ఏపీ మంత్రివర్గంలో కొత్తవారికే ఎందుకు అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తవారికే మంత్రులుగా అవకాశం కల్పించింది. సీనియర్లను పెద్దగా పట్టించుకోలేదు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-06-13 11:50 GMT
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2024 ఎన్నికల తరువాత ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఎక్కువ మంది కొత్తగా ఎన్నికైన, ఇప్పటి వరకు మంత్రులుగా చేయని వారికి ఎక్కువ అవకాశం కల్పించారు. ఈ మంత్రివర్గం ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సామాజికంగా అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించినప్పటికీ రాజకీయంగా ధీటుగా ఎదుర్కొనే వారికి ప్రత్యేకించి మంత్రివర్గంలో అవకాశం కల్పించారనే చర్చ సాగుతోంది. ప్రతిపక్షమే లేనందున వైఎస్సార్‌సీపీ నుంచి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అసెంబ్లీలో వారి గురించి ఆలోచించే కంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచిదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
చెప్పినట్లు పనిచేస్తారనే..
యువకులు, కొత్తవారు కావడం వల్ల మంత్రివర్గంలో చెప్పినట్లు పనిచేసేందుకు అవకాశం ఉంటుందని భావించిన చంద్రబాబు ఎక్కువ మంది కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు సమాచారం. పైగా వీరంతా పార్టీ కోసం ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నవారే కావడం విశేషం. యనమల రామకృష్ణుడు వంటి వ్యక్తి మంత్రివర్గంలో లేకపోవడం ఇదే మొదటిసారి.
టీడీపీలో మంత్రులనగానే సీనియర్లే గుర్తుకొస్తారు..
మంత్రివర్గం అంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చంద్రబాబు ఏర్పాటు చేశారు. సీనియర్లకు ఎందుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించలేకపోయారనే విషయమై ఎటువంటి ప్రస్తావన రాలేదు.
సామాజిక వర్గాల సమతూకం
ప్రస్తుత మంత్రివర్గంలో అన్ని సామాజికవర్గాల వారికి అవకాశం కల్పించారు. క్యాబినెట్‌లో 24 మందిలోనూ తొలిసారి మంత్రులైన వారు 17 మంది ఉండటం విశేషం. మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు 10 మంది ఉన్నారు. ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశమిచ్చారు. వైశ్యుల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లకు చోటు కల్పించారు. ముగ్గురు మహిళలకు అవకాశమివ్వడంతో పాటు, వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేశారు.
జనసేనకూ సముచిత స్థానం..
జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌ను, బిజెపి నుంచి సత్యకుమార్‌ను క్యాబినెట్‌లో చేర్చుకోవడంతో పాటు, తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్న 20 మందిలోనూ ఎక్కువ మంది కొత్తవారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్కరికైనా మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని బావించిన వారి ఆశలు నిరాశలయ్యాయి.
విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్‌కు అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీలో మహిళా విభాగం నాయకురాలుగా ఉన్న వంగలపూడి అనితకు అవకాశం వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నుంచి దుర్గేష్‌కు, తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మల రామానాయుడికి అవకాశం వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామిలు మొదటిసారి మంత్రివర్గంలో అవకాశం దక్కించుకున్నారు. గత ఐదేళ్లలో పార్టీ విప్‌గా శాసనసభలో స్వామి మెరుగైన పనితీరు కనబరిచారని, వరుసగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచినందున మంత్రిగా అవకాశమిచ్చినట్లు సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సవితకు అవకాశమిచ్చారు. చిత్తూరు నుంచి మంత్రిగా రాంప్రసాద్‌రెడ్డికి అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లాలో బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్‌లకు పార్టీ అవకాశమిచ్చింది.
సత్యకుమార్‌కు అవకాశం
తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన సత్యకుమార్‌ను అనూహ్యంగా మంత్రి పదవి వరించింది. సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయవచ్చని మొదట భావించారు. కానీ పార్టీ ఆయనను అసెంబ్లీ బరిలోకి దించింది. రాయలసీమకు చెందిన సత్యకుమార్ ధర్మవరం నుంచి గెలుపొందారు. బిజెపి తరపున శాసనసభకు ఎన్నికైన 8 మందిలో మంత్రి పదవికి మొదట కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ జాతీయ నాయకత్వం సత్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. ముఖ్యంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సుదీర్ఘకాలం పాటు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సమయంలో పార్టీ అగ్రనేతలతో ఏర్పడ్డ పరిచయాలు సత్యకుమార్ స్థాయిని పెంచాయి. ప్రస్తుతం భాజపా జాతీయ కార్యదర్శిగా, అండమాన్, నికోబార్ ద్వీపాల ఇంఛార్జిగా, ఉత్తరప్రదేశ్ సహ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు.