వరద నీటిలో అమరావతి ఎందుకు మునుగుతుందంటే...

అమరావతి ప్రాంతం కృష్ణా నదికి 17 మీటర్ల తగ్గులో ఉంది. వరద నీటిని కృష్ణాలో కలిపేందుకు తయారు చేసి బ్లూ ప్రింట్ ను అమలు చేయడంలో సీఆర్డీఏ విఫలమైంది.;

Update: 2025-08-16 13:14 GMT
వరద నీట మునిగిన అమరావతి ప్రాంతం

రాజధాని నిర్మాణం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతంలోని కొండవీటి వాగు, పాలవాగు పెద్ద విలన్లుగా నిలిచాయి. ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నా నిజం.

వరదలొస్తే ఇలాగే మునగాల్సిందేనా? దీనికి శాశ్వత పరిష్కారం లేదా? ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచించడం లేదా? ఆలోచించినా నిధుల సమస్య ఉందా? అసలు ఈ విషయంలో సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు అనేది పెద్ద చర్చగా మారింది. మునిగినా... తేలినా... ఇక్కడే రాజధాని నిర్మాణం జరగాల్సిందేననే పట్టుదలతో సీఎం ఉన్నారు. ఆయన మౌనం కూడా అదే జరుగుతుందనే సమాధానాన్ని స్పష్టం చేస్తోంది.

అమరావతి ప్రాంతం కృష్ణా నదికి 17 మీటర్ల దిగువన ఉంది. వరద నీటిని కృష్ణాలో కలిపేందుకు తయారు చేసిన బ్లూ ప్రింట్ ను అమలు చేయడంలో సీఆర్డీఏ విఫలమైంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం ఇటీవల వరదకు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ముంపునకు గురైంది. ఈ సమస్య గతంలో నిర్వహించిన అనేక సర్వేలలోనూ స్పష్టంగా వెల్లడైంది. అయినప్పటికీ ప్రభుత్వం, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) తగిన చర్యలు తీసుకోలేదు. ఈ సమస్యకు ప్రధాన కారణాలు అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళికారహిత నిర్మాణాలు, వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు సృష్టించడం వంటివి ఉన్నాయి. ప్రణాళికారహిత నిర్మాణాలు పెద్ద అవరోధంగా నిలిచాయి.


సీఆర్డీఏ అధికారులు వరద నీటిని బయటకు పంపేందుకు సరైన కాలువల నిర్మాణం చేపట్టలేదు. బ్లూ ప్లాన్‌లో భాగంగా నీరుకొండ రిజర్వాయర్ నుంచి కృష్టాయపాలెం రిజర్వాయర్ వరకు కాలువ తవ్వాలని నిర్ణయించినప్పటికీ, దీనిని సమర్థవంతంగా అమలు చేయలేదు. జాతీయ రహదారి కింద తూములు వేయాల్సిన చోట కాకుండా, వేరే ప్రాంతాల్లో వేయడం వల్ల నీటి ప్రవాహం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.

హైకోర్టు, విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వద్ద నుంచి నీరు సరిగా ముందుకు సాగటం లేదు. వరద నీటి ప్రవాహానికి అడ్డంకులుగా అక్కడక్కడ కట్టలు ఉన్నాయి. వీటిని సీఆర్డీఏ తొలగించాల్సి ఉంది. రోడ్ల నిర్మాణం సందర్భంగా మట్టిని తవ్వి అక్కడక్కడ కుప్పలుగా పోశారు. ఇవి అడ్డంకులుగా మారటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

వాగుల సహజ నీటి ప్రవాహానికి ఆటంకం

అమరావతి ప్రాంతంలో కొండవీటివాగు, కొట్టేళ్ల వాగు, పాలవాగు, ఎర్రవాగు, సారవాగులు పొంగినప్పుడు నీటి ప్రవాహాలు సహజంగా కృష్ణానదిలోకి చేరాలి. కానీ ప్రస్తుతం రోడ్ల నిర్మాణాలు, కొన్ని మట్టి దిబ్బల వల్ల ఈ ప్రవాహాలు కొండవీటి వాగుకు చేరటం లేదు. కారణంగా అన్ని ప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయింది. సారవాగు వద్ద స్లూయిస్‌ల నుంచి వరద నీరు లోపలకు చొచ్చుకొని వచ్చి పొలాలు ముంపునకు గురయ్యాయి.

