అప్పన్న గోశాల నెయ్యి అమ్మేది రూ.1600.. కొనేది మాత్రం రూ.385కే..

నెయ్యి తక్కువ ధరకు సరఫరా చేసినా నాణ్యమైనదేనా? టెండరుదారుడికి భక్తి భావమా? దేవుడిని మోసం చేయడమేనా? భక్తుల్లో రేకెత్తుతున్న అనుమానాలు

By :  Admin
Update: 2024-09-24 12:32 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

తిరుమల శ్రీవేంకటేశ్వరుని పవిత్ర లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి వాడుతున్నారంటూ రేకెత్తిన అలజడి నేపథ్యంలో ప్రజలు, భక్తుల్లో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కిలో నెయ్యి వద్ద సగానికి సగం ధరలో వ్యత్యాసం ఉండడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఒక్క తిరుమల దేవస్థానంలోనే కాదు.. రాష్ట్రంలో ప్రఖ్యాత దేవాలయాలతో పాటు అనేక దేవస్థానాల్లో ఆవు నెయ్యి వాడకం తప్పనిసరి. ప్రధానంగా ఆలయాల్లోని అయ్యవార్లు, అమ్మవార్ల దీపారాధనలు, నివేదనలు, యజ్ఞ, యాగాదులతో పాటు లడ్డూలు, మరికొన్ని రకాల ప్రసాదాల తయారీలోనూ ఆవు నెయ్యినే వినియోగించడం రివాజు. అందుకోసం శుద్దమైన ఆవు నెయ్యి సరఫరాదార్ల కోసం టెండర్లు పిలుస్తుంటారు. అందరికంటే తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేసే వారికి టెండరు ఖరారు చేస్తారు. ఆపై ఆ టెండరుదారు సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యతను పరీక్షించడానికి లేబరేటరీలకు పంపుతారు.

అటు నుంచి నాణ్యత బాగుందని వచ్చే నివేదిక ఆధారంగా నెయ్యిని వినియోగిస్తున్నామని ఆయా దేవస్థానాల అధికారులు చెబుతుంటారు. సంబంధిత లేబరేటరీ ఇచ్చే క్వాలిటీ సర్టిఫికెట్ను ఆలయ అధికారులు భద్రపరచుకుంటారు. ఎన్నో దశాబ్దాల తరబడి ఆలయాల్లో జరుగుతున్నది ఇదే. మరి ఇప్పుడు తిరుమల వ్యవహారంతో ఆలయాలకు సరఫరా చేస్తున్న ఆవు నెయ్యి నాణ్యత, కల్తీపై సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు పుంఖాను పుంఖాలుగా అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. బయట మార్కెట్లో విక్రయించే నెయ్యి ధరకు, ఆలయాలకు సరఫరా చేసే నెయ్యికి స్వల్ప వ్యత్యాసం ఉంటే ఫరవాలేదు. కానీ ఆ రెండింటి మధ్య సగానికి సగం తేడా ఉండడమే అందరిలోనూ ఆశ్చర్యంతో పాటు అనుమానాలకు తావిస్తున్నాయి.

 

ప్రముఖ దేవస్థానాల్లో ఇలా..

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలు, వాటి ధరలను పరిశీలిస్తే.. తిరుమల తిరుపతి దేవస్థానానికి తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ కిలో ఆవు నెయ్యి రూ.320కే సరఫరా చేస్తోంది. అలాగే సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు డెయిరీ కిలో నెయ్యి రూ.385కే సరఫరా చేస్తోంది. అదే డెయిరీ అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయానికి కిలో రూ.538కి అందజేస్తోంది. ఒకే సంస్థ రెండు ఆలయాలకు సరఫరా చేసే ధరలో కిలోకు రూ.153 వ్యత్యాసం ఉండడం ఆశ్చర్యం గొలుపుతోంది. ద్వారకా తిరుమల ఆలయానికి వైష్ణవి డెయిరీ కిలో ఆవు నెయ్యి రూ.532కి, తిరుమలకు చెందిన సుమతి ట్రేడర్స్ కాణిపాకం దేవస్థానానికి రూ.555, శ్రీకాళహస్తి దేవాలయానికి రూ.573కి పంపిణీ చేస్తోంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి విజయ డెయిరీ నుంచి కిలో రూ.585 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా చూసుకుంటే రాష్ట్రంలోని ఇతర దేవాలయాలన్నిటికంటే టీటీడీకి అత్యంత తక్కువ ధర (కిలో రూ.320)కు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థ ఏఆర్ డెయిరీయే.

అంత నష్టాన్ని భరిస్తారా?

