విశాఖ ఉక్కులో ఉలికిపాటు!

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదా? తాజాగా ఈ ప్లాంట్‌లో వివిధ విభాగాల్లోని 32 పనులు ప్రైవేటు నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయడం దీనికి దర్పణం పడుతోంది.;

Update: 2025-08-18 15:09 GMT
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌

కేంద్ర ప్రభుత్వ చర్యలు విశాఖ ఉక్కును రోజురోజుకూ ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఎప్పటికప్పుడే అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఈ ప్రభుత్వ రంగ కర్మాగారం మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉక్కు ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్నాయి. నాలుగున్నరేళ్ల క్రితం ఈ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికీ అదే వైఖరితో ఉంది. అప్పట్నుంచి ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక, ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా తగ్గేదే లే! అంటోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లు ఓట్ల కోసం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానీయబోమంటూ హామీలిచ్చారు. తీరా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకురావడం మానేశారు. కొన్నాళ్ల తర్వాత కేంద్రం ఈ ఉక్కు కర్మాగారానికి గత జనవరిలో ప్యాకేజీ అంటూ రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. దీంతో కూటమి నేతలంతా ప్రైవేటీకరణ ఆగిపోయినంత హడావుడి చేశారు. సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ఐటీ మంత్రి లోకేష్‌లు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపేశామన్నట్టుగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాకపోయినా జనాన్ని మభ్యపెడుతూనే ఉన్నారు.

ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గలేదుః కేంద్రం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు మరోసారి కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని ఇటీవల రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సమాధానమిచ్చారు. దీన్నిబట్టి ఈ స్టీల్‌ ప్లాంట్‌ మెడపై ప్రైవేటీకరణ కత్తిని వేలాడదీస్తూనే ఉందని స్పష్టమైంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు అందుకు ఊతమిస్తున్నాయి.
తొలగింపులు.. వీఆర్‌ఎస్‌లు..
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కొన్నాళ్ల క్రితం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఇంకా తొలివిడతలో సుమారు 1150 మంది శాశ్వత ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ ఇచ్చి ఇంటికి పంపేసింది. రెండో విడతలో మరో 1100 మందిని సాగనంపడానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది.
తొలుత కొన్ని.. ఇప్పుడు మరిన్ని..
గతంలో టోటల్‌ మెయింటెనెన్స్‌ పనులను మాత్రమే యాజమాన్యం ప్రైవేటుకు అప్పగించింది. ఇప్పటికే ఆర్‌ఎంహెచ్‌పీ, సింటర్‌ ప్లాంట్‌ మెయింటెనెన్స్‌కు ఈఓఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌)ను జారీ చేసింది. కానీ ఇప్పుడు ఏకంగా వివిధ విభాగాల్లోని 32 పనుల నిర్వహణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇలా ఈ ప్లాంట్‌లో ప్రధాన విభాగాలన్నీ ప్రైవేటుకు అప్పగించడం ద్వారా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికే కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టమవుతోంది.
ప్రైవేటీకరణ నోటిఫికేషన్ వీటికే..
క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్‌–1, క్యాప్టివ్‌ పవర్‌ప్లాంట్‌–2, వేస్ట్‌ హీట్‌ రికవరీ థర్మల్‌ పవర్‌ ప్లాంట్, వైర్‌ రాడ్‌ మిల్, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ 1, 2, 3 విభాగాలు, స్టీల్‌ మెల్ట్‌ షాప్, రోల్‌ షాప్‌ అండ్‌ రిపేర్‌ షాప్, ఈఎస్‌అండ్‌ఎఫ్‌ (ఫౌండ్రీ), మిల్స్, స్ట్రక్చరల్‌ బార్‌ మిల్‌ (ఎస్‌బీఎం), ఈఅండ్‌ఈఎన్‌ఎండీ, మాదారం డోలమైట్‌ మైన్, స్పెషల్‌ బార్‌ మిల్స్, రోల్‌ షాప్‌ ఏరియా, గ్యాస్‌ క్లీనింగ్‌ ప్లాంట్, స్పెషల్‌ బార్‌ మిల్స్‌ షిప్పింగ్‌ ఏరియా, ఎంఎంఎస్‌ఎం, కంటిన్యూ కాస్టింగ్‌ డివిజన్‌ (సీసీడీ)లతో పాటు మరికొన్ని విభాగాల ప్రైవేటీకరణకు తాజాగా విశాఖ ఉక్కు యాజమాన్యం నోటిఫికేషన్‌ జారీ చేసింది.
మరింతమంది ఉద్యోగులకు ఎసరు..
ఈఓఐలు అమలులోకి వస్తే.. మరింత మంది శాశ్వత ఉద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుందన్న ఆందోళన ఆ ఉద్యోగుల్లో ఉంది. తక్కువ మంది శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులతో ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ఉక్కు కార్మికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే 32 విభాగాలకు జారీ చేసిన ఈవోఐల నోటిఫికేషన్‌ను యాజమాన్యం ఉపసంహరించుకోవాలని ఉక్కు కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఉక్కు మెయిన్‌ గేటు ఎదుట కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు, కార్మికులు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

గుడివాడ అమర్‌నాథ్‌

ఈవోఐలను తక్షణమే రద్దు చేయాలి..
‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపుతామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పడు ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులేస్తుంటే వారు ఏం చేస్తున్నారు? ఉక్కు ప్రైవేటీకరణ వద్దని సీఎం చంద్రబాబు హుకుం జారీ చేస్తే ఆగిపోయే అవకాశం ఉన్నా ఆ పని చేయడం లేదు. ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమే. తాజాగా ఇచ్చిన 32 ఈవోఐను తక్షణమే రద్దు చేయాలి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ మీడియా సమావేశంలో చెప్పారు.

డి.ఆదినారాయణ

భవిష్యత్‌ పోరుపై నిర్ణయం తీసుకుంటాం..
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎలాగైనా ప్రైవేటీకరించాలన్న దురుద్దేశంతో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఉక్కు ఉద్యోగులు, కార్మికులు నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్నా ప్లాంట్‌ ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను తొలగించింది. శాశ్వత ఉద్యోగాలను వీఆర్‌ఎస్‌ పేరుతో ఇంటికి పంపింది. ఇప్పుడు 32 పనులకు సంబంధించి ప్రైవేటీకరణకు వీలుగా ఈవోఐలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు ప్రైవేటీకరణ యోచనను విరమించుకునే దాకా ఏ తరహాలో ఉద్యమించాలన్న దానిపై అన్ని యూనియన్లు, కలిసొచ్చే రాజకీయ పార్టీలు, స్థానిక పరిశ్రమ వర్గాలతో కలిసి త్వరలోనే నిర్ణయిస్తాం. అవసరమైతే సమ్మెకు వెళ్తాం’ అని ఉక్కు ఏఐటీయూసి ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Tags:    

Similar News