ఏపీ సీఎంఓకు పూర్వ వైభవం లభించేనా?

గత ప్రభుత్వ హయాంలో విమర్శలకు నిలయంగా మారిన సీఎంఓ కార్యాలయం.

Update: 2024-06-08 07:43 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంఓ)ఒక గుర్తింపు, గౌరవం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అయితే దీనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఎంతో గౌవరం ఉండేది. రాజకీయాలకు తావు లేకుండా అధికారులు సీఎంఓ నుంచి విధులు నిర్వహించే వారు. పనులు కోసం వచ్చిన వారిని పార్టీలు, ప్రాంతాలు, కులాలు చూడకుండా వాటికి అతీతంగా వారికి సహాయం అందించే వారు. కానీ విభజన అనంతరం పరిస్థితులు తారు మారయ్యాయనే టాక్‌ అధికార వర్గాల్లో ఉంది. విభజన అనంతరం ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తొలి నాళ్లల్లో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే రాను రాను ఆ పరిస్థితులు మారాయి. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎంఓ యాక్టివిటీస్‌ మారుతూ వచ్చాయి. రాజకీయాలకు నిలయంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. తొలుత మంచిగానే మెయింటెయిన్‌ చేస్తూ వచ్చిన చంద్రబాబు.. రాను రాను చేతులెత్తేశారనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. దీంతో అప్పట్లో సీఎంఓ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సతీష్‌చంద్ర ఒక రాజకీయ నాయుడిలా వ్యవహరించారని, చంద్రబాబుకు ఈక్వల్‌గా సమాంతర వ్యవస్థను కూడా నడిపించారనే టాక్‌ అప్పట్లో వచ్చింది.

ఇక 2019 తర్వాత పరిస్థితులు ఇంకా దారుణంగా మారి పోయాయి. అప్పటి వరకు కాస్తో కూస్తో గుర్తింపు, గౌరవం ఉన్న సీఎంఓకు 2019తర్వాత క్రమేణ తగ్గుతూ వచ్చింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంఓ ప్రేయారిటీలు, ప్రాముఖ్యతలు మారి పోయాయి. దీంతో జగన్‌ హయాంలో సీఎంఓ పూర్తి స్థాయిలో గౌరవ మన్ననలు కోల్పోయిందనే టాక్‌ ఉంది. రాజకీయాలకు అడ్డాగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా సీఎంఓ కార్యాలయం ఇన్వాల్వ్‌ కావడం, సీఎం నుంచి సంకేతాలు రాక ముందే స్పందించడం, లేని పోని దానికి అత్యుత్సాహాన్ని చూపిస్తూ, తన అధికార దర్పాన్ని ప్రదర్శించిందనే విమర్శలను మూటగట్టుకుంది. కేవలం పాలనకు సంబంధించిన వ్యవహారాలే కాకుండా రాజకీయ పరమైన వ్యవహారాల్లోను జోక్యం చేసుకుంటూ సీఎంఓ కార్యాలయాన్ని ఒక పార్టీ కార్యాలయంగా కూడా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.
తెలుగుదేశం పార్టీ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎంఓ మరో సారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం అనుసరించిన విధంగానే చంద్రబాబు వ్యవహరిస్తారా లేదా గతంలో మాదిరిగా సీఎంకు ఉన్న గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తారనే అనే విషయాలు అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఇప్పటికే ముద్దాడ రవిచంద్రను నియమించింది. గత టీడీపీ హయాంలో ప్రాముఖ్యత కలిగిన ఆర్థిక శాఖ కార్యదర్శి వంటి పోస్టులు చేపట్టిన రవిచంద్రను జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. కొంత కాలం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నా తర్వాత గుర్తింపు లేని పోస్టుల్లోకి పంపింది. 2023 నుంచి ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయింటింగ్‌లో పెట్టింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ముద్దాడ రవిచంద్రను ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా తీసుకోవడంతో సీఎంఓకు మంచి గుర్తింపు తెస్తారనే అంచనాలు అధికార వర్గాల్లో పెరిగాయి. సీఎంఓలోకి సీనియర్‌ అధికారులైన సాయిప్రసాద్, గిరిజా శంకర్, సిద్దార్థజైన్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల సీఎం అధికారులైన ప్రముఖ ఐఏఎస్‌ ఆఫీసర్లు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్‌ గుప్తా లను బదిలీ చేస్తూ జీఏడీకి రిపోర్టు చేయాలని సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags:    

Similar News