సాధారణంగా బహిరంగ మార్కెట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో రూ. వెయ్యికి పైగా, సాధారణ ఆవు నెయ్యి రూ.700 వరకు ఉంది. అలాంటిది దేవాలయాలకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా చేయడానికే టెండరుదారు అంగీకరించి ముందుకొస్తాడు. కానీ మార్కెట్ ధరకు, టెండరు దక్కించుకున్న ధరకు సగానికి సగం వ్యత్యాసం కనిపిస్తోంది. ఉదాహరణకు టీటీడీకి ఏఆర్ డెయిరీ నెయ్యి కిలో రూ.320, సింహాచలం దేవస్థానానికి రైతు డెయిరీ రూ.385కు సరఫరా చేస్తున్నాయి. అంటే మార్కెట్ ధర కనీసం రూ.700 చూసినా కిలోపై రూ.315-380 వరకు నష్టపోవలసి వస్తోంది. టీటీడీ రోజుకు 12 వేల కిలోల ఆవు నెయ్యి వినియోగిస్తున్నట్టు అంచనా. ఈ లెక్కన రోజుకు ఆ సంస్థ రూ.45 లక్షలు నష్టపోతోందన్న మాట. నెలకు రూ.13.6 కోట్లు, సంవత్సరానికి రూ.164 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తుందన్న మాట! సింహాచలం దేవస్థానంలో రోజుకు 250 కిలోల నెయ్యి అవసరం అవుతోంది. ఇక్కడ నెయ్యి సరఫరా చేసే రైతు డెయిరీ రోజుకు రూ. 78 వేలు, నెలకు రూ.23 లక్షలు, ఏడాదికి రూ.2,80 కోట్ల వరకు నష్టపోవలసి వస్తుంది. నెయ్యి సరఫరా టెండరు దక్కించుకున్న ఈ సంస్థలు రూ.కోట్లలో నష్టాలను భరించే పరిస్థితి ఉంటుందా? టెండరుదారులు భక్తి భావంతోనే ఇంత భారీ నష్టాలకు సిద్ధమవుతారా? అన్నదే ఇప్పుడు అందరిలోనూ రేకెత్తిస్తున్న ప్రశ్న!

 

అమ్మకం రూ.1600.. కొనుగోలు రూ.385..

సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గోశాల నడుస్తోంది. అక్కడ 250కి పైగా గోవులున్నాయి. వాటి నుంచి పాలను సేకరించి నెయ్యి తీసి కిలో రూ.1600కు విక్రయించేవారు. ఇక్కడ స్వామి నివేదన, లడ్డూల తయారీ కోసం కిలో రూ.385ల నెయ్యిని టెండరుదారు నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే ఈ దేవస్థానం విక్రయించే ధరకంటే నాలుగు రెట్ల తక్కువకు లభ్యమయ్యే నెయ్యిలో నాణ్యత ఉంటుందా? అంటే ఎవరి వద్ద సమాధానం లేదు. ఎందుకంటే.. టెండరు ప్రక్రియ అంతా దేవాదాయశాఖ నేతృత్వంలో జరుగుతూ వస్తున్నందున ఎవరూ దాని జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలోని మరే దేవాలయంలోనూ లేదు.

ముమ్మాటికీ కల్తీ నెయ్యే..

మార్కెట్ ధరకంటే సగం, అంతకంటే తక్కువ ధరకే టెండరుదార్లు సరఫరా చేస్తున్న ఆవు నెయ్యి ముమ్మాటికీ నకిలీదేనని పండితులు అభిప్రాయపడుతున్నారు. లేబరేటరీల నుంచి వచ్చే నాణ్యత రిపోర్టులపై కూడా నమ్మకం కుదరడం లేదని చెబుతున్నారు. 'దేవాలయాల్లో స్వచ్ఛమైన దేశవాళీ ఆవుల నెయ్యిని మాత్రమే వాడాలి. వాటి నెయ్యి ఖరీదు కిలో రూ.2 వేల పైమాటే. కానీ ఇప్పుడు కిలో రూ.320కి, 385కి ఇస్తున్నారంటే అది కల్తీ కాక మరేమిటి? ఇలాంటి కల్తీ నెయ్యితో దేవుళ్లకు నివేదనలు, దీపారాధనలు చేయడం, లడ్డూల్లో వాడడం దుర్మార్గం. పాపం. దేవస్థానాల్లో విరివిగా దేశీయ గోవులను పెంచి వాటి నెయ్యినే వాడడం శ్రేష్టం. లేదంటూ దేవస్థానాలకు వచ్చే ఆదాయంతో స్వచ్ఛమైన నెయ్యిని కొనుగోలు చేయాలి' అని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ టోలీ సురక్ష ప్రముఖ్ పూడిపెద్ది శర్మ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. 'మార్కెట్లోకంటే సగానికి పైగా తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తున్నారంటే అది కచ్చితంగా కల్తీదే. దేవుళ్లను, భక్తులను మోసం చేయడమే. మేం యాగాలు, యజ్ఞాలు చేసే సమయంలో కిలో ఆవు నెయ్యి రూ.1500కి పైగా కొంటున్నాం. అలాంటిది రూ.400 లోపు ధరకే ఇస్తున్నారంటే అది నాణ్యమైనది ఎలా అవుతుంది? నాణ్యతపై ల్యాబ్లు ఇచ్చే రిపోర్టులను కూడా శంకించాల్సి వస్తుంది' అని శ్రీపాద ప్రణవరామ్ అనే విద్యాధికుడు స్పష్టం చేశారు.

Tags:    

Similar News