సీఆర్డీఏ నిర్లక్ష్యం

గతంలో రైతులు వ్యవసాయ పొలాల కోసం సమర్థవంతంగా కాలువలు నిర్మించారు. అయితే రాజధాని ప్రకటన తర్వాత ఈ రూపురేఖలు దెబ్బతిన్నాయి. కాలువలు పూడిపోయాయి. ప్రపంచ బ్యాంకు సూచించిన వరద నివారణ చర్యలను కూడా సీఆర్డీఏ పట్టించుకోలేదు. రూ.15 వేల కోట్ల ఒప్పందంలో ఈ చర్యలను ప్రాధాన్యంగా చేపట్టాలని స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ అమలు జరగలేదు.

సీఆర్డీఏ తీరుపై విమర్శలు

సీఆర్డీఏ అధికారులు వరద నివారణకు సంబంధించిన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. వారి తీరులోని కొన్ని ముఖ్యమైన లోపాలు ఇలా ఉన్నాయి.

వరద నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడంపై దృష్టి పెట్టకుండా, కేవలం నిర్మాణ పనులపైనే శ్రద్ధ చూపారు. రైతులు సూచించిన నీటి ప్రవాహ మార్గాలను పరిగణనలోకి తీసుకోలేదు. కాంట్రాక్టర్లు కేవలం ఆదేశాలను అనుసరించి పనులు చేశారు. సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయలేదు. జాతీయ రహదారి వద్ద తూములు, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ సమీపంలో చేపట్టాల్సిన కాలువల నిర్మాణాలు చేపట్టక పోవడం సమస్యను మరింత తీవ్రతరం చేశాయి.

అడ్డంకుల తొలగింపు

జాతీయ రహదారి కింద కొండవీటివాగు నీటి ప్రవాహానికి అనుగుణంగా తూములు ఏర్పాటు చేయాలి. బ్లూ ప్లాన్‌లో భాగంగా కొండవీటివాగు నీటిని నేరుగా కృష్టాయపాలెం లిఫ్ట్ వద్దకు చేరేలా కాలువలు తవ్వాలి. కృష్టాయపాలెం నుంచి పెనుమాక, ఉండవల్లి వరకు గుర్రపు డెక్కను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలి.


కొండ‌వీటి వాగు నీరు వేగంగా వెళ్లాలి: ఏడీసీ చైర్ పర్సన్
కొండ‌వీటి వాగులో పై ఎత్తు నుంచి వ‌స్తున్న నీటిని కృష్ణాన‌దిలోకి వేగంగా పంపిచే ప‌నులను ముమ్మ‌రం చేయాలని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌ (ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్  డి ల‌క్ష్మీపార్థ‌సార‌థి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ -10, ఈ -14 రోడ్ల మ‌ధ్య ఉన్న‌ 5 క‌ల్వ‌ర్టులను తెరిచి నీటిని దిగువ‌కు పంపిస్తున్న ప‌నుల‌ను ఆమె శ‌నివారం ప‌రిశీలించారు. కుర‌గ‌ల్లు వ‌ద్ద ఎన్‌-౬ (ప‌శ్చిమ బైపాస్‌) వ‌ద్ద ఉన్న 3 స్పాన్ల‌లో ఉన్న మ‌ట్టి, దాని బ్రిడ్జి కింద ఉన్న అడ్డుక‌ట్ట‌ల‌ను వెంట‌నే తొల‌గిచేందుకు ఎక్స‌వేట‌ర్ల‌ను ఎక్కువ సంఖ్య‌లో ఏర్పాటు చేయాల‌ని నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ అధికారుల‌ను ఆదేశించారు. కొండ‌వీటి వాగులో నీటిని కృష్ణాన‌దిలోకి పంపించే ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా జ‌రిపేందుకు అధికారులు యుద్ధ‌ ప్రాతిప‌దిక‌న చర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైన మేర‌కు యంత్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఏడీసీ ఇంజినీరింగ్ అధికారుకు ఖ‌చ్చిత‌మైన ఆదేశాలు జారీచేశారు.
ఈనెల 16న జరిగిన ప‌ర్య‌ట‌న‌లో ఏడీసీ చీఫ్ ఇంజినీర్లు ఆర్‌ గోపాల‌కృష్ణారెడ్డి, సీహెచ్ ధ‌నుంజ‌య‌, ఎస్ఈ న‌ర‌సింహ‌మూర్తి, ఈఈలు కె బ‌స‌వేశ్వ‌ర‌రావు, వైకుంఠ‌రావులు ఉన్నారు.

