YS JAGAN | ఓడినా నేనే మోనార్క్ అని జగన్ ఎందుకనుకుంటున్నారు?
భవిష్యత్తు కార్యాచరణకు పార్టీ నేతలతో జగన్ భేటీ కానున్నారు. కూటమి దెబ్బకు వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోందా? కొత్తగా ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు?
By : SSV Bhaskar Rao
Update: 2024-12-04 04:40 GMT
రాజకీయాల్లో తాను మోనార్క్ అనేది మాజీ సీఎం జగన్ ధృడ అభిప్రాయం. పార్టీని నడిపించడం నుంచి గత సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన తీరు అలాగే సాగింది. ఈ విషయం అనేకసార్లు ఆయనే నిరూపించుకున్నారు. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ఆయన నిర్ణయాలే అమలు చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అంచనాలు పటాపంచలయ్యాయి. దీంతో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్. జగన్ తన తీరులో మార్పు వచ్చిందనే విషయాన్ని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నట్లే కనిపిస్తోంది. అని చెప్పడం కంటే..
టీడీపీ కూటమి వైసీపీ నేతల వ్యాపారాలపై దృష్టి సారించింది. ఆర్ధిక మూలాలను దెబ్బకొడుతోంది. సోషల్ మీడియా కీలక వ్యక్తులు, వర్కర్లపైనే కాకుండా, జగన్ కు అంతరంగికులుగా ఉన్న మాజీ ప్రజాప్రతినిధులను కేసులతో జైలుపాలు చేస్తోంది. అధికారం పోయిన తరువాత ఉన్న పదవులు కూడా వదలి వెళుతున్న నేతల తీరుతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లే కనిపిస్తోంది. అయినా, వైఎస్. జగన్ బింకం ప్రదర్శిస్తున్నట్లే కనిపిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం, దిగువశ్రేణి కార్యకర్తలను కాపాడుకోవాలనే లక్ష్యంతో సాగాలని భావిస్తన్నారు. దీనికి తండ్రి వైఎస్ఆర్ చరిష్మాను తెరపైకి తీసుకుని రావడం ద్వారా మళ్లీ లేవాలనే ప్రయత్నంలో భాగంగా..
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆ రోజు (బుధవారం) పార్టీ యంత్రాంగంతో కీలక భేటీకి ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అసెంబ్లీ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో
"పార్టీ అభివృద్దితో పాటు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలి" అనేది ప్రధాన అజెండాగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడ ఓ విషయం గమనించాలి.
"సంక్రాంతి తరువాత జగన్ జనంలోకి వెళతారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పార్టీ క్యాడర్ తో భేటీ అవుతారు" అనే కార్యక్రమాలు ముందే ఖరారు చేశారు. ఈ విషయాలు మీడియాలో ప్రధానంగా వైసీపీ సొంత "సాక్షి మీడియా" తోపాటు సోషల్ మీడియాలో కూడా వెల్లడించారు. ఇక ప్రత్యేకంగా నేతల అభిప్రాయాలు తీసుకోవడానికి ఇంకేమి ఉంటుదనేదే ప్రశ్న.
అంటే ఇప్పుడు కూడా "నా కార్యక్రమాల తీరు ఇలా ఉంటుంది. దీనిని ఆచరించాలి. అనే మాటలను జగన్ పార్టీ నేతల భేటీలో చెప్పబోతున్నారా? అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
ఏ రాజకీయ పార్టీ అయిన అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటిస్తుంది. పాటించాలి కూడా. అందరి అభిప్రాయాలు క్రోడీకరించి, నిర్ణయాలు తీసుకుంటేనే ఏ పార్టీ అయిన మనుగడ సాగిస్తుందనేది చరిత్ర చెప్పిన పాఠం. ఈ వ్యవహారం వైసీపీలో సాధ్యమా? నాయకులు చెప్పేది జగన్ వింటారా? నాయకులు కూడా అంతసాహసం చేస్తారా? అనేది కూడా చర్చనీయాంశమే. ఈ చర్చ రావడం వెనుక వైఎస్ఆర్ కుటుంబంలో జగన్ తీరు విభిన్నంగా ఉంటుందనే విషయం బహిరంగ రహస్యం. అందుకు నిదర్శనం..
వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాజీలుగా మారిన నేతల్లో చాలామంది అధినేత వైఎస్. జగన్ తీరును తూర్పారబట్టిన విషయం ప్రస్తావనార్హం.
"ఈ పరిస్థితి రావడానికి జగన్ ఏకపక్ష ధోరణే కారణం" అని నిందించారు. ల్యాండ్ టైటిల్ దెబ్బతీసింది. ద్వితీయ శ్రేణినేతలను పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను విస్మరించారు. ఇవి చెబుదామంటే దగ్గరికి రానివ్వలేదు. దీనికి తోడు సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అరెస్టు చేయడం ద్వారా వైసీపీపై ఉన్న అసంతృప్తీ పీక్ స్టేజీకి చేరిందనే విషయాలను కూడా ఎన్నికల తరువాత తెరపైకి తెచ్చారు. ముమ్మాటికి ఇవన్నీ వాస్తవాలే అనే విషయాన్ని చాలా మంది వైసీపీ నేతలే అంగీకరించారు. దీనిలో ఒక్కదానికి కూడా వైఎస్. జగన్ నుంచి సమాధానం కాదు. కనీసం వివరణ కూడా లేకపోవడం గమనించదగిన విషయం.
"సమస్యలు చెప్పడానికే కాదు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని వివరించడానికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. అధికారులు మమ్మలిని జగన్ కు దగ్గరికి కూడా వెళ్లనివ్వలేదు" అని కర్నూలు, అనంతపురం జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
దీనికంతటికీ ప్రధాన కారణం. "చెవులు మాత్రమే వినాలి. పెదాలు కదల కూడదు" అనే ధోరణిలో జగన్ వ్యవహరించడం వల్ల జరిగిన తప్పదంగానే వైసీపీ శ్రేణులు మథనం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో
ఆశలు గల్లంతయ్యాయా?
వైసీపీ అధికారం కోల్పోయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలైంది. టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ 6 పథకాలపై వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ ఆశలు పెంచుకున్నారు. "రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే సీఎం ఎన్. చంద్రబాబు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారు. అవి ఎలాగూ ఫెయిల్ అవుతాయి. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం" అని మళ్లీ మితిమీరిన ధీమాలోకి వెళ్లారనే విషయం ఆయన మాటల ద్వారానే వెల్లడించారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి నెలలోనే సూపర్ 6 పథకాల్లో సామాజిక పింఛన్ల మొత్తం పెంచడంతో పాటు పంపిణీ చేశారు. గత నెలలో తెలుపు రేషన్ కార్డు ఉన్న వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ ప్రారంభించారు. సంక్రాంతికి మరో రెండు పథకాలు అమలు చేయబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఊహించిన దానికి విరుద్ధంగా జరుతోందనే అభిప్రాయాలు వైసీపీ శ్రేణుల్లోనే కాదు. ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్ కూడా గ్రహించినట్లే కనిపిస్తోంది. దీంతో
ఆ ఆశపాయో..
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 4.5 సంవత్సరాల గడువు ఉంది. "జమిలీ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో 2029లోనే ఎన్నికలు జరుగుతాయి" అని
సీఎం ఎన్. చంద్రబాబు ఇటీవల ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అనే కలవరం కూడా వైసీపీ శ్రేణుల్లో బయలుదేరినట్లు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎలాగూ అధికార పార్టీ మాటే చెల్లుబాటు అవుతుందనేది చరిత్ర మిగిల్చిన వాస్తవాలు కళ్లముందే ఉన్నాయి. దీంతో జమిలీపై కూడా వైసీపీకి ఆశలు సన్నిగిల్లినట్లే కనిపిస్తోంది.
అసలు విషయం కేసులేనా..?
