నువ్వెంతంటే నువ్వెంత! నంద్యాల ఎంపీ V/S ఐఏఎస్ కార్తికేయ
వాళ్లిద్దరు ఎందుకు తిట్టుకున్నారు? సీఎంవో లో ఏమి జరుగుతోందీ?;
By : The Federal
Update: 2025-09-15 11:28 GMT
తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కి సీఎం అదనపు కార్యదర్శి, ఐఎఎస్ అధికారి కార్తికేయ మిశ్రాకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. మూడు రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఈ మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వీళ్లిద్దరూ పరస్పరం సీఎంవో ఆఫీసులో ఫిర్యాదు జరిగినట్టు కూడా తెలుస్తోంది. (దీన్ని ఫెడరల్ నిర్దారించడం లేదు). సోషల్ మీడియాలోనూ కొన్ని ప్రధాన పత్రికలలో వచ్చిన సమాచారం ప్రకారం..
అసలేం జరిగిందంటే..
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఆయన్ను కలిసేందుకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వెళ్లారు. చాలాసేపు ఎదురు చూసినా ఆమెకు అనుమతి లభించలేదు.
దీంతో ఆమె- సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రాను కలిసి సీఎంను కలవాలని చెప్పారు. దానికి ఆయన ఇప్పుడు కుదిరేలా లేదు అని అనడంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం సాగినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఓ దశలో వీరిద్దరూ పెద్దపెద్దగా మాట్లాడుకోవడంతో పాటు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ పంచాయితీ చేరినట్టు తెలుస్తోంది.
‘‘ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూడసాగారు. ఆ సమయంలో ఆమెను సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా ‘‘సీఎం బాగా బిజీగా ఉన్నారు’’ అని చెప్పి అనుమతించలేదు. దీంతో ఆగ్రహోదగ్రురాలయ్యారని సమాచారం.
‘‘నేనొక ఎంపీని.. నాతో ఇలాగేనా మాట్లాడేది’’ అని గట్టిగా అరిచారని, దానికి ఆయన ‘‘మీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదు’’ అంటూ అదేస్థాయిలో బదులిచ్చారని తెలుస్తోంది. ఇంగ్లీషులో వాడిన యూ (నీవు, మీరు) అనే పదాన్ని ఆమె తప్పుబట్టి తనను ఏకవచనంతో పిలుస్తారా అంటూ శబరి.. తనతో మర్యాదగా మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారట. ఆ వివాదం మరింత ముదరకుండా.. కొందరు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని తెలిసింది.
తాజాగా శబరి.. మంత్రి నారా లోకేష్‌కు ఈ వ్యవహారంపై పిర్యాదు చేశారు. అయితే కార్తికేయ మిశ్రా కూడా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ని కావాలనే చంద్రబాబుకి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సి ఉంది.