కోనసీమ కొబ్బరికి ‘తెలంగాణ దిష్టి’ ఏంది పవన్‌..ఉండవల్లి ఫైర్

1964లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హిందుత్వం మతం కాదు, సనాతన ధర్మం మాత్రమే అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

Update: 2025-12-06 12:49 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి చెట్ల నష్టానికి “తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది” అని చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వ్యవహారశైలి సరికాదని  మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రేపు ఏపీ ముఖ్యమంత్రి అవుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాంటి వ్యక్తి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని ఉండవల్లి అన్నారు. తెలుగు ప్రజల మధ్య గొడవలు పెట్టే విధంగా పవన్ కల్యాణ్ మాటలు ఉన్నాయని అన్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబుపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తెచ్చే చంద్రబాబు.. తన సొంత హెరిటేజ్ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్‌ను హైదరాబాద్ నుంచి ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదు అని ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోదీ – చంద్రబాబు స్నేహం కేవలం రాజకీయమేనని, వారి మనస్సులు ఎప్పుడూ కలవవని విమర్శించారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా హెచ్చరిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మాట్లాడిన ఉండవల్లి.. ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఇచ్చి ప్రజలు మౌనంగా ఉంటే దేశ పతనం మొదలవుతుందని అంబేడ్కర్ హెచ్చరించారు అని గుర్తుచేశారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని విమర్శించారు.

హిందుత్వం – ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉండవల్లి విమర్శలు గుప్పించారు. పాంచజన్యం పుస్తకం చదివాకే నేను ఆర్‌ఎస్‌ఎస్ నుంచి బయటకు వచ్చాను. 1964లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హిందుత్వం మతం కాదు, సనాతన ధర్మం మాత్రమే. బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం హిందూ మతాన్ని వాడుకుంటున్నారు. నార్త్ ఇండియా తరహాలో ఏపీలో బీజేపీ ఎప్పుడూ బలపడదు అని ఉండివల్లి తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. పాక్ టెర్రరిస్టులపై కఠిన వైఖరితో వ్యవహరించాలన్నారు. భారత్‌లో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకునే పాకిస్థాన్ టెర్రరిస్టులను కాల్చి పడేయాలి అని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పటికే తెలంగాణలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించగా.. ఉండవల్లి స్పందనతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News