30 లక్షల వాహనాలు తుక్కేనా ?

ట్రాన్స్ డిపార్ట్ మెంటు లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తంమీద 30 లక్షల వాహనాలు 2009కి ముందు తయారైనట్లు సమాచారం.

Update: 2024-09-19 08:30 GMT

తెలంగాణాలో లక్షలాది వాహనాలు తొందరలో తుక్కుకింద మారకతప్పేట్లు లేదు. 2009కి ముందు కొనుగోలుచేసిన వాహనాలన్నింటినీ తుక్కుకింద మార్చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ట్రాన్స్ డిపార్ట్ మెంటు లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తంమీద 30 లక్షల వాహనాలు 2009కి ముందు తయారైనట్లు సమాచారం. ఇవన్నీ కూడా సమైక్య రాష్ట్రంలో ఏపీ రిజిస్ట్రేషన్ కింద నమోదైన వాహనాలే. ఈ 30 లక్షల వాహనాల్లో ప్రభుత్వ వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో కూడా ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వం వాడుతున్న కార్లు, ఆసుపత్రుల్లో వాడుతున్న అంబులెన్సులు ఎక్కువగా ఉన్నాయి. 15 ఏళ్ళు దాటిన వాహనాలను తుక్కుకింద మార్చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చాలాకాలంగా చెబుతునే ఉన్నాయి. అయితే ఆ నిబంధనను ఎప్పటినుండి అమల్లోకి తేవాలన్న విషయమై కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు.

పాతబడిన వాహనాల సంఖ్య పెరిగిపోతుండటం, వీటివల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని వాతావరణ నిపుణులు మొత్తుకుంటున్నారు. ఇదే విషయమై కోర్టులో కేసులు దాఖలుచేస్తే సుప్రింకోర్టు కూడా పాత వాహనాలను తుక్కుకింద మార్చేయాలని చాలాకాలం క్రితమే చెప్పింది. అయినా ప్రభుత్వం మాత్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకురాలేదు. ఢిల్లీలో అయినట్లే దేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. దాంతో ప్రభుత్వం మేలుకున్నది. అందుకనే 15 ఏళ్ళు పూర్తయిన వాహనాలను తుక్కుకింద మార్చేయాలన్న నిబంధనను తొందరలోనే అమల్లోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యింది. 2025, జనవరి 1వ తేదీనుండి తుక్కు నిబంధనను కచ్చితంగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం అన్నీ రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.

వాహనాలు కొని 15 ఏళ్ళు పూర్తయినా అంతకన్నా ఎక్కువ కాలం అయిన వాహనాలను యజమానులు తమంతట తాముగానే రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటి(ఆర్టీఏ)కి అప్పగించాలి. దీనివల్ల ఏమవుతుందంటే స్క్రాప్ లెక్కేసిన వాహనాల ఛాసిస్ ఆధారంగా వాహనానికి కొంతమొత్తాన్ని(ఖరీదు) నిర్ణయిస్తారు. వాహనం ఏ కంపెనీకి సంబంధించినది అయితే ఆ కంపెనీ వాహన యజమానికి నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. వాహనాన్ని స్ర్కాప్ కింద మార్చేసినట్లు ఆర్టీఏ అధికారులు వాహన యజమానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మళ్ళీ యజమాని కొత్త వాహనాన్ని కొనేటపుడు స్క్రాప్ సర్టిఫికేట్ చూపిస్తే వాహనం ధర ఇన్వాయిస్ లో నుండి కంపెనీ 10-15 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ఇదంతా ఎప్పుడంటే వాహన యజమాని తనంతట తానుగా తన వాహనాన్ని స్క్రాప్ కు మార్చేందుకు ఆర్టీఏకి వాహనాన్ని అప్పగిస్తే మాత్రమే. అలా అప్పగించకపోతే పై రెండు సదుపాయాలు కోల్పోవటంతో పాటు రోడ్డుపైన అధికారులు పట్టుకుంటే భారీ జరిమానా చెల్లించాల్సుంటుంది.

అందుబాటులోని సమాచారం ప్రకారం 15 ఏళ్ళు పైబడిన 30 లక్షల వాహనాల్లో 20 లక్షలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. వీటిల్లో కూడా మోటారుసైకిళ్ళు 17 లక్షలు, కార్లు 3.5 లక్షలు, గూడ్స్ క్యారియర్లు లక్ష, ఆటో రిక్షాలు 20 వేలున్నట్లు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో సుమారు 10 వేల వాహనాలు, 2 వేల అంబులెన్సులున్నాయి. అలాగే ఆర్టీసీలో కూడా కాలంచెల్లిన బస్సులు, కార్లు సుమారు 3వేల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్ళు దాటిన వాహనాలను తుక్కుగా మార్చే బాధ్యతలను తీసుకునేందుకు టాటా, మహీంద్రా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రవాణాశాఖకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి తుక్కుగా మార్చే ప్రక్రియకు ఆసక్తి ఉన్న కంపెనీలు లైసెన్సులు తీసుకోవాల్సుంటుంది.

నష్టాలు ఏమిటి ?

కాలంచెల్లిన వాహనాలకు నిర్వహణ భారం పెరిగిపోతుంది. అలాగే వాహనాల స్పేర్ పార్టులు దొరకటం కూడా కష్టమే. వీటివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాలంచెల్లిన వాహనాలను వాడటం వల్ల ఇంధనం విపరీతంగా ఖర్చయిపోతుంది. భారీ వాహనాలకు ఎక్కువగా డీజల్ వాడుతారు. కాలంచెల్లిన వాహనాల వల్ల విపరీతమైన పొగ వస్తుంది. దీనివల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమస్యలన్నింటినీ ఆలోచించిన తర్వాతే 2025, జనవరి 1వ తేదీ నుండి స్క్రాప్ నిబంధనను కచ్చితంగా అమల్లోకి తేవాలని కేంద్రప్రభుత్వం డిసైడ్ అయి రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది.

Tags:    

Similar News