Eatala Rajendar|ఈటల ఎందుకు రెచ్చిపోయాడు ?

ఆ సమయంలో అక్కడేఉన్న ఒకరియల్ ఎస్టేట్ దళారీపై ఈటల చేయిచేసుకున్నారు;

Update: 2025-01-21 11:22 GMT

కమలంపార్టీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ రెచ్చిపోయారు. తమ భూములను కొందరు బ్రోకర్లు కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలతో కొందరు పేదలు ఈటలను కలిసి ఫిర్యాదుచేశారు. తనకు అందిన ఫిర్యాదు మేరకు ఈటల(Eatala Rajendar) మంగళవారం మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటి పరిధిలోని ఏకశిలానగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కబ్జాకు గురైన భూములను పరిశీలించారు. ఆ సమయంలో అక్కడేఉన్న ఒకరియల్ ఎస్టేట్ దళారీపై ఈటల చేయిచేసుకున్నారు. ఎప్పుడైతే ఈటల చేయిచేసుకున్నాడో అక్కడే ఉన్న ఎంపీ మద్దతుదారులు దళారీపై పిడిగుద్దులతో విరుచుకుపడిపోయారు. దాంతో కొద్దిసేపు అక్కడి వాతావరణం ఉద్రిక్తంగామారింది. పేదల భూములను ఎవరు కాజేసినా, కబ్జాలుచేసినా సహించేదిలేదని పెద్ద వార్నింగే ఇచ్చేశారు. పేదల భూములను కబ్జాచేసిన వారిపై పోలీసు కమీషనర్ కు ఈటల ఫిర్యాదుచేశారు.

పేదలభూములను కబ్జాచేసిన వారిపై పోలీసులు కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అనటంలో సందేహంలేదు. అయితే అసైన్డ్ భూములను కబ్జాచేశారనే ఆరోపణలు ఈటెల మీద కూడా ఉన్నాయి. బీఆర్ఎస్(BRS) లో నుండి ఈటల బహిష్కరణకు గురైన తర్వాత ఈటల భాగోతం అంటు కారుపార్టీ నేతలు చాలా విషయాలను వెలుగులోకి తెచ్చారు. అందులో అసైన్డ్ భూములను ఈటల కబ్జాచేశారనేది కూడా ఒకటి. కోళ్ళ ఫాం వ్యాపారంచేస్తున్న ఈటల తన వ్యాపార విస్తరణ కోసం పేదల భూములను కబ్జాచేశారని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు చాలా ఆరోపణలు చేశారు. తర్వాత ప్రభుత్వం ఈటల స్వాధీనంలో ఉన్న భూములపై సర్వేలు చేయించింది. ఆ సర్వేలో ఈటల కబ్జా నిజమే అని రెవిన్యు అధికారులు తేల్చినట్లు కారుపార్టీ నేతలు ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనంచేసుకుంటుందని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. అప్పట్లో కబ్జాఆరోపణలు ఎదుర్కొన్న ఈటల ఇపుడు పేదల భూములను కబ్జాచేసే సహించేదిలేదని వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

సరే, ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షపదవి రేసులో ఈటల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీని బలోపేతంచేయటంలో భాగంగా నరేంద్రమోడి(Narendra Modi), అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటనలో బీసీ మంత్రాన్ని వినిపిస్తున్నారు. ఈటల ఐదుసార్లు ఎంఎల్ఏగా, రెండుసార్లు మంత్రిగా ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా పనిచేస్తున్నారు. కాబట్టి ఎంఎల్ఏగా, మంత్రిగా, ఎంపీగా విశేష అనుభవం ఉన్న ఈటలకే పార్టీపగ్గాలు దక్కుతాయనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇదేసమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మహబూబ్ నగర్, మెదక్ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు మాజీ ఎంఎల్సీ ఎన్ రామచంద్రరావు పేర్లు కూడా వినబడుతున్నాయి.

అధ్యక్షుడిపేరు పరిశీలనలో ఉందనే ప్రచారం నేపధ్యంలో ఈటల రియల్ ఎస్టేట్ దళారీపై ఎందుకు చేయిచేసుకున్నారనే చర్చ మొదలైంది. నిన్నటివరకు ఈటల సౌమ్యుడు అనే పేరుమాత్రమే ఉంది. నిజానికి ఆయన డైలాగుల్లో పెద్దగా పంచ్ ఉండదు. మనిషి మనస్తత్వం కూడా దూకుడేమీ కాదు. అలాంటిది సడెన్ గా ఈటల రియల్ ఎస్టేట్ దళారీపై చేయిచేసుకున్నారంటే తాను అవసరమైతే దూకుడుగా కూడా ఉంటానని హైకమాండుకు సంకేతాలు ఇవ్వటమేనా ? అనే చర్చ పెరిగిపోతోంది. మరి తాజాపరిణామాలను బీజేపీ అగ్రనేతలు ఏ విధంగా చూస్తారో ?

Tags:    

Similar News