మునుగుతుందని తెలిసే విశాఖ ఆర్కే బీచ్ లో ఆ బ్రిడ్జీని పెట్టారా?
అడ్వెంచర్ టూరిజంలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ సీ బ్రిడ్జిని ఫిబ్రవరి 25న ప్రారంభిస్తే అది ఆ మర్నాడే కొట్టుకుపోయింది.
By : బొల్లం కోటేశ్వరరావు
Update: 2024-11-19 04:14 GMT
పర్యాటకులను కట్టిపడేసే విశాఖ తీరంలో అందాలకు కొదవ లేదు. ఈ సాగర తీరం సౌందర్యం ఇంత.. అని చెప్పడానికి వీల్లేదు. దేనికదే తన ప్రత్యేకతతో సందర్శకులను, పర్యాటక ప్రియులను కట్టి పడేస్తుంది. ఈ సౌందర్యానికి అదనపు ఆకర్షణ కోసం ఎప్పటికప్పుడే సరికొత్త హంగులను సొంతం చేసుకుంటుంది ఈ తీరం. ఇప్పటికే విశాఖ బీచ్లో కురుసుర సబ్మెరైన్ మ్యూజియం, టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియం, విశాఖ మ్యూజియం వంటివి ఉన్నాయి. ఇంకా మరో ఎనిమిది వరకు రమణీయమైన బీచ్లు ఉన్నాయి. వీటిని చూడడానికి వచ్చే పర్యాటకులు ఆ అందాలను ఆస్వాదిస్తుంటారు. ఫిదా అవుతుంటారు.
ఇక ఈ బీచ్ తొలిసారిగా అడ్వెంచర్ టూరిజంలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ లో అలలపై తేలియాడే ఫ్లోటింగ్ సీ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చింది. శ్రీసాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ రూ. కోటి వెచ్చించి తీరం నుంచి సముద్రంలోకి వంద మీటర్ల దూరం వరకు దీనిని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రారంభించింది. అయితే అలల తాకిడికి ఆ మర్నాడే అది కొట్టుకుపోయింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక వినూత్న ప్రాజెక్టుతో పాటు అప్పటి వైసీపీ ప్రభుత్వమూ అభాసుపాలైంది. పలుమార్లు ఈ ఫ్లోటింగ్ సీ బ్రిడ్జిని తిరిగి పునరుద్ధరించాలని ప్రయత్నించినా విఫలమవుతూ వచ్చింది. చివరకు ఈ ప్రాజెక్టు అప్పట్నుంచి మూలన పడింది.
ఆర్కే బీచ్ అనుకూలం కాకపోయినా..
తొలుత ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుకు ఎక్కడ అనుకూలమో చెప్పాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ బే ఆఫ్ బెంగాల్ విభాగాన్ని కోరారు. దీనిపై అధ్యయనం చేశాక లాసన్స్ బే బీచ్, తెన్నేటి పార్క్ బీచ్, ఆర్కే బీచ్లు అనుకూలమని చెప్పారు. తెన్నేటి పార్కు అటవీ శాఖ నుంచి అనుమతుల సమస్య ఉండడం, లాసన్స్ బే బీచ్ పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండడంతో ఆర్కే బీచు ఎంచుకున్నారు. అయితే ఆర్కే బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువగా ఉండడంతో అక్కడ అలల ఉధృతి కూడా అధికంగానే ఉంటుంది. అందుకే అక్కడ కెరటాలు ఉవ్వెతున్న ఎగసి పడుతుంటాయి.
ఆర్కే బీచ్ ఇప్పటికే పర్యాటకుల రద్దీ ఉన్నందున మరో చోట్ల దీనిని ఏర్పాటు చేయాలని నగరానికి చెందిన ఇంటాక్ ప్రతినిధులు సూచించారు. కానీ వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఆర్కే బీచ్ ఫ్లోటింగ్ సీ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. మరోవైపు అప్పట్లో రుషికొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వీలుగా ప్యాలెస్ నిర్మించడం వల్ల ఆర్కే బీచ్ ్ను ఎంచుకున్నారన్న వాదన కూడా ఉంది. దీంతో కెరటాల తాకిడి తీవ్రతకు ఈ బ్రిడ్జి 24 గంటల్లోనే కొట్టుకుపోవడమే కాదు.. ఎన్నిసార్లు ప్రయత్నించినా పునరుద్ధరణకు వీలు పడలేదు. దీంతో ఈ బ్రిడ్జి పరికరాలన్నిటినీ తొలగించి బీచ్లోనే ఉంచేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ కదలిక..
కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిపై మళ్లీ కదలిక వచ్చింది. ఈ బ్రిడ్జికి ఆర్కే బీచ్ అనుకూలం కాదన్న నిపుణుల సూచనతో మరో చోట ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సూచించడానికి ఒక కమిటీని నియమించారు. ఇందులో పర్యాటక శాఖ, విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజియన్ అథారిటీ (వీఎంఆర్డీఏ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ)లకు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు విశాఖ ఫిషింగ్ హార్బర్, లాసన్స్బ బీచ్, తెన్నేటి పార్క్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్ తదితర 8 ప్రదేశాలను పరిశీలించారు. వీటన్నిటిలో రుషికొండ బీచ్ అనువుగా ఉంటుందని తేల్చారు.
ఎందుకంటే? రుషికొండ బీచ్లో ఆర్కే బీచ్ పోల్చుకుంటే అలల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. తీరం నుంచి కొంత దూరం వరకు లోతు కూడా తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ ఫ్లోటింగ్ సీ బ్రిడ్జి కొట్టుకుపోయే ప్రమాదం ఉండదని నిర్ధారణకు వచ్చారు. 'రుషికొండ బీచ్ కు దక్షిణ భాగంలో సముద్రంలో రాళ్లుంటాయి. ఇవి కెరటాల దూకుడుని కట్టడి చేస్తాయి. లోతు తక్కువగా ఉండడం వల్ల బ్రిడ్జి తేలియాడుతూ ఉంటుంది. పైగా ఎప్పుడైనా ప్రమాదం సంభవించినా పర్యాటకులు/సందర్శకులు మునిగిపోయే అవకాశం ఉండదు. నడుచుకుంటూ ఒడ్డుకు వచ్చేయవచ్చు' అని ఎవో శాస్త్రవేత్త ఒకరు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి'తో చెప్పారు.
త్వరలో ట్రయల్ రన్‌కు సన్నాహాలు..
విశాఖలో పర్యాటక సీజను అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సీజనులోనే విశాఖకు పర్యాటకులు పోటెత్తుతుంటారు. సంవత్సరం మొత్తమ్మీద వచ్చే పర్యాటకులలో సగానికి పైగా ఈ నాలుగు నెలల్లోనే వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణుల కమిటీ నివేదికతో వీఎంఆర్డీఏ, పర్యాటక శాఖ అధికారులు రుషికొండలో ఫ్లోటింగ్ సీ బ్రిడ్జి ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి సక్సెస్ అయితే సంక్రాంతి నాటికి ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తేవడానికి పర్యాటక శాఖ, వీఎంఆర్డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తొమ్మిది నెలల తర్వాత మళ్లీ ప్రయోగం చేస్తున్న ఈ ఫ్లోటింగ్ సీ బ్రిడ్జి మనుగడ సాగిస్తుందా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ తరహా బ్రిడ్జిలు కేరళలోనే..
ఫ్లోటింగ్ సీ బ్రిడ్జి (ఎఫ్ఎస్బీ)లు ఇప్పటివరకు దేశంలోకెల్లా కేరళ తీరంలోనే ఉన్నాయి. విశాఖలో ఏర్పాటు చేసినది రెండవది. దీనికి 34 సిమెంట్ యాంకర్లు, రెండు ఐరన్ యాంకర్లు ఈ బ్రిడ్జిని సంరక్షిస్తాయి. ఒకరి తర్వాత ఒకరు 200 మంది వరకు ఈ బ్రిడ్జిపైకి వెళ్లి రావచ్చు. ప్రతి 25 మీటర్లకు ఒకరు చొప్పున లైఫ్ గార్డులు ఉంటారు. బ్రిడ్జికి ఇరువైపులా రెండు లైఫ్ బోట్లు ఉంటాయి. ఈ ఫ్లోటింగ్ సీ బ్రిడ్జిపైకి ఎక్కిన వారు ప్రమాద బారిన పడకుండా ఇలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు.