JAGAN BAIL|జగన్ కేసును జస్టిస్ సంజయ్ ఎందుకు 'నాట్ బిఫోర్ మీ' అన్నారు?
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘు రామ కృష్ణం రాజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ నవంబర్ 12న విచారణకు వచ్చినపుడు జస్టిస్ సంజయ్ నాట్ బిఫోర్ మీ అన్నారు, ఎందుకు?
By : The Federal
Update: 2024-11-12 13:51 GMT
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS JAGAN MOHAN REDDY) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణలో మరో మలుపు తిరిగింది. ఈ కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘు రామ కృష్ణం రాజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ నవంబర్ 12న విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ సంజయ్ కుమార్ 'నాట్ బిఫోర్ మీ' (NOT BEFORE ME) అంటూ కేసు నుంచి తప్పుకున్నారు.
జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ సంజయ్ కుమార్ (JUSTICE SANJAY KUMAR) ‘నాట్ బిఫోర్ మి’ అనడంతో విచారణ వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు. డిసెంబర్ 2వ తేదీన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తన ముందు ఈ కేసును ప్రస్తావించవద్దని చెప్పినా పొరపాటున ఈరోజు లిస్ట్ అయినట్లు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్ ప్రకటించారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ రెండేళ్ల కిందట సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నవంబర్ 12న సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది. సంజీవ్ ఖన్నాతో పాటు ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్ కూడా ఉన్నారు. కేసు విచారణకు వచ్చినపుడు న్యాయమూర్తి సంజయ్ కుమార్ సుముఖత చూపలేదు.
జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు జగన్ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైనా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనమే విచారణ జరుపుతుందని సీజేఐ సంజీవ్ ఖన్నా తెలిపారు.
ఎవరీ జస్టిస్ సంజయ్ కుమార్?
ఇంతకీ జస్టిస్ సంజయ్ కుమార్- జగన్ కేసును ఎందుకు 'నాట్ బిఫోర్ మీ' అన్నారు? ఆయన ఎవరు అనేది రాష్ట్రంలో మళ్లీ చర్చనీయాంశమైంది.
జస్టిస్ సంజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. పూర్తిపేరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అంతకుముందు ఆయన మణిపూర్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ నియమితులయ్యారు. 2023 ఫిబ్రవరి 4న ఆయన్ను రాష్ట్రపతి నియమించారు. పీవీ సంజయ్ కుమార్ 1963 ఆగస్టు 14న పులిగోరు రామచంద్రారెడ్డి, పి.పద్మావతమ్మ దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన తండ్రి రామచంద్రారెడ్డి 1969 నుంచి 1982 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. సంజయ్‌కుమార్ నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసి 1988లో ఢిల్లీ యూని వర్సిటీ నుంచి లా పూర్తి చేశాడు.
సంజయ్ కుమార్ లా పూర్తి చేసిన తరువాత 1988లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని తన తండ్రి రామచంద్రా రెడ్డి వద్ద జూనియర్ గా చేరారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2000 నుంచి 2003 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2008 ఆగస్టు 8న అదనపు జడ్జిగా నియమితులై 2010 జనవరి 20న శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సంజయ్ కుమార్ 2019 అక్టోబరు 14 నుంచి 2021 ఫిబ్రవరి 13 వరకు పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి 2021 ఫిబ్రవరి 14న మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
అసలేం జరిగిందంటే..
చీఫ్ జస్టిస్ ఖన్నా ధర్మాసనంలో జస్టిస్ సంజయ్‌కుమార్ సభ్యుడిగా ఉన్నారు. విచారణ ప్రారంభం కాగానే.. ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవని జగన్ తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్ అన్నారు. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని 2022 నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ గత ఏడాది మే నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కూడా కొంత సమయం కావాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ క్రమంలో జస్టిస్ సంజయ్ కుమార్ 'నాట్ బిఫోర్ మీ' అనడంతో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.