నిజంగానే చంద్రబాబు 'సాక్షి'పై విచారణ జరిపిస్తారా?
సాక్షి దినపత్రిక కు రు. 400 కోట్లు అందించిన జగన్ ఉదారం...
By : 491
Update: 2024-09-19 03:39 GMT
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుండగా ఆ రెండు పత్రికలు అనే వారు. చంద్రబాబు వచ్చిన తర్వాత కాస్త కుడిఎడంగా అదే డైలాగు. ఆ తర్వాత వైఎస్ జగన్ మళ్లీ ఆ రెండు పత్రికలు, ఆ రెండు ఛానళ్లు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా సాక్షి పత్రికపై ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు ఆ పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరిపిస్తామంటున్నారు.
చంద్రబాబు కథనం ప్రకారం.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు చెందిన రోతపత్రికకు ప్రభుత్వ ధనం దోచిపెట్టారు.వివిధ రూపాల్లో రూ.650 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే. వలంటీర్లు ఆ పత్రికను తెప్పించుకోవడానికి వీలుగా వారికి నెలకు రూ.200 చొప్పున రెండేళ్ల పాటు ప్రభుత్వం అధికారికంగా డబ్బు మంజూరు చేసింది. ఆ మొత్తం రూ.205 కోట్లు. ఇదే పత్రికకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రకటనల కింద రూ.440 కోట్లు చెల్లించారు. మిగిలిన అన్ని పత్రికలకూ కలిపి ఇదే కాలంలో రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చడానికి అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు? ముఖ్యమంత్రి కుటుంబం నిర్వహిస్తున్న పత్రికను మాత్రమే తెప్పించుకోవాలని వలంటీర్లను ఆదేశించి దానికి ప్రభుత్వం తరఫున డబ్బు ఇవ్వడం కచ్చితంగా అధికార దుర్వినియోగమే. మిగిలిన అన్ని పత్రికలకూ కలిపి ఎంత డబ్బు ఇచ్చారో అంతకు మించి సొంత పత్రికకు ఎలా ఇస్తారు? ప్రజలు అధికారం ఇచ్చింది సొంత వ్యాపారాలు బాగు చేసుకోవడానికా? ఇది ఎలా జరిగిందో... అధికార దుర్వినియోగం అవునో కాదో విచారణ జరుపుదాం’ అని సీఎం అన్నారు. దీనిని మిగిలిన మంత్రులంతా సమర్థించారు.
ఎంసీ ఏనాడో చెప్పారు...
"పత్రికా రంగాన్ని ప్రజలకు చేరువగా తీసుకెళ్లడానికి, సామాజిక, ఆర్ధిక మార్పులు తేవడానికి పత్రిక ఒక ఆయుధం. ఆ కృషి చేయడంలో పత్రికారంగ పితామహుడు మానికొండ చలపతిరావు లాంటి వాళ్లు చేసిన కృషి నిష్ర్పయోజనమైంది. ఈ ప్రయోజనాలు నేరవేరి ఉంటే నేషనల్ హెరాల్డ్ లాంటి పత్రికలు ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యాపార ధోరణి ప్రబలి ఉండేది కాదు. ఉన్నతమైన విలువలు పాటించే జర్నలిస్టులందరూ ఎలాంటి వాళ్లు పత్రికలను నిర్వహించాలనుకుంటారో, ఎలాంటి వాళ్ల ప్రమేయం ఈ రంగంలో ఉండకూడదనుకున్నారో సరిగ్గా అలాంటి వాళ్లే ఈ రోజు పత్రికా రంగాన్ని పరిపాలిస్తున్నారు" అని ఎప్పుడో 50 ఏళ్ల కిందటే బ్రిడ్జ్ పత్రిక జర్నలిస్టు రాఘవన్ రాశారు. దానికి ముందే మానికొండ చలపతి రావు ఓ సందర్భంలో "సంపాకుడు ఏమీ చేయలేడు.రాజకీయ యాజమాన్యం మార్వారీ యాజమాన్యం మాదిరే చాలా చెడ్డది అని తెలుసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది" అంటారు. అందువల్ల ఈనాటి పత్రికల గురించి, మీడియా గురించి వాపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది ఎం.శేషగిరిరావు. సాక్షి దినపత్రికకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచిపెట్టిందన్న వార్తపై ఆయన్ను స్పందన అడిగినపుడు ఆయన ఈ మాట అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా చరిత్రను తిరగదోడడం, అవినీతి ఆరోపణలపై విచారణ చేయడం చాలా కాలంగా జరుగుతున్నదే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అందులో వింతేమీ లేదు. ప్రజా జీవితంలో పత్రికా రంగం నిర్వహించాల్సిన పాత్ర గురించి చెప్పిన జవహర్ లాల్ నెహ్రూ పత్రిక నేషనల్ హెరాల్డ్ సైతం ఇప్పుడు తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది.
వార్తా పత్రికను కొని,అమ్మే వ్యాపార వస్తువుగా, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తిగా ప్రెస్ ను ఎప్పుడైతే చూడలేదో అప్పుడే పత్రిక వ్యాపారమయం అయింది. జాతి జీవితాన్ని నిర్మించే సాధనంగా చూడాల్సిన ప్రెస్ ను వ్యాపార వస్తువుగా చూడడం ప్రారంభమైన తర్వాత అయిన వాళ్లకు ఆకుల్లో కానివారికి మూకుళ్లలో అనే నానుడి నిజమైంది.
చంద్రబాబు నాయుడు నిజంగానే విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చి పత్రికల ప్రకటనలకు సంబంధించి ఓ విధివిధానాన్ని రూపొందిస్తే అంత కన్నా మంచి పని ఉండదని అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. అధికారం మారినప్పుడల్లా అదో ఫార్సు కాకూడదు.