YCP | చెవిరెడ్డి శ్రీలంకకు ఎందుకు బయలుదేరారు..?

బెంగళూరు విమానాశ్రయంలో వైసీపీ నేత చెవిరెడ్డిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గతంలో ఆయన కొడుకును కూడా ఇలాగే విదేశీ ప్రయాణానికి అనుమతించలేదు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-17 07:26 GMT

శ్రీలంకకు వెళ్లాలని భావించిన వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. విమానాశ్రయానికి చేరుకోగానే ఇమిగ్రేషన్ అధికారులు అభ్యంతరం చెప్పారని తెలిసింది. చెవిరెడ్డి పై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడం వల్ల ఆయనను విదేశీ ప్రయాణానికి బెంగళూరు విమానాశ్రయం సిబ్బంది అనుమతించలేదని తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసిపి అధికారంలో ఉండగా ఆయన గవర్నమెంట్ విప్ గా కూడా సేవలందించారు. వైసిపి అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్ ఆంతరంగికల్లో చెవిరెడ్డి కూడా ఒకరు.
2024 ఎన్నికల్లో ఆయన ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి ఓటమి చెందారు. కాగా, వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అవకతవకలు, కుంభకోణాలపై టిడిపి కూటమి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా,
రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే. ఏ వన్ గా ఉన్న రాజ్ కసిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డి, ఈ ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్పను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (special investigator team SIT) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని సిట్ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు ఇప్పటికే ముమ్మరం చేశారు. ఈ కేసుతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఉన్న సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా చెవిరెడ్డి గన్మెన్ మదన్ రెడ్డిని విచారణ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల తిరుపతిలో మీడియా వద్ద స్పందించారు.
"లిక్కర్ స్కామ్ లో నన్ను అనవసరంగా ఇరికించాలని చూస్తున్నారు. దీనికి నేను భయపడను" అని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
"నా పిఏలు, గన్మెన్లు, అనుచరులను విచారణ పేరుతో వేధించకండి. మీరు పెడుతున్నవి తప్పుడు కేసులు అని నాకు తెలుసు. నేను అందుబాటులో ఉంటాను. అరెస్టు చేసుకోండి" చెవిరెడ్డి వేదనతో కూడిన స్వరంతో మొదటిసారి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి నాయకులను కేసులతో వేధిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ఆ తర్వాత కూడా ఆయన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం లో పర్యటనకు వెళ్లారు. ఇటీవల మార్కాపురంలో వైయస్ జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై వైసిపి కార్యకర్తలను అరెస్టు చేయడంపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు.
పోలీసులు అరెస్ట్ చేసిన కార్యక్రమం పరామర్శించడానికి వెళ్లి, అక్కడ సీఐతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి కూడా దిగారు. ఇదిలా ఉండగా..
శ్రీలంక వెళ్లడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు ఆయన పాస్పోర్ట్ పరిశీలించి, విమాన ఎక్కకుండా అడ్డుకున్నట్లు సమాచారం అందింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి ఉండడానికి చూపించి, ప్రయాణానికి అనుమతించలేదు.
గతంలో చెవిరెడ్డి కొడుకు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని కూడా బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారు. 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద తన ప్రత్యర్థి, టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నాని పై (ప్రస్తుత ఎమ్మెల్యే) దాడి జరిగింది. కర్రలు రాడ్లతో విధ్వంసం సృష్టించారు. మోహిత్ రెడ్డి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉండగానే జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయం వద్ద జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పై కేసు నమోదు అయింది. కాగా ఆయన, దుబాయ్ వెళ్లడానికి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ అయి ఉన్న నేపథ్యంలో మోహిత్ రెడ్డిని అడ్డుకొని, ఆంధ్ర పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తిరుపతి నుంచి వెళ్లిన అధికారుల బృందం మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. మరుసటి రోజు ఆయనను తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చారు. ఒకరోజు మొత్తం హై డ్రామా నడిచింది. చివరికి 141 నోటీసు జారీ చేసిన తిరుపతి పోలీసు అధికారులు మోహిత్ రెడ్డిని వదిలివేయడంతో రాజకీయ వాతావరణం చల్లబడింది.

Similar News