02 10:49 GMT

'రాజ్యాధికారం దిశగా మా తొలి ప్రయత్నం మొదలైంది. అందుకే ఈ ఎన్నికలు మా చుట్టూతా తిరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు మావైపే ఎందుకు చూస్తున్నాయంటే ఈ ఎన్నికల్లో మేము కీలకం ..'

'ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా ఎప్పుడో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం చేపట్టాల్సిన వాళ్లు కాపులని.. ఇప్పుడా మాట నిజమవుతోంది. మేము మా సత్తా చూపించాల్సిన తరుణం ఆసన్నమైంది..'
'మమ్మల్ని ఓ మూలకు నెట్టిందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రెడ్ల రాజకీయాలకు మేము బలయ్యాం. మా నాయకుణ్ణి మా వాళ్లతోనే తిట్టించి మా ఓట్లు అవసరం లేదని జగన్ చెప్పకనే చెప్పారు. అందుకే ఈ ఎన్నికలు మాకు కీలకం..'
ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గ ప్రముఖులు చెబుతున్న మాటలివి. శ్రీకాకుళం మొదలు చిత్తూరు వరకు కాపు సామాజికవర్గంలో అంతర్భాగంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ, నాయుడు, తూర్పు కాపు నాయకులు చేస్తున్న వ్యాఖలివి.
మే 13న ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాపులు కీలకం అయ్యారు. రాజకీయమంతా కాపుల చుట్టూ తిరుగుతోంది. దాదాపు 82 నియోజకవర్గాలలో నిర్ణయాత్మక శక్తిగా మారడంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల చూపు కాపులపైన్నే ఉంది. ఎవరెన్ని చెప్పినా ఏపీ రాజకీయమంతా కులాలు, డబ్బూ చుట్టూనే తిరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీకి రెడ్లు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కొమ్ముకాస్తున్నారు. టీడీపీకి కమ్మ, బీసీ వర్గాలలో కొన్ని కులాలు కాపు కాస్తున్నాయి. బీజేపీకి కొన్ని అగ్రవర్ణాలు అండగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ పెట్టుకున్న జనసేన పార్టీకి బలం కాపులేనని చెప్పడంలో ఏమాత్రం అవాస్తవం లేదు. సినీనటునిగా ఎంత పేరుందో అంతకుమించే ఆయన్ను, ఆయన పార్టీని కాపులు ఆదరిస్తున్నారన్నది బహిరంగ సత్యమే. కాపులు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలలోనే 12 సీట్లకు జనసేన పోటీ చేస్తుండడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

2019 ఎన్నికల్లో కాపుల ఓట్లు 3పార్టీలకు చీలిపోయాయి. టీడీపీపై కసిగా ఉన్న కాపులు వైసీపీకి ఓటు వేశారు. చాలా చోట్ల గెలిపించారు. చివరకు కాపు సామాజికవర్గానికే చెందిన పవన్ కల్యాణ్ ను కూడా ఓడించారు. 'పెద్ద పార్టీలు పన్నని కుట్రల్లో తాము బలయ్యాయి. వైసీపీ, టీడీపీ నేతలు మావేళ్లతో మా కళ్లే పొడుచుకునేలా చేశారు. ఐదేళ్ల తర్వాత మాకు మా స్థితి ఏమిటో అర్థమైంది. ఈసారి జనసేనను గెలిపించుకోలేక పోతే మా గతి అథోగతే' అంటున్నారు ప్రముఖ కాపునేత మిరియాల నాగేశ్వరరావు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగా కాపు సామాజికవర్గం ఉంది. దీంతో వాళ్ల ఓట్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాపుల్లో ఐక్యత లేదనే ప్రచారాన్ని వైసీపీ, టీడీపీలే పుట్టించాయని, ఇప్పుడు వాస్తవ స్థితిని కాపులు తెలుసుకున్నారని, అందుకే అందరూ ఏకమవుతున్నారు' అన్నారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన తోట మురళీధరరావు. కాపు సామాజిక వర్గాన్ని చీల్చేందుకు గతంలో టీడీపీ ఎంతగా ప్రయత్నించిందో ఇప్పుడు వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నించింది. అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఉండే అడ్వాన్టేజీని అడ్డంపెట్టుకుని కొందరు పెద్దల్ని తమ వైపు తిప్పుకోవడం చాలా సులువు. వైసీపీ కూడా అదే చేసింది. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లను తమ వైపు తిప్పుకుంది. పవన్ పై అస్త్రాలు ఎక్కుపెట్టేలా చేసింది. అయితే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లపై ఆ ప్రాంత కాపు నాయకులే తిరగబడుతున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న చాలా మంది ఈవేళ ఆయన వైపు లేకపోవడం గమనార్హం.
కాపులు సత్యాన్ని గ్రహించారా
కాపులు స్వతంత్రంగా ఎదగడానికి బదులు ఏ పార్టీకో భుజం కాయడం ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించారు. జనసేనను భుజానికి ఎత్తుకున్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడిదే జనసేనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. కాపులు జనసేనకు మద్దతిచ్చి.. ఎక్కువ సీట్లు గెలిపిస్తే.. తమ సామాజిక వర్గానికి రాజకీయ పలుకుబడి మరింతగా పెరుగుతుందనే ఆలోచనలో కాపులు ఉన్నట్లు తెలుస్తోంది.

కాపుల్లో ఎక్కువమంది జనసేనకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపుల అసంతృప్తి నుంచి బయటపడిన కాపులు ఇప్పుడు పవన్ కల్యాణ్ కి జై కొడుతున్నారు. ప్రస్తుతం పోటీచేస్తున్న 21 స్థానాల్లో కనీసం 15 నుంచి 18 అయినా గెలిచి తీరాలన్న కసితో పని చేస్తున్నారు. ముందు తమ వాళ్లకు నచ్చజెప్పుకోవడంతో పాటు ఇతర వర్గాలకు తమ వాదన చెప్పి నచ్చజెబుతున్నారు. అధికశాతం సీట్లు గెలిస్తే.. పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడంతో పాటు కాపులకు రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందనే ఉద్దేశంతో కాపు సామాజికవర్గ నేతలు చివరి రెండు వారాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 21 సీట్లకే తాను ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో కాపులంతా అర్థంచేసుకోవాలని పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి ఆ సామాజిక వర్గం నేతలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జనసేనకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, సామాజిక మాధ్యమాల్లో పవన్ పై చేసే పోస్టులకు విపరీత స్పందన వస్తోందని జనసేన తరఫున ప్రచారం చేస్తున్న నరసింహారావు యడ్ల చెబుతున్నారు. జనసేన పోటీచేస్తున్న స్థానాలతో పాటు టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు నరసింహారావు. కాపులంతా ఏకతాటిపై నడవడమే 2024 అసెంబ్లీ ఎన్నికల కర్తవ్యంగా చెబుతున్నారు కాపు నేతలు.
Tags:    

Similar News