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల నేతలు కేసులు కూడా ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగిన వ్యక్తిత్త హననానికి హద్దు లేకుండా పోయిందనే విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం ఎన్. చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ "రాజకీయ కక్షసాధింపులు ఉండవు" అని విస్పష్టంగా ప్రకటించారు. కానీ, పరిస్థితి మాత్రం అందుకు విభిన్నంగానే ఉంది. అన్ని చట్టబద్ధంగానే జరుగుతాయి అనే ముక్తయింపు కూడా ఇవ్వడం గమనార్హం. అందులో భాగంగానే..
టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలతో వైసీపీ అధికారంలో ఉండగా, సాగించిన వ్యవహారాలను ప్రజల ముందు ఉంచారు. ఇసుక, మద్యం, మట్టితో పాటు గనులను కొల్లగొట్టిన తీరును బట్టబయలు చేశారు. అవినీతి అక్రమాలను సాక్షాలతో సహా వెల్లడించడంతో పాటు ఆర్థికంగా జరిగిన దుబారాను కూడా వెల్లడించారు.
ఆర్థిక మూలాలపై దృష్టి
అంతటితో ఆగని కూటమి ప్రభుత్వం వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాపారాలపై కూటమి దృష్టి సారించింది. అక్రమ కలాపాలకు అడ్డుకట్ట వేయడానికి కోరడా పట్టారు. అందులో ఓ సాక్ష్యం. పేదల ఉచిత బియ్యం అక్రమ రవాణా చేస్తున్న తీరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టపగలే బట్టబయలు చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రొయ్యల శుద్ధి పరిశ్రమలను సీజ్ చేయించడాన్ని ప్రస్తావించవచ్చు. దీనికంటే ముందు..
వైసీపీ వారియర్లపై వార్
సోషల్ మీడియా వారియర్లుగా చెబుతున్న వైసీపీ వర్కర్లను కేసులు వెంటాడుతున్నాయి. వైఎస్. జగన్ భార్య వైఎస్. భారతీరెడ్డికి పీఏగా పనిచేసిన పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 40 కేసులు ఉంటే అందులో రాయలసీమలోనే పదికి పైగా కేసులు నమోదయ్యాయి. వాటిల్లో కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వర్రాను పీటీ వారెంట్ పై గుంటూరు పోలీసులు తీసుకుని వెళ్లిన విషయం తెలిసింది. వైసీపీ చీఫ్ జగన్ పేరు బాగా వాడుకుని, ఇష్టారాజ్యంగా మాట్లాడిన బోరుగడ్డ అనిల్ పరిస్థితిని పట్టించుకునే వారే లేరు. వారే కాకుండా..
సన్నిహితులపైనా...
వైసీపీ సోషల్ మీడియా వర్కర్లతో పాటు తనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన బాపట్ల మాజీ ఎంపీ టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసేలో రిమాండ్ లో ఉన్నారు. ఇలా చెప్పకుంటే పోతే అధికారంలో ఉండగా, సోషల్ మీడియా పోస్టులతో విసృంఖలంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదయ్యాయి. దీంతో వైసీపీ శ్రేణులే కాదు. ఆ పార్టీ ఉన్నతస్ధాయి నేతలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఆ నేతలతో కలవరం
దీనికి తోడు కూడా అధికారం కోల్పోయిన తరువాత మాజీ ఎమ్మెల్యేలు మంత్రులే కాదు. ఏకంగా రాజ్యసభ, శాసనమండలి సభ్యులు కూడా వైసీపీకి వీడారు. ఈ పరిణామాలతో పాటు, మెల్లగా వైఎస్. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల డొంక కూడా కదులుతున్నట్లు భావిస్తున్నారు. తన పరిస్థిత సరే. ముందు పార్టీని, అందులో ప్రధానంగా క్షేత్రస్థాయి నేతలు, సోషల్ మీడిమా కార్యకర్తలను ఆత్మస్థైర్యం కల్పించేందుకు ప్రజాక్షేత్రంలోకి రావడానికి వైఎస్. జగన్ సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసమే నియోజకవర్గ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కీలకభేటీకి వైఎస్. జగన్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఏమి చెబుతారు? నేతలు ఏ సలహాలు ఇస్తారు? సంక్రాంతి తరువాత జనంలోకి వస్తారనే పాత విషయం కాకుండా, ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారనేది వేచిచూడాలి.