పరిష్కార మార్గాలు

కొండవీటివాగు, కొట్టేళ్ల వాగులను అమరావతి వైపు రాకుండా మోతడక, యండ్రాయి, వైకుంఠపురం వైపు కృష్ణానదిలోకి మళ్లించే ప్రణాళిక అమలు చేయాలి. రోడ్ల వద్ద నీటి ప్రవాహానికి అడ్డంకులుగా ఉన్న ఫైల్ క్యాపులు, కట్టలను తొలగించాలి.

ప్రభుత్వ జోక్యం

ముఖ్యమంత్రి నేతృత్వంలో శాశ్వత పరిష్కార చర్యల కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించి, వెంటనే అమలు చేయాలి.

ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు వరద నివారణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వరద నీరు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చేటప్పుడు దానిని ఆపడం సాధ్యం కాదు. రిజర్వాయర్లు నిండిపోతే అదనపు నీరు పొంగడం తప్పదు. కొండవీటివాగు ముంపు సమయంలో కృష్ణానదిలో కూడా వరదలు రావడం వల్ల, నీటిని బయటకు పంపడం కష్టతరం అవుతుంది.

రైతుల సూచనలు

గతంలో రైతులు సమర్థవంతంగా కాలువలు నిర్మించి, నీటి ప్రవాహాన్ని నియంత్రించారు. వారి స్థానిక జ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సీఆర్డీఏ మరింత సమర్థవంతమైన పరిష్కారాలను రూపొందించవచ్చు. రైతులు సూచించిన నీటి మళ్లింపు మార్గాలను అమలు చేయడం ద్వారా ముంపు సమస్యను పూర్తి స్థాయిలో తగ్గించే అవకాశం ఉంది.

అమరావతి ముంపు సమస్యకు పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక, సీఆర్డీఏ సమర్థవంతమైన అమలు, ప్రభుత్వ జోక్యం అవసరం. బ్లూ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయడం, అడ్డంకులను తొలగించడం, సహజ నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు. ప్రపంచ బ్యాంకు సూచనలను పాటించడం, రైతుల స్థానిక జ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అమరావతిని ముంపు నుంచి కాపాడేందుకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది.

బ్లూ ప్లాన్ (Amaravati Blue Plan) ఏమి చెబుతోంది...

ఈ ప్లాన్ ప్రధాన లక్ష్యం అమరావతి ప్రాంతంలో వరద నీటిని సమర్థవంతంగా నిర్వహించడం. నగర నిర్మాణాలకు హాని జరగకుండా చేయడం. సహజ నీటి ప్రవాహాలను పునరుద్ధరించడం. అయితే ఈ ప్లాన్ అమలులో సీఆర్డీఏ నిర్లక్ష్యం, ప్రణాళికారహిత విధానం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

బ్లూ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి, సీఆర్డీఏ అధికారులు రైతుల స్థానిక జ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ బ్యాంకు సూచనలను ఖచ్చితంగా పాటించాలి. వరద నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ చర్యల ద్వారా అమరావతిని ముంపు నుంచి రక్షించడం సాధ్యమవుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

నదికి పల్లంలో నిర్మాణాలు సరైంది కాదు: మల్లెల

నది ఎత్తులో ఉంది. దానిని ఆనుకుని గుంటూరు వైపున అమరావతి నగరం నిర్మాణం జరుగుతోంది. నది నుంచి వరద నీరు ప్రస్తుత అమరావతి ప్రాంతానికి రాకుండా గతంలోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి తాళ్లాయపాలెం వరకు కరకట్ట నిర్మించినట్లు ప్రముఖ న్యాయవాది మల్లెల శేషగిరిరావు తెలిపారు. నదికి కింది భాగంలో నిర్మాణాలు సరైంది కాదని పలు సర్వేలు చెప్పినా సీఆర్డీఏ అధికారుల చెవికి ఎక్కలేదన్నారు. ప్రభుత్వం చేపట్టే చెరువుల నిర్మాణాలైనా ముందుగా జరగాలనే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. వాగుల నుంచి వచ్చే వరదనీరు నగరం పైకి రాకుండా ఎంత కాలం ఎత్తిపోస్తారని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News