తిరుమలకు ఒక్కసారిగా భక్తులు ఎందుకు పోటెత్తారంటే..

తెలుగునాట భక్తి రసం ఉప్పొంగుతోంది. తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. శ్రీవారి దర్శనానికి గంటగంటకూ రద్దీ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి..

Update: 2024-05-24 12:46 GMT

తెలుగునాట భక్తి రసం ఉప్పొంగుతోంది. తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. శ్రీవారి దర్శనానికి గంటగంటకూ రద్దీ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి సుమారు మూడున్నర కిలోమీటర్ల క్యూ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం దాటి సుమారు 3.5 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. టీటీడీ అధికారుల అంచనా ప్రకారం శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. క్యూ కాంప్లెక్స్ లు నిండిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ- భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తోంది. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పిల్లలకు పాలు అందిస్తున్నారు. మరో మూడు రోజులు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్టు టీటీడీ అంచనా వేస్తోంది.

వీఐపీ దర్శనాలు రద్దు…

భక్తుల తాకిడి పెరగడంతో శుక్ర, శని, ఆదివారాలలో ప్రముఖలకు ఇచ్చే వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. వేసవి సెలవులు, పోలింగ్‌ ప్రక్రియ పూర్తవడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే 30-40 గంటల సమయం క్యూలైన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు గానూ జూన్‌ 30వ తేదీ వరకు వారాంతాల్లో (శుక్ర, శని, ఆది) వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

టైమ్‌ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. గురువారం రాత్రికి భారీగా భక్తులు వేచి ఉండటంతో కొత్తగా భక్తుల్ని క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల నుంచే క్యూలైన్లలోకి రావాలని భక్తులకు టీటీడీ సూచించింది. క్యూలైన్లకు వచ్చే భక్తులు బస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులకు వేసవి సెలవులతో పాటు వారాంతంలో వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. మరోవైపు ఆగస్టు నెల కోటాకు సంబంధించి రూ.300 తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు www.ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. వసతి గదుల కోటాను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు.

గురువారం తిరుమల శ్రీవారిని 65,416మంది దర్శించుకున్నారు. 36,128మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.3.51కోట్లు లభించాయి. సర్వదర్శనం టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం కోసం 24గంటల సమయం పడుతోంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 24న శుక్ర‌వారం ఉదయం నుంచే కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

Tags:    

Similar News