Dilawarpur|దిలావర్ పూర్ నుండి రేవంత్ ప్రభుత్వం ఎందుకు వెనక్కుతగ్గింది ?

ఫ్యాక్టరీని దిలావర్ పూర్ నుండి మరో చోటికి మార్చటమో లేకపోతే అనుమతులను రద్దుచేయటమే ఏదో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-11-28 09:23 GMT

ఏ ప్రభుత్వం అయినా ప్రజాగ్రహం ముందు తలవంచక తప్పదని మరోసారి నిరూపితమైంది. నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్-గుండ్లపల్లి మధ్య ఏర్పాటవబోతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) విషయంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం వెనక్కుతగ్గింది. ఫ్యాక్టరీని దిలావర్ పూర్ నుండి మరో చోటికి మార్చటమో లేకపోతే అనుమతులను రద్దుచేయటమే ఏదో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ 48 గంటలు ఆందోళనలు చేసిన గ్రామస్తులు, రైతులతో బుధవారం రాత్రి చెప్పటంతో ఆందోళనలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆందోళనకారులు ప్రకటించారు. దాంతో మూడురోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతగా మారిన దిలావర్ పూర్-గుండ్లపల్లి గ్రామాల ప్రాంతం తాత్కాలికంగా అయినా ఇపుడు ప్రశాంతంగా ఉన్నాయి. ఇంతకీ ఇథనాల్ ప్రభుత్వం ప్రారంభంనుండి రేవంత్ ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గినట్లు ?

ఎందుకంటే ఇక్కడ రెండుకారణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటిదేమో సొంత నియోజకవర్గం కొడంగల్లో జరిగిన గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) మీద గ్రామస్తులు, రైతుల దాడి ఘటన లాంటిది పునరావృతం కాకూడదన్న ఆలోచన. ఆర్డీవో రత్న కల్యాణి(RDO Ratna Kalyani) మీద దిలావర్ పూర్(Dilawarpur village) గ్రామస్తులు దాడిచేసి 5 గంటలపాటు కారులో నిర్బంధించారు. ఈ ఘటన లగచర్ల ఘటన వైపుకే దారితీస్తోందేమో అన్న ఆందోళన రేవంత్ ప్రభుత్వంలో పెరిగిపోయుండచ్చు. ఇక రెండో కారణం బీఆర్ఎస్ హయాంలో అనమతులు వచ్చిన ఫ్యాక్టరీ తలనొప్పులను తాము ఎందుకు భరించాలని రేవంత్ అనుకుని ఉండచ్చు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటిది ఇపుడు గ్రామస్తులు, రైతుల ఆందోళనల నేపధ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ‘రైతుల దెబ్బకు రేవంత్ ప్రభుత్వం దిగొచ్చింది’ అని కేటీఆర్ ట్వీట్ చేయటం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసుంటుంది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే. నిర్మాణం పూర్తిచేసుకుని ఇపుడు ప్రారంభ దశకు చేరుకుందంతే.

ఫ్యాక్టరీకి అనమతులు ఇచ్చినప్పుడే గ్రామస్తులు, రైతులు ఆందోళనలు చేసినా కేసీఆర్ ప్రభుత్వం(KCR Government) పట్టించుకోలేదు. దాదాపు నాలుగేళ్ళుగా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు, రైతులు ఆందోళనలు చేస్తునే ఉన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసుకుని ఉత్పత్తికి రెడీ అవుతోంది కాబట్టే గ్రామస్తులు తమ ఆందోళనల తీవ్రతను బాగా పెంచేశారు. ప్రజాగ్రహాన్ని రేవంత్ ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకోకుండా కాస్త ఓపికగా ఆలోచించి పనులను ఆపేసింది. ఫ్యాక్టరీని దిలావర్ పూర్ నుండి ఎక్కడికి మార్చినా మళ్ళీ ఇదే సమస్య వస్తుంది కాబట్టి రద్దు చేయటమే అన్నీ విధాలుగా మంచిది.

ఇదే విషయమై మంత్రి సీతక్క(Minister Seethakka) మీడియాతో మాట్లాడుతు ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాద(Talasani Srinivasa Yadav)వ్, ఏపీలో టీడీపీ(TDP) నేత పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకులు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. ఈ ఫ్యాక్టరీకి అన్నీరకాల అనుమతులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పారు. నేతల కొడుకులు డైరెక్టర్లుగా ఉన్న డాక్యుమెంట్లను సీతక్క మీడియాకు చూపించారు. ఫ్యాక్టరీకి అనుమతులన్నీ తామే ఇచ్చి గ్రామస్తులు, రైతుల ఆందోళన నేపధ్యంలో ఆ తప్పును కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీదకు తోసేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తమ హయాంలో చేసిన తప్పులన్నింటికీ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద తోస్తున్న చవకబారు రాజకీయానికి కేటీఆర్ పాల్పడుతున్నట్లు సీతక్క ఆరోపించారు. ఫ్యాక్టరీ అనుమతులు, యాజమాన్యానికి సంబంధించిన మరిన్ని వివరాలను తొందరలోనే బయటపెడతామని సీతక్క ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటనతో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అందరికీ అర్ధమైంది.

పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్(PCC President Bomma Mahesh Goud) కూడా ఫ్యాక్టరీ యాజమాన్యంలో తలసాని శ్రీనివాసయాదవ్ కొడుకున్నట్లు చెప్పారు. ఫ్యాక్టరీ బీఆర్ఎస్ నేతలకు చెందిన వాళ్ళదే అన్నారు. అయితే ఈ ఆరోపణలను తలసాని కొట్టిపడేస్తున్నారు. ఫ్యాక్టరీకి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదన్నారు. తనపై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ తో పాటు మంత్రి సీతక్క అనవసరంగా ఆరోపణలు చేస్తున్నట్లు ఖండించారు. సరే, ఫ్యాక్టరీ ఎవరిదైనా, యాజమాన్యంలో ఎవరున్నా ప్రజాగ్రహాన్ని పరిగణలోకి తీసుకుని రేవంత్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నదనే చెప్పాలి. ఇదే పద్దతిని ఫార్మా పరిశ్రమల భూ సేకరణ విషయంలో కూడా పాటించుంటే అంత గొడవే జరగకపోను కదా.

Tags:    

Similar News