వాళ్లను జగన్‌ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు

శుక్రవారం సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటన చేశారు.;

Update: 2025-08-01 14:47 GMT

నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నోరు పారేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగితే అతనిని మందలించాల్సింది పోయి నల్లపరెడ్డిని ప్రోత్సహిస్తున్నాడని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళలను, వారి వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న వారిని జగన్‌ ఎంకరేజ్‌ చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటన చేపట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు గూడెంచెరువులో నిర్వహించిన ప్రజావేదిక మీద ఆయన మాట్లాడుతూ పార్టీలో ఎవరైనా తప్పులు చేస్తే వాటిని తక్షణమే ఖండించాలి.. తప్పులు చేసిన వారిని మందలించాలి.. కానీ జగన్‌ మాత్రం అలాంటి వారిని ఇంకా రెచ్చగొడుతున్నాడని ధ్వజమెత్తారు.

పార్టీ నాయకులను, శ్రేణులను క్రమశిక్షణలో పెట్టాల్సిన నాయకుడే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వారిని మహిళలపై ఇంకా విరుచుకుని పడాలనే ధోరణితో రెచ్చగొడుతున్నారని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మర్డర్‌ గురించి ప్రస్తావించారు. వివేకానందరెడ్డి హత్య జరిగితే తమపై విషయం చిమ్మారని, మాటలు మారుస్తూ, తనపై లేని పోని అబాండాలు వేశారని వైసీపీ పార్టీ నాయకుల మీద, వైఎస్‌ జగన్‌ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్లు పర్యవేక్షణ ఉంటోందని, వైసీపీ నాయకులు కానీ, వైఎస్‌ జగన్‌ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలను మభ్యపెట్టాలని చూసినా, మోసం చేయాలని చూసినా, ప్రజలకు అసౌకర్యాలు కలిగించినా ఊరుకునేది లేదని, కఠిన తప్పవని హెచ్చరించారు. ఏ మాత్రం తోకలు జాడిస్తే కట్‌ చేస్తానని చంద్రబాబు వైసీపీ శ్రేణులను, జగన్‌ను హెచ్చరించారు.
కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులను త్వరలోనే మొదలు పెడుతామని సీఎం చంద్రబాబు అన్నారు. 2028 డిసెంబరు నాటికి కడప స్టీల్‌ ప్లాంట్‌ తొలి దశ పనులను పూర్తి చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ. 6వేలు, ఏపీ కూటమి ప్రభుత్వం రూ. 14వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు కలిపి మొత్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ. 20వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాకు గ్రాండ్‌ క్యానియన్‌లా కడపకు గండికోట ఉందని, దీనిని రానున్న రోజుల్లో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు రూ. 85 కోట్లతో ఈ పనులు మొదలు పెడుతామన్నారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లు తాము గెలిచామని, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలవాలని, అలా పది సీట్లలో టీడీపీ నాయకులను గెలిపించేందుకు కడప జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Tags:    

Similar News